logo

ఎయిడెడ్‌ కళాశాలలపై నిఘా అవసరం

ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి దరఖాస్తులకు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఎయిడెడ్‌ కళాశాలలపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో నిఘా ఉంచాలని ‘సేవ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మూవ్‌మెంట్ - తమిళనాడు’ (ఎస్‌హెచ్‌ఈఎం - టీఎన్‌) డిమాండు చేసింది.

Published : 05 Jun 2023 01:57 IST

వడపళని, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి దరఖాస్తులకు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఎయిడెడ్‌ కళాశాలలపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో నిఘా ఉంచాలని ‘సేవ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మూవ్‌మెంట్ - తమిళనాడు’ (ఎస్‌హెచ్‌ఈఎం - టీఎన్‌) డిమాండు చేసింది. ఎస్‌హెచ్‌ఈఎం - టీఎన్‌లో విద్యావేత్తలు, విశ్రాంత ఆచార్యులు, మేధావులు సభ్యులుగా ఉన్నారు. అన్ని కళాశాలలు, వర్సిటీలకు అభ్యర్థులను ఎంపిక చేసే విధానం, సీట్ల ఖాళీలు, బోధనా సిబ్బంది, ఫీజుల వివరాలు వెబ్‌సైట్లో ఉంచాలని యూజీసీ ఆదేశించినప్పటికీ ఎవరూ సరిగ్గా పాటించడం లేదని ఎస్‌హెచ్‌ఈఎం టీఎన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని కళాశాలలయితే వెబ్‌సైట్ కూడా లేకుండానే నడుస్తున్నాయన్నారు. వెబ్‌సైట్లున్న కళాశాలలు కూడా ప్రభుత్వం పేర్కొన్న మేరకు ఫీజు, సీట్ల వివరాలు, ఎన్ని కేటాయించారో కూడా తెలియజేయడం లేదని ఎస్‌హెచ్‌ఈఎం రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ ఆర్‌.మురళి అన్నారు. పలు కళాశాలలు దరఖాస్తుల కోసం రూ.300 వరకు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కొన్ని కళాశాలలయితే వెబ్‌సైట్లో మొదటి సెమిస్టర్‌ కింద మొదటి సంవత్సరం బీఏ చదివే వారికి ఎయిడెడ్‌ కోర్సుల్లో రూ.15 వేలకు పైనే అని కూడా వివరిస్తున్నాయి. మరి కొన్ని కళాశాలలు వెబ్‌సైట్ లేదా దరఖాస్తుల్లో వివరాలు లేకుండా, రసీదులు కూడా లేకుండా దాదాపు అంతే ఫీజు వసూలు చేస్తున్నాయి. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అటువంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఎస్‌హెచ్‌ఈఎం సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని