logo

జోరుగా గ్రావెల్‌ తవ్వకాలు

గ్రావెల్‌ తవ్వకాలు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. ఓ నాయకుడు దుడ్డుపాలెంలో ఓ మెట్టను తవ్వుకునేందుకు రూ. 3.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Published : 09 Feb 2023 04:27 IST

చోడవరం, న్యూస్‌టుడే: గ్రావెల్‌ తవ్వకాలు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. ఓ నాయకుడు దుడ్డుపాలెంలో ఓ మెట్టను తవ్వుకునేందుకు రూ. 3.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రతి రోజు సాయంత్రం ఆ మెట్ట వద్ద ట్రాక్టర్లు, పొక్లెయిన్లు పనిచేస్తున్నాయని గ్రామస్థులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

బీ-ఎన్‌ రహదారిని అనుకుని ఉన్న వ్యవసాయ భూములు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ భూములను ఇళ్ల స్థలాలు, దుకాణాల సముదాయాల నిర్మాణాలకు అనువుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వెంకన్నపాలెం, సీమునాపల్లి, నర్సాపురం, దుడ్డుపాలెం-బుచ్చెయ్యపేట, అడ్డూరు, ముద్దుర్తి, గంధవరం పంచాయతీల పరిధిలో ఉన్న కొండలు, మెట్టల వద్దకు వెళ్లేందుకు రాత్రికి రాత్రే దారులు చేస్తున్నారు. ఈ తవ్వకాలతో వచ్చే గ్రావెల్‌తో  వ్యవసాయ భూములను కప్పి చదును చేస్తున్నారు. భూములను కప్పేందుకు ఎక్కువ మొత్తంలో గ్రావెల్‌ అవసరం. దీంతో గ్రావెల్‌కు సరఫరాకు రూ.లక్షలలో బేరాలు కుదుర్చుకుని గ్రామాలలో తవ్వకాలు సాగిస్తున్నారు.

గనుల శాఖ నోటీసులు..: బి-ఎన్‌ రహదారిని ఆనుకుని భూమిని కొనుగోలు చేసిన ఓ వ్యాపారి తన వ్యాపారాన్ని విస్తరించేందుకు వ్యవసాయ భూమిని గ్రావెల్‌తో కప్పేందుకు సన్నాహాలు ప్రారంభించాడు. ఇప్పటికే చాలా గ్రావెల్‌ కుప్పలు ఆ భూమిలో వేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆ వ్యాపారికి గ్రావెల్‌ ఎక్కడ నుంచి తెచ్చారంటూ గనుల శాఖ అధికారులు నోటీసులిచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వెంకన్నపాలెంలో కొండ నుంచి గ్రావెల్‌ తవ్వకానికి ఎలమంచిలికి చెందిన వీరునాయుడు గనుల శాఖ నుంచి 2019లో అనుమతి పొందారు. ఈయనకు 2029 వరకు లీజు గడువు ఉంది. ఇతర గ్రామాల నుంచి గ్రావెల్‌ వస్తుండటంతో చేసేదేమీ లేక అక్రమ తవ్వకాలపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
దీనిపై తహసీల్దారు ఎల్‌.తిరుమలబాబును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా గ్రావెల్‌ తవ్వకాలకు వెంకన్నపాలెంలో మినహా మరెక్కడా అనుమతుల్లేవని స్పష్టంచేశారు. ఇటీవల వచ్చిన సమాచారంతో పోలీసులతో దాడులు చేశామన్నారు. అక్రమ తవ్వకాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని వీఆర్వోలకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. రాయపురాజుపేట వద్ద టైల్స్‌ వ్యాపారికి గనుల శాఖ అధికారులు నోటీసులిచ్చారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని