logo

శ్రీలంక తమిళులకు రూ.11.90 లక్షల సాయం

శ్రీలంక తమిళుల సహాయార్థం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ డీఎంకే కౌన్సిలర్లు రూ.11.90 లక్షల వితరణ అందించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేశ్‌కుమార్‌ తదితరులు శనివారం తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో

Published : 25 Sep 2022 01:27 IST

సీఎంకు బ్యాంకు చెక్‌ అందిస్తున్న మేయర్‌ ప్రియ

చెన్నై, న్యూస్‌టుడే: శ్రీలంక తమిళుల సహాయార్థం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ డీఎంకే కౌన్సిలర్లు రూ.11.90 లక్షల వితరణ అందించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేశ్‌కుమార్‌ తదితరులు శనివారం తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి శ్రీలంక తమిళుల సహాయార్థం రూ.11.90 లక్షల బ్యాంకు చెక్‌ను సీఎం జనరల్‌ ఫండ్‌కు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, శేఖర్‌బాబు, ఎంపీలు టీఆర్‌ బాలు, రాజా, రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు ఛైర్మన్‌ పూచ్చి మురుగన్‌, మాజీ ఎంపీ టీకేఎస్‌ ఇళంగోవన్‌, కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సిట్రరసు, కార్పొరేషన్‌ అధికారపక్ష నేత రామలింగం ఉన్నారు.

భాషా ప్రచారమే ‘తమిళ్‌ పరప్పురై కళగం’ లక్ష్యం
చెన్నై, న్యూస్‌టుడే: తమిళం చదవడం, రాయడం, మాట్లాడటం మర్చిపోయిన దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న తమిళులకు మాతృభాషను నేర్పించడం, భాషను ప్రచారం చేయడమే ‘తమిళ్‌ పరప్పురై కళగం’ లక్ష్యమని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. నగరంలోని అన్నా విశ్వవిద్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమిళం అనేది భాష మాత్రమే కాదని, మన ప్రాణమని తెలిపారు. అలాంటి భాషకు ప్రచార సంస్థను ప్రారంభించడం తన జీవిత బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సమాచార, సాంకేతిక రంగానికి పునాదులను డీఎంకే సర్కారే వేసిందని తెలిపారు. దానికి నేటికీ నిదర్శనంగా టైడల్‌ పార్కు ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు తమిళులు పనిచేయడానికి కూడా కరుణానిధే పునాదులు వేశారని తెలిపారు. తమిళులు 30కుపైగా దేశాల్లో అత్యధికంగా, 60కుపైగా దేశాల్లో స్వల్పసంఖ్యలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. 24 భాషల్లో తమిళ పాఠ్యపుస్తకాలు విడుదల చేశారన్నారు. తొలివిడతగా 25వేల మంది లబ్ధిపొందనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, సుబ్రమణియన్‌, కేఎన్‌ నెహ్రూ, మనో తంగరాజ్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని