logo

ఓటేద్దాం.. పదండి

పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఈవీఎంల్లో భద్రంగా నమోదవనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ శుక్రవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Published : 19 Apr 2024 02:46 IST

 నేడు అన్ని పార్లమెంటు స్థానాలకు ఒకేసారి ఎన్నిక
 అన్ని ఏర్పాట్లు పూర్తి
 పోలింగ్‌ కేంద్రాల్లో కట్టుదిట్ట భద్రత

పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఈవీఎంల్లో భద్రంగా నమోదవనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ శుక్రవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. లోక్‌సభలో అడుగుపెట్టే వారెవరో తేల్చేందుకు జరిగే ఈ ఎన్నికను ప్రధానంగా యువతే నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి తర్వాత మహిళల ఓట్లు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. వారు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆఖరున వస్తే.. సాయంత్రం 6గంటల్లోపు పోలింగ్‌ కేంద్రంలోకి ఎవరైతే వస్తారో.. వారంతా ఓటు వేసేవరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఇలా వచ్చిన వారందరికీ టోకెన్లు ఇస్తారు.

ఈ సమయంలోపే.. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు

మూడు కూటముల మధ్యే ప్రధాన పోరు జరుగుతోంది. అత్యధిక స్థానాల్ని ఇదివరకు గెలుచుకున్న డీఎంకే ధీమాగా బరిలో దిగగా.. ఎన్డీయే, దాన్నుంచి వేరైన అన్నాడీఎంకే కూటములు తమ సత్తా చాటుకునేందుకు చెమటోడ్చాయి. ఓటర్లకు తమ సందేశాలు చేరవేశాయి. వారిలో ఎవరికి రాష్ట్ర ప్రజలు పట్టం కడతారనేది ఆసక్తికరంగా ఉంది. ఓటర్లను బాగా పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో యువతే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. మొత్తం ఓటర్లలో వారి సంఖ్యే ఎక్కువగా ఉండటంతో తీవ్రంగా ప్రభావం చూపుతారనే అంచనాలున్నాయి. 18-40ఏళ్ల లోపు ఓటర్లు 40.12శాతం ఉండగా.. 18-50ఏళ్లలోపు వారు ఏకంగా 62.26శాతం ఉన్నారు. ఈ కేటగిరీ ఓటర్లే ఈ ఎన్నికల్ని శాసిస్తారనే విశ్లేషణలు రాజకీయ నిపుణులు చేస్తున్నారు. ఇందులో తొలిసారి ఓటువేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్న 18-19ఏళ్ల వారు 10.92లక్షల మంది ఉన్నారు. మరోవైపు చెన్నైలోని 3 పార్లమెంటు స్థానాల్లో 50ఏళ్లలోపువారు 61.06 శాతం ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

 మహిళలే మహారాణులు

ఈ ఎన్నికల్లో పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వారు కూడా గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటర్లలో 50.88 శాతం వారే ఉన్నారు. అందుకే ఆయా పార్టీలు ప్రచారంలో మహిళా ఆకర్షక హామీలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,06,05,793 మంది పురుష ఓటర్లుంటే మహిళలు 3,17,19,665 మంది ఉన్నారు. 8,467 మంది హిజ్రాలున్నట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. గతంలానే ఈసారి కూడా మహిళలకు ప్రాధాన్యతనిస్తూ.. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కో పోలింగ్‌బూత్‌లో పూర్తిగా మహిళా సిబ్బందే పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. వాటిని ‘పింక్‌ బూత్‌’ అంటున్నారు.

 పోలీసు వలయం

రాష్ట్రంలోని 39 పార్లమెంటు స్థానాల్లో 68,321 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. అన్నిచోట్లా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పోలింగ్‌ సరళి సజావుగా జరిగేందుకు 1.90 లక్షల మంది పోలీసుల్ని రంగంలోకి దించారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా ఆయా పార్లమెంటు పరిధిలోని యంత్రాంగాలు అప్రమత్తమై విధులు నిర్వర్తిస్తున్నాయి. చెన్నై జిల్లాలో 3,726 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ తరహా భద్రత కనిపిస్తోంది.

 ఇక్కడ గట్టి నిఘా..

రాష్ట్రవ్యాప్తంగా 8,050 సమస్యాత్మక పోలింగ్‌బూత్‌లున్నట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడిస్తోంది. ఇందులో 181 అత్యంత సమస్యాత్మకమైనవి ఉన్నాయి. ప్రత్యేకించి ఈ కేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటుచేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్‌బూత్‌లపరంగా చూస్తే.. ఎక్కువగా దిండుక్కల్‌లో 39, ఉత్తర చెన్నైలో 18, అరక్కోణం 15, విళుపురం 14, తిరునెల్వేలి 13, కడలూరులో 11 ఉన్నాయి. గత ఎన్నికల్లో కొన్నిచోట్ల ఒక్క అభ్యర్థికే 75శాతం నుంచి 90శాతం ఓట్లు పోలవడం, కొన్నిచోట్ల కనీసం 10శాతం కూడా జరగకుండా ఉండటం, పలుచోట్ల రీపోలింగ్‌ జరిగిన దాఖలాలుండటం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని కేసులు నమోదవడంలాంటి పలురకాల కారణాల నేపథ్యంలో ఆయా కేంద్రాల్ని అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. మిగిలినచోట్ల కన్నా ఇక్కడ ఎక్కువ భద్రత ఉంచారు. ఈ కేంద్రాల్లో పలుచోట్ల ఓటర్ల గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, ఓటర్లు చనిపోవడంలాంటివి అత్యధికశాతం నమోదయ్యాయని చెబుతున్నారు. మరోవైపు సమస్మాత్మక పోలింగ్‌ కేంద్రాలపరంగా చూస్తే.. మదురై అత్యధికంగా 511 ఉన్నాయి. ఆ తర్వాత దక్షిణ చెన్నైలో 456 ఉన్నాయి. తేని 381, కాంచీపురం 371, శ్రీపెరుంబుదూరు 337, తిరునెల్వేలి 331, విరుదునగర్‌ 314, ధర్మపురి 311, తిరుప్పూరు 293, తూత్తుకుడి 286, రామనాథపురం 262, అరక్కోణం 258, ఉత్తర చెన్నై 254, వేలూరు 246, కోయంబత్తూరు 224, కృష్ణగిరి 208 ఉన్నాయి.

అమెరికా నుంచి సొంతూరికి..

ప్యారిస్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ యువకుడు అమెరికా నుంచి సొంతూరికి వచ్చాడు. తేని జిల్లా చిప్నమనూర్‌ తేరడి వీధికి చెందిన బాలసుబ్రమణి, సుమతి దంపతుల కుమారుడు నాగ అర్జున్‌. అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. ఓటు వేసేందుకు సొంతింటికి చేరుకున్నారు. తనలా విదేశాల్లో పనిచేసే తమిళులందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరాడు. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ఓటు ఆవశ్యకతను అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేయడం స్వాగతించదగ్గ విషయమన్నారు.

ఉచిత వాహన సేవలు..

చెన్నై, న్యూస్‌టుడే: దివ్యాంగులు, 85ఏళ్లకు పైబడిన వయోధికులు 1950 నంబరుకు డయల్‌ చేస్తే ఓటు వేసేందుకు ఉచిత వాహన సేవలు కల్పించనున్నట్లు సత్యప్రద సాహు తెలిపారు. పోలింగ్‌బూత్‌కు వెళ్లే 85ఏళ్లకు పైబడిన వయోధికులు ఓటరు గుర్తింపుకార్డు చూపి బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని, ఇందుకు రవాణా సంస్థ కార్యదర్శి ఉత్తర్వు జారీ చేశారని పేర్కొన్నారు. 85ఏళ్లకు పైబడిన 67వేల మంది తపాలా ఓట్లు వేశారన్నారు. సి విజిల్‌ యాప్‌ ద్వారా బుధవారం వరకు 4,861 ఫిర్యాదు అందాయని తెలిపారు. మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకున్న అందరికీ ఓటరు గుర్తింపు కార్డు అందించినట్లు పేర్కొన్నారు.

ప్రజాస్వామ పండుగలో పాల్గొనాలి: ఏ.ఆర్‌.రెహమాన్‌

చెన్నై, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన యువత ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ పిలుపునిచ్చారు. ఆయన తన ఎక్స్‌ పేజీలో.. ప్రతి పౌరుడికి ఓటు హక్కు ప్రధాన బాధ్యతల్లో ఒకటి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు యువత రికార్డుస్థాయిలో అర్హత సాధించారు. తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


అందరి బాధ్యత..

విల్లివాక్కం: ప్రభుత్వ కళాశాలలో మొదటి ఏడాది డిగ్రీ చదువుతున్నాను. గత ఎన్నికల్లో స్నేహితులు ఓట్లు వేసి వేలికి సిరా గుర్తు చూపినప్పుడు నాకు అవకాశం ఎప్పుడొస్తాందా అని ఎదురు చేశాను. ఈసారి నా కోరిక నెరవేరింది. తొలిసారి ఓటు వేయనున్నాను. ఓటు వేయడంతో ప్రజాస్వామ్యంలో అందరి బాధ్యత. సద్వినియోగం చేసుకోవాలి.

సత్య(19), విద్యార్థిని, ధర్మపురి జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని