logo

మాజీ మంత్రిపై చర్యలకు ఆదేశాలు

టెండర్‌ కేటాయింపులో జరిగిన అక్రమాల వ్యవహారంలో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణిపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Published : 08 Jun 2023 00:10 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: టెండర్‌ కేటాయింపులో జరిగిన అక్రమాల వ్యవహారంలో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణిపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అన్నాడీఎంకే ప్రభుత్వం చెన్నై కార్పొరేషన్‌ ప్రాంతాల్లో 2018-19 మధ్య రహదారుల పునరుద్ధరణ, వాననీటి కాలువల నిర్మాణాలకు టెండర్లు కేటాయించింది. ఇందులో పలు అక్రమాలు జరిగాయని అప్పటి మంత్రి వేలుమణి, కార్పొరేషన్‌ కమిషనరు కార్తికేయన్‌, అధికారులు, కాంట్రాక్టర్లపై అరప్పోర్‌ ఇయక్కం తరఫున అవినీతి నిరోధక శాఖకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఫిర్యాదుపై చర్యలు చేపట్టలేదని, ఈ విషయమై ప్రాథమిక దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలని ఇయక్కం మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఇది బుధవారం విచారణకు వచ్చింది.  2019లోనే ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందని సర్కారు తరఫున తెలిపారు. దాని ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు 2020 ఫిబ్రవరిలో ఉత్తర్వులు ఇచ్చిందని, దీంతో ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారని, కాబట్టి తదుపరి చర్యలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిని ఆమోదించిన ధర్మాసనం.. ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చని తెలిపింది.

జయకుమార్‌కు వ్యతిరేకమైన వ్యాజ్యం కొట్టివేత

ప్యారిస్‌, న్యూస్‌టుడే: స్థల ఆక్రమణ వ్యవహారంలో మాజీ మంత్రి జయకుమార్‌ వేసిన వ్యాజ్యాన్ని నిరాకరించాలని కోరుతూ ఆయన బంధువు దాఖలు చేసిన పిటిషన్‌ని మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. చెన్నై తురైప్పాక్కంలో ఉన్న స్థల యాజమాన్యానికి సంబంధించి జయకుమార్‌ అల్లుడు నవీన్‌కుమార్‌కి, అతని సహోదరుడు మహేశ్‌కి  విభేదాలున్నాయి.  జయకుమార్‌ రాజకీయ బలంతో బెదిరించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని మహేశ్‌ ఫిర్యాదు చేశారు. చెన్నై సెంట్రల్‌ క్రైం బ్రాంచు పోలీసులు దీనికి సంబంధించి జయకుమార్‌, ఆయన కుమార్తె జయప్రియ, నవీన్‌కుమార్‌లపై కేసు నమోదు చేశారు. మహేశ్‌ తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని జయకుమార్‌ మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేేశారు. దీన్ని నిరాకరించాలని మహేశ్‌ కూడా కోర్టును ఆశ్రయించారు. బుధవారం ఇవి విచారణకు వచ్చాయి. వాదనలు విన్న జస్టిస్‌ కుమరేశ్‌బాబు..  మహేశ్‌ పిటిషన్‌ కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

వారిని మాత్రమే హైకోర్టుకి పంపాలని సూచన

ప్యారిస్‌, న్యూస్‌టుడే: కేసు వివరాలు తెలిసిన పోలీసులను మాత్రమే హైకోర్టుకి పంపాలని డీజీపీకి   న్యాయమూర్తి సూచించారు. మద్రాసు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్లను జస్టిస్‌ జగదీశ్‌ చంద్ర విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఓ వ్యాజ్యంపై విచారణ జరిగింది. అప్పుడు హాజరైన కోయంబత్తూరు వడవళ్లి పోలీస్‌స్టేషన్‌కి చెందిన పోలీసు ఈ కేసుకి సంబంధించిన వివరాలను సరిగ్గా చెప్పలేకపోయారు. అనంతరం జస్టిస్‌ జగదీశ్‌ చంద్ర కేసు వివరాలు తెలిసిన పోలీసులను మాత్రమే హైకోర్టుకి పంపాలని పలుసార్లు చెప్పామన్నారు. ఇలా చేయడంతో కోర్టు సమయం వృథా అవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు వివరాలు తెలిసిన పోలీసులను మాత్రమే హైకోర్టుకి పంపాలని డీజీపీకి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని