logo

విజయానికి చెమటోడ్చుతున్న అన్నామలై

కోయంబత్తూరు నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నామలై ఎదురీదుతున్నారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో భాజపాకు చెందిన సి.పి.రాధాకృష్ణన్‌ ఘన విజయం సాధించారు.

Published : 17 Apr 2024 01:56 IST

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: కోయంబత్తూరు నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నామలై ఎదురీదుతున్నారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో భాజపాకు చెందిన సి.పి.రాధాకృష్ణన్‌ ఘన విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో సీపీఐకి చెందిన నల్లకన్ను సి.పి.రాధాకృష్ణన్‌ చేతిలో ఓటమ పాలవడం గమనార్హం. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భాజపా చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించలేదు. 2019లో అన్నాడీఎంకే పొత్తుతో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి 3.92 లక్షల ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే తరఫున గణపతి రాజ్‌కుమార్‌, అన్నాడీఎంకే అభ్యర్థిగా రామచంద్రన్‌, భాజపా నుంచి అన్నామలై బరిలో ఉన్నారు. అన్నామలైకి మద్దతుగా కోవై, మేట్టుపాళ్యంలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. కోవై సౌత్‌ ఎమ్మెల్యేగా ఆ పార్టీకి చెందిన వానతి శ్రీనివాసన్‌ వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో భారీగా వలస వచ్చి స్థిరపడిన ఉత్తరాదికి చెందిన ఓటర్లు ఉన్నారు. వారందరూ కమలం గుర్తుకే ఓట్లు వేస్తారని భాజపా నాయకులు ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో డీఎంకే, అన్నాడీఎంకేలా బలమైన బూత్‌ కమిటీ సభ్యులు లేకపోవడం భాజపాకు ప్రతికూల అంశంగా ఉంది. డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మగళిర్‌ ఉరమైతొగై, ఉచిత బస్సు పథకం మహిళల్లో అధిక ప్రభావం చూపిస్తుండటం అన్నామలైకి తలనొప్పిగా మారింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, వీసీకే, మనిదనేయ మక్కళ్‌ కట్చిలకు చెప్పకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. మరోవైపు కొంగుమండలంలో మంచి పట్టున్న రాష్ట్ర మంత్రి సెంథిల్‌బాలాజీని ఈడీ అరెస్టు చేసి జైల్లో ఉంచడాన్ని డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావించి అన్నామలైని ఇరకాటంలో పడేస్తున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి రామచంద్రన్‌ మాజీ మంత్రి వేలుమణి, డీఎండీకే, ఎస్‌డీపీఐ నాయకులతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జౌళి పరిశ్రమకు పేరొందిన నియోజకవర్గంలో పదేళ్లలో వందలాది వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయి. ఇందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వమే కారణమని ప్రచారంలో ప్రస్తావించడం, ఇది ఓటర్లను ప్రభావితం చేసుం్తడటంతో అన్నామలై ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని