logo

వర్షబాధిత రైతులకు పరిహారం

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటకు తగిన పరిహారాన్ని బాధిత రైతులకు అందించనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు.

Published : 07 Feb 2023 01:33 IST

సీఎంకు నివేదిక అందజేస్తున్న మంత్రులు పన్నీర్‌సెల్వం, చక్రపాణి

చెన్నై, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటకు తగిన పరిహారాన్ని బాధిత రైతులకు అందించనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ఇటీవల డెల్టా, ఇతర జిలాల్లో కురిసిన అకాల భారీవర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న వరి, ఇతర పంట నీటమునిగి దెబ్బతిన్న విషయం తెలిసిందే. పంటనష్టం అంచనాల సేకరణకు మంత్రులు ఎమ్మార్కే పన్నీర్‌సెల్వం (వ్యవసాయం), చక్రపాణి (ఆహార), సీనియర్‌ అధికారులతో కూడిన బృందాన్ని ప్రభావిత జిల్లాలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పంపారు. ధాన్యం సేకరణ నిబంధనల్లో సడలింపులు కోరుతూ ప్రధానికి లేఖ కూడా రాశారు. తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, మయిలాడుతురై జిలాల్లో మంత్రుల నేతృత్వంలోని బృందం ఆదివారం పర్యటించి అన్నదాతలు, రైతు సంఘాల ప్రతినిధులను కలిసింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మంత్రులు ఎమ్మార్కే పన్నీర్‌సెల్వం, చక్రపాణి కలిసి నివేదిక సమర్పించారు. అందులోని ప్రతిపాదనల ఆధారంగా బాధిత రైతుల సంక్షేమం దృష్ట్యా సహాయ ప్యాకేజీ అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు... కోతకు సిద్ధంగా ఉండి భారీవర్షాలతో దెబ్బతిన్న వరిపంటకు ్టపరిహారంగా విపత్తు నిర్వహణ మార్గదర్శకాల మేరకు 33 శాతం, దానికిపైగా దిగుబడి నష్టం జరిగితే హెక్టారుకు రూ.20 వేల చొప్పున,  పప్పుదినుసుల పంటకు హెక్టారుకు రూ.3 వేల చొప్పున, వరి బీడులో మినుము చల్లి భారీవానతో నష్టపోయిన రైతులకు మళ్లీ మినుము సాగు చేసేందుకు 50శాతం రాయితీలో హెక్టారుకు 8 కిలోల విత్తనాలు,  డెల్టా జిల్లా రైతులు వెంటనే వరికోత చేపట్టేందుకు వ్యవసాయ ఇంజినీరింగ్‌ శాఖ ద్వారా 50శాతం సబ్సిడీలో బాడుగకు వరికోత యంత్రం అందించనున్నట్టు ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రులు ఎమ్మార్కే పన్నీర్‌సెల్వం, చక్రపాణి, ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు, రెవెన్యూ పరిపాలనశాఖ కమిషనరు ఎస్కే ప్రభాకర్‌, ఆహారశాఖ అదనపు ప్రధానకార్యదర్శి రాధాకృష్ణన్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి సమయమూర్తి, సంచాలకులు అన్నాదురై తదితరులతో ముఖ్యమంత్రి  సమావేశమయ్యారు.

ప్రభుత్వ భవనాలకు శంకుస్థాపన

చెన్నై, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమం, మహిళా హక్కుల శాఖ తరఫున చెంగల్పట్టు జిల్లాలో రూ.42.95 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవనాలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. వాటిలో ఆత్తూరులోని బాలల సంస్కరణాలయం ప్రాంగణంలో రూ.15.95 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవనం, ఆత్తూరులో రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమగ్ర శిక్షణ కేంద్రం ఉన్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, సాంఘిక సంక్షేమం, మహిళా హక్కుల శాఖ ముఖ్యకార్యదర్శి షున్‌చోంగం జటక్‌ చిరు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిరాటంకంగా ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలు

చెన్నై, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీలకు నిరాటంకంగా సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. ఎస్టీ, ఎస్టీ సంక్షేమశాఖ తరఫున అమలు చేస్తున్న పలు పథకాల గురించి సచివాలయంలో సోమవారం స్టాలిన్‌ సమీక్ష నిర్వహించారు.  విద్యార్థులకు ఉపకార వేతన పథకాలు, బాలికల విద్య ప్రత్యేక ఉపకారవేతన పథకం,  పాఠశాలలు, వసతి గృహాల నిర్వహణ, ఉచిత ఇంటి స్థల పట్టాల అందజేత, శ్మశాన వాటికలకు దారి ఏర్పాటు,  నివాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రాష్ట్ర ఎస్సీ గృహనిర్మాణ, అభివృద్ధి సంస్థ (తాడ్కో) ద్వారా అమలు చేస్తున్న ప్రాజెక్టులపై ఆయన ఆరా తీశారు. ఇంటిస్థల పట్టాల అందజేతకు సంబంధించి భూపరిపాలన కమిషనరు, జిల్లా కలెక్టర్లతో చర్చించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని, ఇప్పటికే అందించిన పట్టాలు లబ్ధిదారులకు సక్రమంగా కొలతలు వేసి చూపించాలని, అక్కడ ఇళ్లు నిర్మించడానికి అనుకూల పరిస్థితులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వివక్షకు గురైన బాధితులకు ఆర్థిక సాయం, ఉపాధి కల్పన, కారుణ్య ప్రతిపాదికన ఉద్యోగ నియామకాలు, విద్యా ఉపకార వేతనం వంటివాటిని నిరాటంకంగా అందించాలని పేర్కొన్నారు. ఇళ్లు, పింఛను కోసం అందించే వినతులపై సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆదిద్రావిడుల సంక్షేమ మంత్రి కయల్‌విళి సెల్వరాజ్‌, తాడ్కో ఛైర్మన్‌ మదివాణన్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, ఆర్థికశాఖ అదనపు ప్రధానకార్యదర్శి మురుగానందం తదితరులు పాల్గొన్నారు

బాలుడి కుటుంబానికి సాయం ప్రకటన

చెన్నై, న్యూస్‌టుడే: చెంగల్పట్టు ప్రభుత్వ జువైనల్‌ హోంలో డిసెంబరు 31న మరణించిన గోకుల్‌శ్రీ కుటుంబానికి ముఖ్యమంత్రి సాయం ప్రకటించారు. మృతుడి తల్లి ప్రియకు రూ.7.5 లక్షలు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.2.5 లక్షలుగా మొత్తం రూ.10 లక్షలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హోం అధికారులు ఆరుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు.  అర్బన్‌ హాబిటాట్‌ అభివృద్ధి మండలి ద్వారా చెంగల్పట్టు జిల్లా తాంబరం తాలూకాలోని అన్నై అంజుగం నగర్‌ ప్రాజెక్టు ఏరియాలో నిర్మాణంలో ఉన్న బహుళంతస్తు నివాసాల్లో ఓ ఇల్లును మృతుడి తల్లికి కేటాయించాలని ఆదేశించారు. బాలల న్యాయవ్యవస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న జువైనల్‌ హోంలు, ప్రత్యేక హోంలు, సంరక్షణ కేంద్రాల వంటివాటి పనితీరు,  నిర్వహణ తీరును పెంపొందించేందుకు మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, స్వచ్ఛంద సంస్థల తరఫున ఓ ప్రతినిధితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.

సీపీఎం కృతజ్ఞతలు

చెన్నై, న్యూస్‌టుడే: గోకుల్‌శ్రీ కుటుంబానికి సాయం ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ కృతజ్ఞత తెలిపారు. ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో... చెంగల్పట్టు జువైనల్‌ హోంలో హత్యకు గురైన గోకుల్‌శ్రీ కుటుంబానికి  పరిహారం అందించాలని, రాష్ట్రంలోని ఇతర హోంల పనితీరు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని గతంలో అభ్యర్థించినట్టు గుర్తు చేశారు. ఈ మేరకు స్పందించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. బాధ్యులను శిక్షించాలని కోరారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని