logo

కవిన్‌ డబ్బింగ్‌ పూర్తి

బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్‌. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్‌ దర్శకత్వంలోని ‘స్టార్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Published : 29 Mar 2024 01:13 IST

డబ్బింగ్‌ చెబుతున్న కవిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్‌. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్‌ దర్శకత్వంలోని ‘స్టార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం యువన్‌ శంకర్‌రాజా. దీనికి సంబంధించిన మేకింగ్‌ వీడియో వైరలైంది. చిత్రానికి తన డబ్బింగ్‌ పనులు పూర్తయినట్టు కవిన్‌ ప్రకటించారు. చిత్రం త్వరలో విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది.


క్రికెట్‌ నేపథ్యంతో జేసన్‌ సంజయ్‌ చిత్రం

జేసన్‌ సంజయ్‌

చెన్నై: నటుడు విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్‌’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్‌ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తర్వాత పైచదువులకు విదేశాలకు వెళ్లాడు. నటుడిగా పలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా దర్శకత్వంపై ఆసక్తితో వాటిని సున్నితంగా తిరస్కరించారు. కొన్ని డాక్యుమెంటరీలనూ తీశారు. లైకా ప్రొడక్షన్‌ నిర్మించే ఓ చిత్రానికి సంజయ్‌ దర్శకత్వం వహించడానికి ఒప్పందం కుదిరింది. నటీనటుల గురించి పలు వార్తలు వినిపిస్తున్నా ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ నేపథ్యంతో ఆ చిత్రం ఉంటుందనే వార్తలు కోలివుడ్‌లో వినిపిస్తున్నాయి.


మెగాఫోన్‌ పడుతున్న లక్ష్మీ శరవణకుమార్‌

చెన్నై: తమిళ సాహిత్యంలో ‘ఉప్పునాయ్‌గళ్‌’, ‘రూహ్‌’ తదితర నవలల ద్వారా విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన రచయిత లక్ష్మీ శరవణకుమార్‌. ‘కానగన్‌’ నవల కోసం సాహిత్య అకాడమి నుంచి ‘యువ పురస్కార్‌’ పొందారు. దర్శకుడు వసంతబాలన్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన పలు చిత్రాలకు స్క్రీన్‌ప్లే, సంభాషణల భాగస్వామ్యాన్ని అందించారు. త్వరలో విడుదల కానున్న ‘ఇండియన్‌-2’కు సంభాషణలు రాశారు. ఈ నేపథ్యంలో డిస్నీ హాట్‌స్టార్‌, వికటన్‌ టెలివిజన్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఓ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించడానికి లక్ష్మీ శరవణకుమార్‌తో ఒప్పందం కుదిరింది. ‘లింగం’గా టైటిల్‌ను ఖరారు చేశారు. కదిర్‌ హీరోగా నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ మదురై నేపథ్యంతో రూపొందనుంది. దీనిని ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు.


కథ, స్క్రీన్‌ప్లే ఉంటేనే విజయం

వెట్రిమారన్‌

పేరరసు, వెట్రిమారన్‌

చెన్నై: జీవీ ప్రకాశ్‌ నటించిన ‘కళ్వన్‌’ చిత్రం ఏప్రిల్‌ 4న విడుదల కానున్న నేపథ్యంలో నగరంలో ప్రి రిలీజ్‌ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు పేరరసు మాట్లాడుతూ... ఏనుగు అంటేనే అదృష్టమని, ఏనుగుతో నిర్మించిన ‘అన్నైయోర్‌ ఆలయం’, ‘గుమ్కి’ తరహాలో ‘కళ్వన్‌’ చిత్రం కూడా భారీ హిట్‌ సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు వెట్రిమారన్‌ ఈ వ్యాఖ్యలను ఖండించేలా అదే వేదికపై ‘ఏనుగుతో తీసినా, డైనోజర్‌తో తీసినా స్క్రీన్‌ప్లే, కథ బాగుంటేనే సినిమా ఆడుతుంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.


ప్రముఖ దర్శకుడు శంకర్‌, ఆయన సతీమణి ఈశ్వరి గురువారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి తమ పెద్ద కుమార్తె వివాహ ఆహ్వానపత్రిక అందించారు. చిత్రంలో స్టాలిన్‌ సతీమణి దుర్గా ఉన్నారు.

చెన్నై, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని