logo

స్థిరాస్తి భూములకూ రైతుబంధు

పదేళ్ల క్రితం ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించిన భూములకూ రైతు బంధు నిధులు జమవుతున్నాయి.

Updated : 29 Nov 2022 07:06 IST

రెవెన్యూ దస్త్రాల్లో మార్పులు చేయక ఖజానాకు గండి
న్యూస్‌టుడే, భూపాలపల్లి

ఇలాంటి స్థలాలకు పెట్టుబడి సాయం.. కుందూరుపల్లి తండా వెనుక భాగంలో కొంపెల్లి రోడ్డు పక్కన ఖాళీ ప్లాట్లు

పదేళ్ల క్రితం ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించిన భూములకూ రైతు బంధు నిధులు జమవుతున్నాయి. వ్యవసాయ భూములు నివేశన స్థలాలుగా రూపాంతరం చెంది కొనుగోలుదారుల పేరిట రిజిస్ట్రేషన్లయినా రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ మార్పులు జరగకపోవడంతో రైతు బంధు సాయం పట్టాదారులైన రైతుల ఖాతాల్లో పడుతోంది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న కోల్‌బెల్ట్‌ ప్రాంతమైన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థిరాస్తి వ్యాపారం కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. విద్యుత్తు, ఉత్పత్తి కేంద్రంతో పాటు బొగ్గు గనుల తవ్వకాలు కొనసాగటంతో ఈ ప్రాంతంలో భూములకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుందూరుపల్లి, పుల్లూరిరామయ్యపల్లి, మంజూరునగర్‌, భూపాలపల్లి, సీఆర్‌నగర్‌ కాలనీ ప్రాంతం జాతీయ రహదారికి ఇరువైపులా చాలా వరకు పంట పొలాలను వ్యాపారులు కొనుగోలు చేసి, ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయాలు జరుపుతున్నారు. ఈ మేరకు మంజూరునగర్‌ ప్రాంతంలో ఓ రియల్‌ ఎస్టేటు నిర్వాహకులు పదేళ్ల క్రితం ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయాలు చేపట్టిన భూములకు ఇప్పటికీ రైతు బంధు నిధులు జమవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో సుమారు వంద ఎకరాలకు పైగానే రియల్‌ ఎస్టేటు ప్లాట్లుగా విభజించిన భూములకు 2018 నుంచి రైతు బంధు నిధులు విడుదలవుతున్నాయి.  

  స్థిరాస్తి వ్యాపారం జరిగే ప్రాంతాలివే..

* గణపురం మండలం చెల్పూరు శివారు నుంచి కుందూరుపల్లి తండా, కుందూరుపల్లి గ్రామంలో జాతీయ రాహదారికి అతి సమీపంలో విస్తరించిన మంజూరునగర్‌, పుల్లూరిరామయ్యపల్లి, కేటికే 8వ గని ప్రధాన రోడ్డు ప్రాంతం, బీసీ కాలనీ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది.
* మండలంలోని కొంపెల్లి క్రాస్‌ రోడ్డు సమీపంలో కుందూరుపల్లి గిరిజన తండా సమీపంలో, ఏఎస్‌ఆర్‌ గార్డెన్‌ వెనుక ప్రాంతంలో, పట్టణంలోని మైసమ్మ గుడి ఏరియా, రిలయన్స్‌ పెట్రోల్‌ బంకు వెనుక భాగంలో వ్యవసాయ భూములు ప్రస్తుతం చాలా వరకు నివాస స్థలాలుగా మార్చి, హద్దులు, రోడ్లు ఏర్పాటు చేసి, అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
* కేటికే 5వ గని ప్రధాన ఆర్చి నుంచి భాస్కర్‌గడ్డ గ్రామం వరకు ప్రధాన రోడ్డుకు అతి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాకి వెనుక భాగంలో కొత్తగా ఏర్పాటు రియల్‌ ఎస్టేటు ప్రాంతంలో ఇళ్ల స్థలాల విక్రయాలను చేపడుతున్నారు.

 ఇవిగో తార్కాణాలు

* మంజూరునగర్‌ ప్రాంతంలోని సిందూరి హోటల్‌ ఎదురుగా ఓ రియల్టర్‌ పదేళ్ల క్రితం సర్వే నంబర్లు 205, 206, 208లలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, నివేశన స్థలాలు ఏర్పాటు చేశారు. భూములు సుమారు ఐదుగురు రైతుల నుంచి కొనుగోలు చేసుకున్న స్థిరాస్తి వ్యాపారి నాలా అనుమతి లేకుండానే ప్లాట్లు విక్రయించారు. దీంతో రెవెన్యూ రికార్డుల్లో నేటికీ రైతుల పేరుతో ఉండటంతో పెట్టుబడి సాయం మంజూరువుతోంది.
* కుందూరుపల్లి గిరిజన తండా వెనుక భాగంలో కొంపెల్లి ప్రధాన రహదారి పక్కన రెండేళ్ల క్రితం సర్వేనంబరు 320, 322లో సుమారు 23 ఎకరాల భూముల్లో ప్లాట్లుగా మార్చిన పంట భూములకు రైతు బంధు జమవుతోంది.
* మంజూరునగర్‌ ప్రాంతంలోని ఏఎస్‌ఆర్‌ వేడుక మందిరం పక్కన, వెనుక భాగంలో సర్వేనంబరు 309, 318లలో దాదాపు 15 ఎకరాల వ్యవసాయ భూములను నాలుగేళ్ల క్రితమే కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపట్టారు. ఈ భూములకు పెట్టుబడి సాయం అందుతోంది.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం
- మహ్మద్‌ ఇక్బాల్‌, తహసీల్దారు, భూపాలపల్లి

నాలా మార్పిడి చేసిన వాటిని రికార్డుల నుంచి తొలగించాం. ప్లాట్లుగా మార్చిన ప్రాంతాల్లో రైతు బంధు జమవుతున్న విషయం మా దృష్టికి రాలేదు. ప్లాట్లుగా మార్చిన వ్యవసాయ భూములను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని