logo

ఖాతాల్లో నగదు మాయం

బ్యాంకు అకౌంట్లలో నగదు మాయం కావడంపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. కొంతమందికి ఆధార్‌ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసినట్లు సంక్షిప్త సమాచారాలు వస్తున్నాయి.

Published : 20 Mar 2023 03:22 IST

తెలియకుండానే ఆధార్‌ ద్వారా డబ్బులు విత్‌డ్రా ఖాతాదారుల ఆందోళన

ఆధార్‌ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసినట్లు ఖాతాదారుడు ఫోన్‌కి వచ్చిన మెస్సేజ్‌

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: బ్యాంకు అకౌంట్లలో నగదు మాయం కావడంపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. కొంతమందికి ఆధార్‌ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసినట్లు సంక్షిప్త సమాచారాలు వస్తున్నాయి. మరికొంతమందికి ఈ సమాచారం లేకుండానే డబ్బులు కట్‌ అయిపోతున్నాయి. బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నప్పుడు నగదు తక్కువగా ఉన్నట్లు తెలుసుకుని బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. ఆధార్‌ ద్వారా వేలిముద్రలు వేసి డబ్బులు తీసుకున్నారని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. తామెప్పుడూ డబ్బులు విత్‌డ్రా చెయ్యలేదని ఖాతాదారులు విస్మయం చెందుతున్నారు. కొన్ని రోజులుగా బ్యాంకులకు ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. బంగారుమెట్టకు చెందిన కొట్యాడ మంగపతికి ఎస్‌బీఐలో ఖాతా ఉంది. రెండు రోజుల కిందట ఆయన అకౌంట్‌లో రూ. 10 వేలు ఒకసారి, రూ. 4 వేలు ఒకసారి డబ్బులు డ్రా అయ్యాయి. సాధారణంగా డబ్బులు విత్‌డ్రా చేసినప్పుడల్లా ఆయన ఫోన్‌కి మెసేజ్‌ వస్తుంది. ఈసారి మెసేజ్‌ రాకుండానే డబ్బులు కట్‌ అయిపోయాయి. బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నప్పుడు నగదు తక్కువగా ఉందని గుర్తించారు. వెంటనే బ్యాంకు కాల్‌సెంటర్‌కి ఫోన్‌ చేసి సంప్రదిస్తే ఆధార్‌ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేశారని సమాధానం వచ్చింది. తానెప్పుడూ బయట ఆధార్‌ కేంద్రాల్లో వేలిముద్రలు వేసి ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని, అలాంటిది తన ఖాతాలో డబ్బులు ఎలా కట్‌ అవుతాయని ఆయన వాపోతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కడియం శ్రీనుకి చెందిన ఎస్‌బీఐ ఖాతాలో రూ. 2,200 కట్‌ అయ్యాయి. ఆధార్‌ ద్వారా డబ్బులు తీసుకున్నట్లు ఆయన ఫోన్‌కి మెసేజ్‌ వచ్చింది. వెంటనే బ్యాంకు కాల్‌సెంటర్‌కి ఫోన్‌ చేసి సంప్రదిస్తే వాస్తవమేనని తేలింది. తాను ఆధార్‌ ద్వారా డబ్బులు విత్‌డ్రా చెయ్యలేదని ఆయన చెబుతున్నారు.  వడ్డాదికి చెందిన సుబ్రహ్మణ్యం ఖాతాలో రూ. 2200 కట్‌ అయ్యాయి. ఎస్‌బీఐ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒకరి ఖాతాలో రూ. 10 వేల నగదు మాయమైంది.

ఎక్కడ నుంచి డ్రా చేస్తున్నారో తెలీదు

సాధారణంగా నగదు విత్‌డ్రా చేసినప్పుడు ఎక్కడ నుంచి తీసుకున్నారో తెలుస్తుంది. ఏటీఎం, ఆధార్‌ వాణిజ్య సహాయక పాయింట్లలో తీసుకున్నప్పుడు సంబంధిత చిరునామా వస్తుంది. వీరి ఖాతాల్లో డబ్బులు ఎక్కడ నుంచి విత్‌డ్రా చేశారన్న విషయం తెలియలేదు. నగదు విత్‌డ్రా చేసినప్పుడు ఒక రిఫరెన్స్‌ నెంబరు వస్తుంది. ఆ నెంబరు ఎక్కడిదన్న విషయాన్ని బ్యాంకు అధికారులు చెప్పలేకపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని