logo

మన్యంలో మత్తు మాయ

ఏజెన్సీలో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. యువకులు మత్తుకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక, ఎక్సైజ్‌ శాఖల అధికారులు

Published : 13 Aug 2022 04:37 IST

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఏజెన్సీలో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. యువకులు మత్తుకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక, ఎక్సైజ్‌ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటూరునాగారం సబ్‌డివిజన్‌ పరిధిలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లో మత్తు వినియోగం ప్రధానంగా విస్తరిస్తోంది. గ్రామాలకు కూడా పాకింది.
వినియోగానికి ప్రత్యేక అడ్డాలు
యువత గంజాయి ఆస్వాధనకు ప్రత్యేక అడ్డాలను ఎంచుకుంటున్నారు. మిత్రులంతా కలిసి గ్రామ శివారుల్లోని ప్రదేశాలను అడ్డాగా చేసుకుని గంజాయి వినియోగిస్తున్నారు. నిర్మాణుష్యంగా ఉండే మైదానాలు, తోటలు, ఖాళీ ప్రభుత్వ కార్యాలయాలు వంటి నిర్జన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. ఆ మత్తులో వాహనాలను ఇష్టమొచ్చిన రీతిలో నడపడం, పిచ్చిపిచ్చి అరుపులతో వేగంగా వెళ్లడం వంటి పనులు చేస్తున్నారు. రాత్రి సమయాల్లోనైతే జాతీయ రహదారే అడ్డాగా మారింది. రోడ్డు పొడవునా జంపన్నవాగుపై మూడు వంతెనలు, చిన్న చిన్న కల్వర్టులున్నాయి. పాదచారుల కల్వర్టులు కూడా ఉన్నాయి. వాటి కింద కూర్చుని మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. ముల్లెకట్ట గోదావరి వారధి సైతం అడ్డాగా ఉపయోగపడుతోంది. మత్తులో ఘర్షణలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి.
సరిహద్దు రాష్ట్రాల నుంచి సరఫరా!
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రల్లోని పలు ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన కొన్ని తాలూకా, బ్లాక్‌ ప్రాంతాలు ఏటూరునాగారం సబ్‌ డివిజన్‌కు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల మీదుగా ఇవతలివైపు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం పోలీసులు నిఘా పెడుతున్నప్పటికీ వారి కళ్లుగప్పి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వ్యాపార స్థాయిలో పెద్దమొత్తంలో అమ్మకాలు జరపకపోయినా, యువత వినియోగించే మోతాదులో గంజాయిని నిత్యం సరఫరా చేస్తున్నారు. దీంతో యువతలో స్థానికంగా విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఇటీవలి కాలంగా నమోదైన పలు పోక్సో కేసులకు కూడా మత్తు పదార్థాల వినియోగమే కారణమన్న అభిప్రాయాలు స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అధికారులు అక్రమ సరఫరాను నియంత్రించి యువతకు మత్తు నుంచి బయటపడేలా కౌన్సెలింగ్‌ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభావం చూపిస్తోందిలా..
జులై 9న ఏటూరునాగారానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి బొగత జలపాతానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా  మితిమీరిన వేగంతో జాతీయరహదారి పక్కనున్న రక్షణ కంచెను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నడిపిన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. అతడు గంజాయితో పాటు మద్యం తాగినట్లు విశ్వసనీయ సమాచారం.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని