logo

Crime News: పెళ్లికి పిలిస్తే ఇంటినే దోచేశాడు

బంధువే కదా అని పెళ్లికి ఆహ్వానించారు.. కల్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలో కుటుంబ సభ్యులందరూ తలమునకలై ఉండగా.. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి తన చేతివాటం ప్రదర్శించాడు ఓ బంధువు

Published : 08 Jan 2022 07:43 IST

బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం

స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, నగదు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: బంధువే కదా అని పెళ్లికి ఆహ్వానించారు.. కల్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలో కుటుంబ సభ్యులందరూ తలమునకలై ఉండగా.. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి తన చేతివాటం ప్రదర్శించాడు ఓ బంధువు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మరో నాలుగు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏడీసీపీ శ్రావణ్‌కుమార్‌, ఏసీపీ పెంటారావు, సీఐలు లూథర్‌బాబు, సింహాద్రినాయుడు శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత నెల 28న నాయుడుతోట ప్రాంతానికి చెందిన మున్షి లియాఖత్‌ ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందురోజు రాత్రి లియాఖత్‌ కుమారుడి వివాహ విందు సుజాతనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో జరగ్గా ఇంటికి తాళం వేసి వారంతా కల్యాణ మండపంలోనే ఉన్నారు. తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా వెనుక తలుపులు తెరుచుకుని ఉన్నాయని 8 తులాల బంగారం, రూ.2.30 లక్షల నగదు పోయినట్లుగా ఫిర్యాదు చేశారు.

సీసీ కెమేరాల సాయంతో..
పోలీసులు దర్యాప్తుల్లో భాగంగా సమీపంలోని సీసీ కెమేరాలను పరిశీలించి రైల్వే న్యూకాలనీకి చెందిన షేక్‌ సాహీద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. వీటితో పాటు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని మరో నాలుగు ఇళ్లలో దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. కంచరపాలెం సమీపంలోని ఓ బ్యాంకులో చోరీ చేయటానికి ప్రయత్నించినట్లుగా ఒప్పుకున్నాడు.

పగలు ఆటో నడపటం రాత్రి దొంగతనం
షేక్‌ సాహీద్‌ పగలు ఆటో నడుపుతూ, రాత్రి సమయంలో తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మున్షి లియాఖత్‌కు బంధువు కావటంతో పెళ్లికి ఆహ్వానించగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ చేశాడు. మొత్తం 5 కేసుల్లో 17 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.3.80లక్షల నగదును అపహరించగా, పోలీసులు అతని నుంచి 15 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.2.45 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. షేక్‌ సాహిద్‌ నుంచి వస్తువులు కొనుగోలు చేసిన భరత్‌కుమార్‌, కళావతి, కామేశ్వరిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని