logo
Published : 29 Jun 2022 03:42 IST

వ్యవసాయం ఇదేనా..!

మూడేళ్లగా మట్టి పరీక్షలు లేవు..
రాయితీపై జింక్‌, జిప్సం ఊసేలేదు
నకిలీల విత్తనాలపై భయాందోళనలు
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి న్యూస్‌టుడే, అనకాపల్లి

ఖరీఫ్‌ సాగుకు దుక్కులు చేస్తున్న రైతు

కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఏరువాక చేపట్టారు. వరి సాగుకు అనుకూలంగా భూములు దుక్కులు చేస్తున్నారు. విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ ఏడాది రాయితీపై ఇచ్చే విత్తనాలను కొంత మేర తగ్గించడంతో రైతులందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు మూడేళ్లుగా భూసార పరీక్షల ఊసే ఎత్తడం లేదు. గతంలో రాయితీపై ఇచ్చే జిప్సం, జింక్‌ వంటి వాటి జోలికి పోవడం లేదు. దీనివల్ల పెట్టుబడి భారం పెరిగిపోతోంది. పంటల దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

భూసారం తెలిసేదెలా..

‘‘భూసార పరీక్ష. మీనేలకు శ్రీరామ రక్ష’’ నినాదంగానే మిగిలిపోతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో చివరిగా 2019లో భూసార పరీక్షలు చేసి విశ్లేషణ కార్డులను అందజేశారు. ప్రతి రెండేళ్లకు ఓసారి భూసారం మారుతుంది. ఈ లెక్కన గత ఏడాది ఖరీఫ్‌కు ముందే పరీక్షలు పూర్తి చేసి వాటి వివరాలు రైతులకు అందించాల్సి ఉంది. ఈఏడాది ఖరీఫ్‌ పనులను రైతులు ప్రారంభించినా ఇంతవరకు నమూనాలను సేకరించలేదు. కొంత మంది అభ్యుదయ రైతులు భూసార పరీక్ష కేంద్రంలో రూ.30 చెల్లించి పరీక్షలు చేయించుకుంటున్నారు. మట్టి నమూనాలు ఇవ్వడానికి ఒకరోజు..ఫలితాలు తెలుసుకోవడానికి మరో రోజు అనకాపల్లి భూసార పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందని దీనివల్ల రెండు రోజుల పనిదినాలు వృథాతో పాటు రానుపోను ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయని అడారి రామారావు అనే రైతు వివరించారు.


గత ఏడాది 831 మంది రైతులు మట్టిపరీక్షలకు డబ్బు చెల్లించారు. ఈ ఏడాది ఇంత వరకూ 104 మంది చేయించుకున్నారు. అదే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో చేయిస్తే ఒక్కొక్క నమూనాకు రూ.300 తీసుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఒక్క రైతు మట్టి పరీక్షలు చేయించుకోలేదు.  


సూక్ష్మపోషకాల ఊసేలేదు

గత ప్రభుత్వం రైతులకు 90 శాతం రాయితీపై జింక్‌, బోరాన్‌తో పాటు జిప్సం అందించింది. జిల్లాలోని 6,348 మంది రైతులకు 2019-20 ఖరీఫ్‌లో 326 టన్నులు పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత సూక్ష్మధాతువులపై రాయితీలు ఎత్తేశారు. బయట మార్కెట్‌లో పది కేజీలు రూ.480 ధర పలుకుతుంది. కొంతమంది రైతులు ప్రైవేటు వ్యాపారులు వద్ద కొనుగోలు చేస్తున్నారు. రాయతీపై ఇవ్వకపోవడంతో వీటి వాడకం తగ్గించేశారు.

తగ్గిపోతున్న రాయితీ విత్తనాలు

రాయితీ వరి విత్తనాలను గత మూడేళ్లుగా తగ్గించుకుంటూ వస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని గత ఖరీఫ్‌ సీజన్‌లో 28,496 క్వింటాళ్లు విత్తనం అందించారు. ఈ ఏడాదికి వచ్చేసరికి 24,136 క్వింటాళ్లు సరఫరా చేయడానికి సిద్ధం చేశారు. అంటే సుమారు 4,360 క్వింటాళ్ల విత్తనాల సరఫరా తగ్గిపోతుంది. రాయితీ విత్తనాలు తగ్గిపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధర పెట్టి కొనుగోలు చేసి కొన్నిసార్లు నకిలీల బారినపడి మోసపోతున్నారు.


ఎక్కడ చేస్తారో తెలీదు: గత మూడేళ్లగా భూసార పరీక్షలు చేయడం లేదు. గతంలో పొలాలకు వచ్చి మట్టి నమూనాలు సేకరించేవారు. ఎరువులు ఏ మోతాదులో వేయాలో తెలిపేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అవసరం అనుకుంటే రైతులనే డబ్బులు పెట్టి పరీక్షలు చేయించుకోమంటున్నారు. అవి ఎక్కడ చేస్తారో కూడా తెలియక వదిలేసుకుంటున్నాం.

-గంగరాజు, రైతు, నాగవరం


ప్రైవేటుగా కొంటున్నాం : మా భూములలో జింక్‌ లోపం ఉంది. దీనివల్ల వరి పంట ఎదుగుదల ఉండటం లేదు. మూడేళ్ల క్రితం సగం రాయితీపై జిప్సం ఇచ్చారు. ఈసారి వేద్దామని అడిగితే జింకు సరఫరా లేదంటున్నారు. ఎకరాన్నర భూమికి 30 కేజీలు జింక్‌ కావాలి. మార్కెట్‌లో అడిగితే రూ.1400 అవుతుందని తెలిపారు.

-టెక్కలి చిననూకరాజు, రైతు, మునగపాక


ఎక్కువ విత్తనాలే ఇస్తున్నాం: ప్రస్తుతం భూసార పరీక్షలు చేయడం లేదు. ప్రభుత్వాలు సూచించిన తర్వాత ఈ పరీక్షలు చేస్తాం. వరి విత్తనాల కోసం అయిదు వేల మందికిపైగా రైతు భరోసా కేంద్రాల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. సాగు విస్తీర్ణంలో మూడో వంతుకు మాత్రమే రాయితీ విత్తనాలను అందిస్తారు. మిగిలిన విత్తనాలు రైతులే సొంతంగా తయారు చేసుకోవాలి. నిబంధనల కంటే రాయితీ విత్తనాలు ఎక్కువే ఇస్తున్నాం.

-జి. లీలావతి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని