logo
Updated : 29 Jun 2022 05:05 IST

ఫలితాలు అద్వితీయం!

న్యూస్‌టుడే, వరంగల్‌ విద్యావిభాగం, విద్యానగర్‌, కమలాపూర్‌, ఎల్కతుర్తి

మూడేళ్ల అనంతరం జరిగిన ఇంటర్మీడియేట్‌ ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలలో హనుమకొండ జిల్లా మెరిసింది. ప్రథమ సంవత్సరం విషయంలో రాష్ట్రంలో ద్వితీయ, రెండో సంవత్సరం ఫలితాల్లో తృతీయ స్థానం పొందింది. రెండు సంవత్సరాలలో అన్ని జిల్లాలలో బాలుర కన్నా బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు.

తండ్రి దూరమైనా పట్టుదలతో చదివి..
ఈనాడు, వరంగల్‌: హసన్‌పర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ చదివిన గిరి పుత్రిక కొర్ర మేఘనా సింధు ఇంటర్‌లో వెయ్యి మార్కులకు 990 సాధించారు. పది వరకు ప్రైవేటులో చదివిన సింధు, ఇంటర్‌లో చేరే సమయంలో కొవిడ్‌ విజృంభించింది. నాన్నకొచ్చే సగం జీతంతో ఫీజులు కట్టలేని పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వ కళాశాలలో చేరింది. సింధు నాన్న సీనా నాయక్‌ ప్రయివేటు కళాశాల అధ్యాపకుడిగా అనంతపురంలో పనిచేస్తూ గతేడాది కొవిడ్‌తో కన్నుమూశారు. ఆర్థికంగా కుటుంబం చితికిపోయింది. దుఃఖాన్ని దిగమింగుకొని సింధు రోజుకు ఆరు గంటలపాటు చదివి ప్రతిభ కనబరిచింది. సివిల్స్‌ సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది.


దామెర:  ఒగ్లాపూర్‌కు చెందిన తుమ్మనపెల్లి హాసిని బైపీసీ ప్రథమ సంవత్సరంలో 440 మార్కులకు 432 సాధించారు. పూర్తిగా వ్యవసాయ నేపథ్య కుటుంబం. చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలన్నది తన లక్ష్యమని, పేదలకు ఉచితంగా సేవలందిస్తానన్నారు.


మెరిసిన కవలలు..
ఆత్మకూరు, న్యూస్‌టుడే: పరకాలకు చెందిన బెజ్జంకి అంజన, సంజన కవలలు. గుడెప్పాడ్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే గురుకులంలో (పెద్దాపూర్‌)లో ఇంటర్‌ చదువుతున్నారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో అంజనకు 466 మార్కులు రాగా, సంజనకు 465 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. కవలలు ఒక్కమార్కు తేడా ఉండటంతో ఆశ్చర్యపోయారు. వీరి తండ్రి పదేళ్ల కిందట మరణించగా తల్లి పాఠశాలలో పనిచేస్తున్నారు. ఐఐటీ సాధించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడటమే తమ ప్రధాన ధ్యేయమని చెబుతున్నారు.

దామెర:  ఊరుగొండకు చెందిన చీలికె అఖిల ఎంపీసీ, ప్రథమ సంవత్సరంలో 464 మార్కులు సాధించారు. ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ తనకు స్ఫూర్తని  సివిల్స్‌ సాధించడమే లక్ష్యమని చెబుతున్నారు.

భీమదేవరపల్లి, పరకాల: ఎల్కతుర్తికి చెందిన కరట్లపల్లి శ్రీనివాస్‌ సీఈసీ ప్రథమ సంవత్సరంలో 471మార్కులు సాధించారు. పరకాల పట్టణంలోని ఎస్‌వీ కళాశాలకు చెందిన విద్యార్థి ఖాజా జాకీద్దీన్‌ సీఈసీలో 500 మార్కులకు 481 సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసాచారి తెలిపారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts