logo

డీజిల్‌ స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు

డీజిల్‌ స్మగ్లింగ్‌ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 28 Mar 2024 02:43 IST

మాట్లాడుతున్న డీసీపీ-2 ఎం.సత్తిబాబు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: డీజిల్‌ స్మగ్లింగ్‌ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ-2 ఎం.సత్తిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తీర ప్రాంతాలకు చెందిన 13 మంది మత్స్యకారులు ముఠాగా ఏర్పడి కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తీరాల్లో ఉంటున్న నౌకల వద్దకు బోట్లపై వెళ్లి డీజిల్‌ను దొంగలించేవారు. విశాఖ చేపలరేవుకు ఆ డీజిల్‌ను తీసుకొచ్చి ఇక్కడి నుంచి వేటకు వెళ్తున్న బోటు ఆపరేటర్లకు లీటరు రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ముఠా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై ఒకటో పట్టణ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు చేపలరేవుపై నిఘా పెట్టారు. బుధవారం డీజిల్‌ విక్రయిస్తున్న ముఠా సభ్యులు వీర్రాజు, బడేరాజు, సురాడ రాములను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 500 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 10మంది నిందితుల కోసం గాలిస్తున్నామని డీసీపీ-2 సత్తిబాబు తెలిపారు. హార్బర్‌ ఏసీపీ మోజేస్‌పాల్‌, ఒకటో పట్టణ సీఐ భాస్కరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని