logo

తీగ లాగారు.. డొంక కదులుతోంది!

ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు, స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు, ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Published : 29 May 2023 03:16 IST

నర్సంపేటలో ఈనెల 13న జిల్లా వైద్యాధికారి సీజ్‌ చేస్తున్న స్కానింగ్‌ సెంటర్‌(పాత చిత్రం)

లింగనిర్ధారణ కేంద్రాలు, గర్భస్రావాలు చేసిన ఆసుపత్రులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఆడపిల్లలను కడుపులోనే కడతేర్చుతున్న ముఠా సభ్యుల గుట్టురట్టయింది. ఇందులో పలువురు వైద్యులు, దళారులు ఉన్నారు. ఈ దందాపై  ‘ఈనాడు’లో ఈనెల 13వ తేదీన ‘పురిట్లోనే చంపేస్తున్నారు..!’ శీర్షికన ప్రచురితమైన కథనం అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. వరంగల్‌ కమిషనరేట్ పోలీసులు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అధికారులు రంగంలోకి దిగి కూపీ లాగుతున్నారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఈ దందాపై ఒక్కో విషయం వెలుగుజూస్తోంది.

వరంగల్‌క్రైం, నర్సంపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు, స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు, ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నర్సంపేటకు చెందిన ప్రముఖ మహిళా వైద్యురాలు, నెక్కొండకు చెందిన ఒక వైద్యుడితోపాటు మరొకరిని అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. నర్సంపేటలో పేరున్న ప్రముఖ ఇద్దరు వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి ఆడపిల్ల అని గుర్తించాకే బాధితులు తన వద్దకు వచ్చినట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం. నెక్కొండలో అదుపులోకి తీసుకున్న వైద్యుడిపై గతంలో కేసులున్నట్లు తెలిసింది. ఇప్పటికే హనుమకొండ, గోపాల్‌పూర్‌కు చెందిన వ్యక్తి మరో ఐదుగురితో కలిసి యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అబార్షను చేయిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే దాడులు జరిపి స్కానింగ్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వరంగల్‌ జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తన సిబ్బందితో నర్సంపేటలోని బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలోని స్కానింగ్‌ కేంద్రాన్ని సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఠాలో సుమారు 30 మంది వరకు నిందితులున్నట్లు అనుమానిస్తుండగా, వీరిలో కొందరు వైద్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని గుర్తించారు.


రూ. 50 వేల వరకు వసూలు

పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. నర్సంపేట, నెక్కొండ, హనుమకొండ, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో గర్భస్రావాలు జరిగినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. ప్రధాన సూత్రధారి ఒకరు నగరంలో రెండు, మూడు ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకొని ఆడపిల్ల అని నిర్ధారించుకుని.. గర్భవిచ్ఛిత్తి చేయిస్తున్నారు. ఈయనపై గతంలో కూడా ఇలాంటి కేసు నమోదైంది. ఈ ముఠాలోని కొంతమందిని కేయూ పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరి కోసం గాలిస్తున్నారు.


ఏజెంట్ల ద్వారా దందా

ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులను లింగనిర్ధారణ పరీక్షల కోసం నగరానికి తీసుకొస్తున్నారు. స్కానింగ్‌ చేసి పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకొని ఆడపిల్ల అయితే అబార్షన్‌ కోసం మరో వైద్యుడి వద్దకు పంపిస్తున్నారు. సదరు ఏజెంట్లకు ముఠా పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పుతున్నారు. సుమారు 200 మందికి అబార్షన్లు చేయించి ఉంటారని పోలీసుల విచారణలో వెల్లడైందంటున్నారు. గర్భస్రావాలు చేయించుకున్న వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయా.. అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.


లింగనిర్ధారణ, గర్భస్రావం చేయించిన ఆరుగురిపై కేసు

దామెర: దామెరలో ఓ మహిళకు ఇష్టం లేకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేయించిన బైకాని నాగరాజు, బండి నాగరాజు, కాయిత రాజు, డా.సబిత, కాశిరాజు దిలీప్‌, డా.బాల్నె పూర్ణిమపై మండల వైద్యాధికారి డా.జి.ఉషారాణి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదైంది. దామెర ఎస్సై ముత్యం రాజేందర్‌ కథనం ప్రకారం  దామెరకు చెందిన ఓ మహిళ మూడు నెలల గర్భవతి. ఆమెకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. మూడో సంతానం ఆడపిల్ల పుడితే  ఇబ్బందులు పడతారంటూ మహిళతో పాటు ఆమె భర్తను సమీప బంధువు ఒప్పించి ఓ పీఆర్‌వో ద్వారా హనుమకొండ హంటర్‌రోడ్డులో వైద్యురాలు డాక్టర్‌ సబిత ఇంటికి తీసుకెళ్లారు. ఆమె పరీక్షలు నిర్వహించి ఆడపిల్ల అని చెప్పింది. సదరు మహిళ బంధువు అబార్షన్‌ చేయించుకోవాలని ప్రలోభ పెట్టగా రూ.18,000 చెల్లించి ఒప్పుకున్నారు. మరో వ్యక్తి వైద్యురాలు డా.బార్నె పూర్ణిమతో కలిసి దామెరలోని ఆ మహిళ ఇంటికి వచ్చి, ఇంటి వద్దనే అబార్షన్‌ నిర్వహించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని