logo

వైకల్యం ఛేదించి.. విజయం సాధించి

తమ వైకల్యాన్ని చూసి వీరు ఏనాడూ కుమిలిపోలేదు. దేవుడు తనకే  ఇలా ఎందుకు చేశాడని బాధపడలేదు. శరీరం సరిగ్గా సహకరించకపోయినా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా తమ లక్ష్యానికి అవి ఏమాత్రం అడ్డుగా భావించలేదు.

Published : 03 Dec 2022 04:46 IST

వీరి స్ఫూర్తితో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుదాం
నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

-ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, చెన్నరావుపేట (వరంగల్‌)

తమ వైకల్యాన్ని చూసి వీరు ఏనాడూ కుమిలిపోలేదు. దేవుడు తనకే  ఇలా ఎందుకు చేశాడని బాధపడలేదు. శరీరం సరిగ్గా సహకరించకపోయినా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా తమ లక్ష్యానికి అవి ఏమాత్రం అడ్డుగా భావించలేదు. చదువునే నమ్ముకుని పోటీ ప్రపంచంలో సత్తా చాటారు.  ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రత్యేకంగా నిలిచారు.  ప్రస్తుతం రాష్ట్రంలో కొలువుల మేళా జరుగుతోంది. ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తోంది. తాజాగా పెద్ద ఎత్తున గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నడుం బిగించింది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులైన ప్రభుత్వ ఉద్యోగులను ‘ఈనాడు’ పలకరించింది. ఉద్యోగ సాధనకు ఎలా సన్నద్ధమయ్యారో వివరిస్తూ ప్రత్యేక కథనం. 

‘ శరీరంలో ఏదో ఒక లోపంతో జన్మించిన వాళ్లు దివ్యాంగులు కాదు.. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకపోవడమే అసలైన వైకల్యం.’

భారతరత్న అబ్దుల్‌ కలాం  

25 శాఖలు 9,168 పోస్టులు

మహబూబాబాద్‌ జిల్లా అనంతారంలో...

ప్రభుత్వం తాజాగా 25 శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 పోస్టులతో కూడిన గ్రూప్‌-4 ఉద్యోగ ప్రకటనను విడదల చేసింది. ఈ ఉద్యోగాల సాధనకు అర్హులైన దివ్యాంగుల అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం చదవడం ప్రారంభించాలి.

టైం టేబుల్‌ ప్రకారం: పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నవారు టైం టేబుల్‌ ఏర్పాటు చేసుకోని దాని ఆధారంగా చదువుకోవాలి. దాంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు కూడా ప్రధానం. సమయానికి ఆహారం తీసుకోవాలి. దానికి తగినట్లే నిద్రకు కూడా సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటూ అనుకున్న లక్ష్యంలో విజయం సాధిస్తారు.

3 శాతం రిజర్వేషన్‌: దివ్యాంగులు జనరల్‌, వారి వర్గానికి సంబంధించిన కేటగిరీల్లోనే కాకుండా ప్రత్యేకంగా 3 శాతం కేటాయించిన రిజర్వేషన్‌లోనూ ఉద్యోగం సాధించవచ్చు. ఈ రిజర్వేషన్‌లో చెవుడు, కంటిచూపు, ఆర్థోకు సంబంధించిన వాటికి వేర్వేరుగా నియామకం ఉంటుంది.


పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు

చెన్నారావుపేట, న్యూస్‌టుడే: పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌ గ్రామానికి చెందని దార అశోక్‌ నిరూపించారు. అమీనాబాద్‌ గ్రామానికి చెందిన అశోక్‌ పుట్టకతోనే దివ్యాంగుడు. 2012లో  బీఈడీ పూర్తి చేశారు.  2021లో చెన్నారావుపేట మండలం జల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. 2019లో చెన్నారావుపేట మండలంలోని తోపనగడ్డతండాలో జూనియార్‌ పంచాయతీ కార్యదర్శిగా విధులో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రణాళిక ఏర్పాటు చేసుకొని చదివి ఉద్యోగం సాధించినట్లు అశోక్‌ తెలిపారు.


మీకు తెలుసా..!

ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మోటార్‌ న్యూరోన్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడి మరణించే వరకు చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా చక్రాల కుర్చీలో నుంచే ఖగోళ, భౌతికశాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. నాకు శరీరం సహకరించకపోయినా నా మెదడు పని చేస్తోంది. అది చాలు..నేను పని చేయడానికి అని ఒక  హాకింగ్‌ పేర్కొన్నారు.


విజయ సంకల్పానికి అంధత్వం అడ్డుకాదు

ఖానాపురం, న్యూస్‌టుడే: విజయం సాధించాలన్న తపనతో పాటు ఉద్యోగం పొందాలన్న సంకల్పం ముందు అంధత్వం అడ్డుకాదని ఖానాపురానికి చెందిన ఉపాధ్యాయుడు రాజ్‌కుమార్‌ అన్నారు. ప్రస్తుతం బుధరావుపేట ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్నారు. వైకల్యం అడ్డుకాదని.. దాన్ని  వరంగా మార్చుకోవాలన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని అధైర్యపడకుండా ముందుకు సాగాలన్నారు.  ఆడియో పాఠాలు  వింటూ మిత్రులతో గట్టిగా(లౌడ్‌)గా చదివించుకునేవాడినన్నారు. బ్రెయిలీ పుస్తకాలు చదువుతూ బోధన చేస్తున్నానని చెప్పారు.


ఆత్మవిశ్వాసం తోడుగా..

ఈయన పేరు మురహరి సురేష్‌కుమార్‌. వరంగల్‌ నగరం లేబర్‌ కాలనీకి చెందిన ఆయన 2008 నవంబరు 13న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతుండగా తొక్కిసలాటలో రైలు కిందపడి రెండు కాళ్లు కోల్పోయారు. నెల రోజులు చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడినా, వైకల్యం తప్పలేదు. చేతులే ఆధారంగా నడుస్తున్నారు. అయితేనేమి ఆయనలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. వైకల్యం అని అధైర్యపడక, మొక్కవోని సంకల్పంతో కులవృత్తిలోకి దిగారు. చిన్నపాటి క్షౌరశాల నిర్వహిస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు.  ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌, తనకొచ్చే అరకొర సంపాదనతో ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నానని తెలిపారు. చేతులపై భారంగా నడవాల్సి వస్తోందని, దాతలు ఎవరైనా కృత్రిమ కాళ్ల ఏర్పాటుకు సహకరించాలని వేడుకున్నారు.

ఈనాడు, హనుమకొండ (వరంగల్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని