logo

Sasikala: విదేశాల్లో చికిత్సకు జయలలిత నిరాకరణ

మాజీ సీఎం జయలలిత మరణం వెనక ఎవరైనా ఉన్నారా? అనే అంశం అనేక మలుపుతూ తిరుగుతూ వస్తోంది. ఎన్నో అనుమానాల్ని కమిషన్‌ వ్యక్తం చేసింది. తొలిగా శశికళవైపే వేలు చూపించింది. మరోవైపు కమిషన్‌కు సమాధానమిచ్చే క్రమంలో శశికళ బెంగళూరు జైలులో ఉన్నప్పుడే అఫిడవిట్‌ దాఖలు చేశారు

Updated : 26 Oct 2022 08:45 IST

డీఎంకే వేధింపుల వల్లే క్షీణించిన ఆరోగ్యం
అఫిడవిట్‌లో శశికళ పేర్కొన్నట్లు కమిషన్‌ వెల్లడి

- ఈనాడు, చెన్నై

మాజీ సీఎం జయలలిత మరణం వెనక ఎవరైనా ఉన్నారా? అనే అంశం అనేక మలుపుతూ తిరుగుతూ వస్తోంది. ఎన్నో అనుమానాల్ని కమిషన్‌ వ్యక్తం చేసింది. తొలిగా శశికళవైపే వేలు చూపించింది. మరోవైపు కమిషన్‌కు సమాధానమిచ్చే క్రమంలో శశికళ బెంగళూరు జైలులో ఉన్నప్పుడే అఫిడవిట్‌ దాఖలు చేశారు. అందులో చాలా కీలక విషయాలున్నాయి. వాటిలో కొన్ని ఆమె మాటల్లోనే...

‘‘నాకు జయలలితతో 1984 నుంచి మంచి స్నేహం. ఎంజీఆర్‌ మరణం తర్వాత నుంచి పోయెస్‌ గార్డెన్‌లో తనతోపాటే ఉన్నాను. అదే నా శాశ్వత చిరునామా కూడా. తనని ‘అక్కా’ అనే పిలుస్తాను. అక్క మరణం నన్నెంతో కలచి వేసింది. ఆమె తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. డీఎంకే పెట్టిన అన్యాయపు కేసుల్ని సైతం కోర్టులో ఎదుర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 24న పుదుచ్చేరి నుంచి అక్క, నేను తిరిగొస్తుండగా మా కారును లారీతో ఢీకొట్టి డీఎంకే మమ్మల్ని చంపాలని చూసింది. దేవుడి దయవల్ల మేం బతికిబయటపడ్డాం. అప్పటి ప్రమాదంలో దెబ్బతిన్న నా ఎడమకన్ను నుంచి ఇప్పటికీ నీరు కారుతూనే ఉంటుంది. ఇలా ఎన్నో ఎదుర్కొన్నాం.

మందులపై స్పష్టత తీసుకుని..
2016 ఫిబ్రవరి/మార్చి నుంచే అక్కకు నడవటం కష్టమయ్యేది. వైద్యులు మందులు రాసినా.. వాటిపై స్పష్టత తీసుకున్న తర్వాతే వాడేవారు. ఈ అలవాటు తనకు మొదటినుంచే ఉంది. నా బంధువు డాక్టర్‌ శివకుమార్‌ అక్క సూచన మేరకు వైద్యులతో సమన్వయం చేస్తుండేవారు. అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో నడవలేని స్థితి ఉండటంతో కారు దిగేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయించుకున్నారు. పోయెస్‌ గార్డెన్‌లో అక్కకు కావాల్సిన ఏర్పాట్లు నేను చూసుకునేదాన్ని. నడకలో తీవ్ర ఇబ్బంది ఉండటంతో ఆమె వైద్యుల సూచనమేరకు చేతిలో ఫ్లాష్‌ గ్లూకోస్‌ అకౌంటింగ్‌ సిస్టం క్లాత్‌ను వాడేవారు. ఇది బయటికి కనిపించేదికాదు. ఈ పరికరం ప్రతీ 35 రోజులకోసారి చక్కర స్థాయుల్ని లెక్కించేది. ఇలాంటి 7, 8 పరికరాలు ఆమె వాడేవారు. ఇలాంటి స్థితిలో అక్కడ అప్పటి సాధారణ ఎన్నికల్లో 134 సీట్లతో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అనారోగ్య కారణాలతోనే తాను చెన్నై ఆర్కేనగర్‌ నుంచే పోటీచేశారు.

కాపాడుకుంటూనే వచ్చా
నేనెప్పుడూ రాజకీయాలు, ప్రభుత్వ పాలనలో తలదూర్చలేదు. కొన్ని సమయాల్లో పార్టీ విషయాల్లో ద్వితీయశ్రేణి నాయకులకు విషయాన్ని నా ద్వారా చేరవేసేవారు. ప్రజాసంక్షేమం కోసం అవసరమనే కోణంలో ఆమెను కాపాడుకుంటూనే వచ్చాను. 2014లో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు నేనేం చేశానో అప్పటి అధికారులు, వ్యక్తిగత భద్రతాసిబ్బందికి తెలుసు. నాకు బీపీ, మధుమేహమున్నా ఆమెకు తక్కువ చేయలేదు. ప్రతీ 3 నెలలకు అక్క అపోలో ఆసుపత్రిలో వైద్యపరీక్షలకు వెళ్లినప్పుడు నేనూ చేయించుకునేదాన్ని. అపోలో ఆసుపత్రి వైద్య ప్రమాణాల మీద అక్కకు ఎంతో నమ్మకం. రోజూ బీపీ, చక్కెర స్థాయులు, ఏ సమయంలో ఏం తిన్నారో వంటి వాటివి రాసుకునే అలవాటు తనది.

వీడియోలు తీయమని కోరిన అక్క
2016 ఎన్నికలకు ముందు నుంచి అక్క ఆదేశాల మేరకు ఆమెకందే వైద్యం మీద వీడియోలు తీసి తనకు ఇచ్చేదాన్ని. అపోలో ఆసుపత్రిలోనూ ఇదే జరిగింది. వీడియోలు తీయమని అక్క నన్ను వ్యక్తిగతంగా అడిగింది. ఆ తర్వాత విడతలవారీగా తనకు ఇచ్చేదాన్ని. ‘శశి ట్రాకియోస్టొమీ గొంతుకు పెట్టారు. నేను చూడలేకపోతున్నాను, వీడియో తియ్యి’ అనేది. తర్వాత వీడియోల్లో చూసుకునేది. ఫిజియోథెరపీ చేయించే వీడియోలూ అంతే. కొన్నాళ్లకు తను కూర్చోవడం, నడవటం మొదలుపెట్టింది. వైద్యుల సూచన మేరకే ప్రొటీన్లు ఇచ్చేవారు. అక్క కోరిక మేరకు వంటగది ఏర్పాటుచేశారు. అపోలో ఆసుపత్రిలో వైద్యం బాగానే జరిగింది. అక్క గదికి పక్కనే నాకు గదిచ్చారు. అందులోని అద్దాల నుంచే వైద్యం తీరును చూసేదాన్ని. ఇన్‌ఫెక్షన్‌ ఉందని ఎవరినీ లోపలికి అనుమతించేవారు కాదు. వ్యక్తిగత భద్రతాసిబ్బంది షిఫ్టులవారీగా రోజూ 24 గంటలూ అక్క గదిని పర్యవేక్షించేవారు.

టీవీ చూస్తూ..
అక్కకు ఆహ్లాదంగా ఉండాలని ఆమె గదిలో ప్లాస్టిక్‌ మొక్కల్ని కూడా పెట్టించి ముస్తాబు చేయించా. తలవైపు తాను కొలిచే దైవాల్ని తను తలతిప్పితే కనిపించేలా ఉంచాను. తన కోరిక మేరకు ఆసుపత్రివారే టీవీ పెట్టించారు. జయటీవీలో ‘జై వీర హనుమాన్‌’ సీరియల్‌ చూసేవారు. తనకు నచ్చిన పాటల్ని పెన్‌డ్రైవ్‌లో, డీవీడీల్లో వేసి వినిపించేవారు. భక్తిపాటల్ని ఉదయం, సాయంత్రం వినేవారు. డిసెంబరు 4న మధ్యాహ్నం 4.20కి అద్దాలు ధరించి ‘జై వీర హనుమాన్‌ చూస్తున్నారు. బన్‌, కాఫీ చల్లారిపోతుంది అన్నప్పుడు ‘సీరియల్‌ అయ్యాక తీసుకుంటా, ఓర్పుగా ఉండు శశీ’ అన్నారు. సీరియల్‌ అవగానే టీవీ ఆఫ్‌చేసి. కాఫీ, బన్‌ ఉన్న ట్రాలీని దగ్గరికి తీసుకున్నారు. అక్కడ పక్కన నర్సు కూడా ఉన్నారు. ఒక్కసారిగా అక్క శరీరంలో తీవ్ర వణుకు వచ్చింది. నాలుకను పళ్లతో కొరుక్కుంది. మేం షాక్‌కు గురయ్యాం. తను నావైపు చూసి చేతులు చాచింది. ఒక్క ఉదుటున ఆమెను పట్టుకున్నాను. బెడ్‌మీద పడుకోట్టాం. గుండెపోటు వచ్చిందని వైద్యులు చెప్పారు. డిసెంబరు 4న అక్కకు గుండె సరిగా కొట్టుకోలేదు. ఎక్మో అమర్చితే మెరుగవుతుందన్నారు. మంచి ఫలితమే వస్తుందనుకున్నాం. డాక్టర్‌ రిచర్డ్‌ బాలె, ఎయిమ్స్‌ వైద్యుల సూచనలమేరకు అపోలో వైద్యులు స్పందిస్తున్నారు. 5న షాకింగ్‌ న్యూస్‌. తాను స్పందించడంలేదని వైద్యులు చెప్పారు. నిర్ణయం తీసుకోమని అన్నప్పుడు మూర్ఛపోయాను.
మానసిక క్షోభకు గురయ్యారు
2014 సెప్టెంబరు 27న బెంగళూరు స్పెషల్‌కోర్టు మాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. కోర్టులో వేసిన తప్పుడు కేసులతో అక్క ముఖ్యమంత్రిగా దిగిపోయి బెంగళూరు జైలుకు వెళ్లింది. ఆ సమయంలో తీవ్ర మానసిక వేదనని అనుభవించారు. 22రోజుల జైలు జీవితంలో తనపై జరిగిన పరువునష్టాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలనుకున్నారు. బెయిల్‌ మీద వచ్చినా, విచారణ సమయంలో మానసిక క్షోభను ఎదుర్కొన్నారు. ఆమె మీద డీఎంకే పెద్ద మచ్చే వేసింది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడే ఆమె శరీరంలో దురద రావడం మొదలైంది. ఒత్తిడిలేని జీవితాన్ని ఆరంభించాలని చాలామంది వైద్యులు సూచించారు. ఏ స్థితిలో ఉన్నా ఆమె ప్రజలకోసమే పరితపించారు.
ఆసుపత్రికి వెళ్లేటప్పుడూ మాట్లాడారు..
2016 జూన్‌ నుంచే అక్కకు ఒళ్లంతా దురద, పొక్కులు రావడం, సొరియాసిస్‌ లాంటివి ఎక్కువయ్యాయి. వైద్యుల్ని పిలిపించి సలహాలు తీసుకునేవారు. ఈ సమయంలో ప్రభుత్వ పనులు కష్టంగా ఉండేవి తనకు. సెప్టెంబరు తొలివారంలో డాక్టర్‌ రవిచంద్రన్‌, పార్వతి పోయెస్‌గార్డెన్‌కు వచ్చి చర్మసమస్యలకు స్టెరాయిడ్స్‌ చిన్నడోసుల్ని ఇచ్చేవారు. ఉపశమనం కోసం స్టెరాయిడ్‌ మాత్రల్ని ఇచ్చారు. తర్వాత డోసు తగ్గించారు. అదే నెల 19న డాక్టర్‌ శివకుమార్‌ శబరిమల వెళ్లినప్పుడు తనకి ఫోన్‌చేసి అపోలో ద్వారా మూత్రం, రక్తపు పరీక్షలు నిర్వహించాం. 21న అక్కకు జ్వరం తీవ్రమైంది. ఆ రోజు అధికారిక కార్యక్రమాల్ని రద్దు చేసుకోమని సలహా ఇచ్చాను. కానీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మెట్రోరైల్‌ సంబంధిత కార్యక్రమానికి వస్తున్నారని, తప్పకుండా హాజరవ్వాలన్నారు. ఆ కార్యక్రమంలోనే అనారోగ్యానికి గురయ్యారు. అది పూర్తి కాగానే పోయెస్‌ గార్డెన్‌ వచ్చేశారు. సేద తీరాక మెరుగ్గా ఉన్నానన్నారు. 22న సచివాలయం నుంచి వచ్చిన దస్త్రాల్ని కూడా చూడలేకపోయారు. అదేరోజు సాయంత్రం అక్క పరిస్థితి చూసి ఆసుపత్రికి వెళ్దామని సూచించాను. ఆసుపత్రికెళ్తే అడ్మిట్‌ అవమంటారు, కాస్త పడుకుంటే తగ్గుతుందని చెప్పింది. రాత్రి 9.30గంటల ప్రాంతంలో బాత్రూంలో బ్రష్‌ చేసి ముఖం కడుక్కున్నాక ‘శశీ.. తలనొప్పిగా ఉంది, రా’ అని పిలిచారు. ఆమెను బెడ్‌మీద కూర్చోబెట్టగానే ఉన్నట్లుండి స్పృహ కోల్పోయారు. సహాయక చర్యల్లో శివకుమార్‌ కూడా ఉన్నారు. తర్వాత అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాం. ఆ సమయంలో నేను ఒత్తిడికి గురయ్యాను. అంబులెన్స్‌లో గ్రీమ్స్‌రోడ్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా అక్క స్పృహలోకి వచ్చి ‘నేనెక్కడున్నాను’ అన్నారు. చేతిని గట్టిగా పట్టుకుని ‘ఆసుపత్రికి వెళ్తున్నాం. కంగారొద్దు’ అని చెప్పాను.
ఏ తప్పూ చేయలేదు
3 నియోజకవర్గాల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్క స్పృహలోనే ఉన్నారు. అక్టోబరు 27న ఫారం ఏ, బీలపై వేలిముద్ర కూడా వేశారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచింది. అక్క విషయంలో నేను ఏ తప్పూ చేయలేదు. కానీ ఉద్దేశపూర్వకంగా నా పేరుప్రతిష్ఠలకు భంగం కలిగించారు. జె.దీప, ఆమె తల్లి నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. కమిషన్‌ ఆరోపణలు, వచ్చిన ఫిర్యాదుల్లోనూ వాస్తవం లేదు’’.
ఏర్పాట్లన్నీ చేశాను..
అక్క విదేశాల్లో చికిత్సకు నిరాకరించారు. ‘ఇప్పుడు నడవటం మొదలుపెట్టాను. వ్యాయామాలు కూడా చేస్తున్నాను, అక్కడికెళ్లాల్సిన అవసరం లేదు’ అనేవారు. 2016 నవంబరులో పార్లమెంటులో ఎలా వ్యవహరించాలనే తీరుపై ఎంపీలకు స్వయంగా లేఖ కూడా రాశారు. డిసెంబరు 29న డిశ్ఛార్జి అవుతామని అనుకున్నాô. శుభవార్త వినగానే.. నేను వారానికోసారి పోయెస్‌గార్డెన్‌ వెళ్లి అక్క మేలుకోసం దీపాలు వెలిగించి ఆరాధన చేసేదాన్ని. మెట్లు ఎక్కలేదని లిఫ్టు కూడా ఏర్పాటు చేయించాను. అక్క ఇంటికొచ్చాక అవసరమైనవన్నీ సిద్ధంగా ఉంచాను. వైద్యం కోసం ప్రత్యేక దుస్తుల్ని స్వయంగా కుట్టించాను. ఆసుపత్రిలో తనకు వైద్యం చేసిన వైద్యులు, నర్సులను అక్క పలకరించేవారు. నవ్వుతూ ఉండేవారు. తనని కలవడానికి వచ్చినవారిని చూసేందుకు ఇష్టపడేవారు కాదు. కర్ణాటక హైకోర్టులో కేసు తీర్పు వచ్చిన తర్వాతే కలుస్తానని అనేవారు. పోయెస్‌గార్డెన్‌కు మంచి ఆరోగ్యంతో వెళ్లిన తర్వాత చూద్దామనేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని