logo

Vijay: రాజకీయాల్లో దళపతి అయ్యేనా?

తమిళనాట కొత్త రాజకీయపార్టీ పెట్టి రాజకీయరంగ ప్రవేశం చేసిన విజయ్‌ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపగలరనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. 

Updated : 05 Feb 2024 09:02 IST

2026 ఎన్నికల్లో విజయ్‌ ప్రభావంపై చర్చ
కలిసొచ్చే అంశాలపై రాష్ట్రంలో విశ్లేషణ

విజయ్‌

తమిళనాట కొత్త రాజకీయపార్టీ పెట్టి రాజకీయరంగ ప్రవేశం చేసిన విజయ్‌ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపగలరనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. 

న్యూస్‌టుడే, సైదాపేట

 ప్రముఖ సినీ నటుడు విజయ్‌ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట నూతన రాజకీయ పార్టీని ప్రారంభించారు. కొన్నేళ్లుగా విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం సాగుతూ వచ్చింది. అనుకున్నట్లే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నటులు రాజకీయాల్లోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఎంజీఆర్‌, జయలలిత నుంచి పలువురు సినీ రంగానికి చెందిన వారు తమ పాపులారిటీతో రాజకీయరంగ ప్రవేశం చేశారు. అదే సమయంలో రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మొదట సినీ రంగంలోకి అడుగుపెట్టి పేరు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారంతా ఇక్కడ రాణించలేరన్నది గమనార్హం. కొత్త పార్టీ పెట్టిన విజయ్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

అన్నాడీఎంకేకు కాస్త కష్టమే

విజయ్‌ ప్రవేశంతో ఏయే పార్టీలకు నష్టం జరుగుతుందనే దానిపై కొందరు రాజకీయ విశ్లేషకులు బేరీజు వేస్తున్నారు. ఆ ప్రకారం తమిళ సినీ రంగానికి సంబంధించినంత వరకు విజయ్‌ ఒక అగ్ర నటుడు. అతనికంటూ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అందులో కుల, మత, భాష, పార్టీలకు అతీతంగా అందరూ ఉన్నారు. అయితే సినీ అభిమానం వేరు, రాజకీయం వేరు. అభిమాని ఆ నటుడికే ఓటు వేస్తారనే నమ్మకం లేదు. దానికి నటులు శివాజీ గణేశన్‌ నుంచి కమల్‌హాసన్‌ వరకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహానేతలు కలైజ్ఞర్‌ కరుణానిధి, పురట్చి తలైవి జయలలిత లేని కాలం ఇది. వారిద్దరినీ దాటి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామిని రెండు పెద్ద పార్టీల వారు తమ నాయకులుగా అంగీకరించారు. డీఎంకేలో నాయకత్వానికి సంబంధించినంత వరకు ఎలాంటి సమస్య లేదు. స్టాలిన్‌ తర్వాత ఎవరు అనేది కూడా దాదాపు ఇప్పుడే నిర్ణయమైంది. అయితే అన్నాడీఎంకే పరిస్థితి అలా లేదు. పళనిస్వామి ద్వంద్వ నాయకత్వాన్ని మార్చి ఏక నాయకుడిగా మారారు. అయినా అన్నాడీఎంకేలో ఇంకా కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శశికళ, పన్నీర్‌సెల్వం, టీటీవీ రూపంలో ముప్పు పొంచి ఉంది. అలాగని అన్నాడీఎంకే స్థానాన్ని విజయ్‌ భర్తీ చేస్తారని చెప్పలేము. అంత సులభంగా ఎవరూ అన్నాడీఎంకేను కదిలించలేరు. అయినా ఆ పార్టీ ఓట్లను స్వల్పంగా చీల్చే అవకాశం లేకపోలేదు.

స్టాలిన్‌, పళనిస్వామి, సీమాన్‌

చిన్న పార్టీలపై ప్రభావం

ప్రధాన పార్టీల తర్వాత చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండేది సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చికి. ఆ పార్టీ ముఖ్య బలమే యువత. విజయ్‌ పార్టీతో నామ్‌ తమిళర్‌ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే వీసీకే, ఎండీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు, పీఎంకే, టీఎంసీ, డీఎండీకే తదితర పార్టీల నుంచి కొందరి ఓట్లు విజయ్‌కు దక్కే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా విజయ్‌ ఇప్పుడే పార్టీ పెట్టడంతో ప్రాథమిక నిర్మాణం జరగలేదు. దాన్ని చాలా బలంగా తయారు చేస్తేనే ఆ ప్రాంతంలో ఉండే విజయ్‌ మద్దతుదారులు ఓటర్లుగా మారుతారు. దానికి విజయ్‌ చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. తమిళ రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు