logo

నాడి పట్టాలి.. వైకాపా వైపు తిప్పాలి : విప్‌

ప్రజల నాడి పట్టుకోవాలి... తటస్థులను మనవైపు తిప్పుకోవాలని విప్‌ కరణం ధర్మశ్రీ సూచించారు.

Updated : 06 Feb 2023 12:05 IST

ప్రసంగిస్తున్న విప్‌ ధర్మశ్రీ

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రజల నాడి పట్టుకోవాలి... తటస్థులను మనవైపు తిప్పుకోవాలని విప్‌ కరణం ధర్మశ్రీ సూచించారు. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లతో ఆదివారం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ధర్మశ్రీ ప్రసంగిస్తూ.. ‘ఒక్కో వాలంటీరు పరిధిలో 50 ఇళ్లుంటే.. అందులో 30 ఇళ్లు వైకాపా, తెదేపాకు చెందినవే ఉంటాయి. మిగతా 20 ఇళ్ల వారు ఎటు గాలివీస్తే అటు మొగ్గుతారు. ఇలాంటి వారిని మనవైపు తిప్పుకోవాల’ని ప్రబోధించారు. ‘అభిప్రాయ సేకరణకు ఇళ్లకు వెళ్లేవారు నిజాలే రాయండి. మభ్యపెట్టవద్దు. ఎవరైనా మనం నచ్చలేదంటే ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన పది మంది సభ్యుల బృందం వాళ్లతో మాట్లాడుతుంద’ని చెప్పారు. ‘వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ఉమాశంకర్‌ గణేష్‌ గెలిస్తే రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదు. వాళ్లంతా కోమాలోకి వెళ్లిపోతారు. అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటే.. నర్సీపట్నం ఎమ్మెల్యే అంటే సీఎంకు పది శాతం ఎక్కువ ప్రేమ. గణేష్‌ అడగ్గానే నర్సీపట్నం నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టులు సీఎం ఇచ్చారు. పొరుగునున్న మాకు కొంత అసూయగా ఉందం’టూ సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలు 98 శాతం నెరవేర్చాం. సంక్షేమానికి రూ.1.76 లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు కష్టపడిన వారందరినీ పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. గెలిచిన తర్వాత తగిన గుర్తింపు ఇస్తుంద’ని హామీ ఇచ్చారు.

* నారా లోకేశ్‌ది పాదయాత్ర కాదు.. బాధాయాత్ర అని ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా ఉంది. లోకేశ్‌ ఏమైనా నాయకుడా అన్నారు. ఆయన వెంట మూడు వందల మంది కూడా లేరన్నారు. జగన్‌ పాదయాత్రకు గౌరవం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్‌ 3648 కి.మీ. నడిచారన్నారు. తన భార్యను ఎవరూ ఏదీ అనకపోయినా చంద్రబాబునాయుడు దొంగ కన్నీరు పెట్టుకున్నారని విమర్శించారు. నాయకుల చేతుల్లో ఓట్లుండే రోజులు పోయాయి. ‘సీఎం టు కామన్‌ మెన్‌’ మాత్రమే ఇప్పుడు అన్నారు. వాలంటీర్లది విలువైన స్థానమన్నారు.

* ఎమ్మెల్యే ఉమాశంకర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 25 శాతం ఇళ్ల పన్నులు తగ్గించాం, రూ. 169 కోట్లతో ఇంటింటికీ కుళాయిలు ఇవ్వబోతున్నాం. వైద్య కళాశాల కాంక్రీట్‌ పనులు ఈ నెల 8న ప్రారంభంకానున్నాయి. నర్సీపట్నం ప్రధాన రహదారిని వంద అడుగులకు విస్తరిస్తున్నాం. మార్కింగ్‌లు ఇస్తున్నామని చెప్పారు. రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలకు భవనాలు నిర్మిస్తున్నామన్నారు. వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు సహకరించాలని కోరారు. పురపాలక మాజీ వైస్‌ఛైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఛైర్‌పర్సన్‌ ఆదిలక్షి, వైస్‌ఛైర్మన్‌ తమరాన నాయుడు, నాయకులు తమరాన శ్రీను, యాకా శివ, బహీరున్నిషా బేగం, కోనేటి రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. పలువురు కౌన్సిలర్లు, కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని