logo

మేల్కోకపోతే ముప్పే!

వర్షాకాలం ప్రారంభం కానుంది. ఇటీవల వేసవిలో కురిసిన వర్షాలకు మురుగు కాలువలు పొంగిపొర్లి వీధులు జలమయమై ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.

Updated : 01 Jun 2023 05:00 IST

అస్తవ్యస్త కాలువలతో వానాకాలంలో ముంపు భయం

డోర్నకల్‌, న్యూస్‌టుడే: వర్షాకాలం ప్రారంభం కానుంది. ఇటీవల వేసవిలో కురిసిన వర్షాలకు మురుగు కాలువలు పొంగిపొర్లి వీధులు జలమయమై ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు పురపాలికల్లో కాలువల నిర్వహణ అధ్వానంగా ఉండటంతో పలుచోట్ల రహదారులపై మురుగు నీరు చేరుతుంది.  కొత్త మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తొలుత ఒక్కొక్క పురపాలిక సంఘానికి ప్రభుత్వం రూ.20 కోట్లు చొప్పున మంజూరు చేసింది. ఈ నిధులతో డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీలలో అవస్థలు తీరుతాయని భావించినా ఫలితం అంతంత మాత్రమే. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలో పర్యటించినప్పుడు మహబూబాబాద్‌ మున్సిపాలిటీకు రూ.50 కోట్లు, మిగిలిన మూడు పురపాలికలకు రూ.25 కోట్లు, ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున కేటాయించిన నిధులతోనైనా  అభివృద్ధి జరుగుతుందేమోనని ఎదురుచూస్తున్నారు.

లోపభూయిష్ట పనులతో కష్టాలు

జిల్లాలో కొత్తగా 2018లో డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు పట్టణాలు పురపాలిక హోదా పొందాయి. పట్టణాల్లో అంతర్గత వీధులు, ప్రధాన వీధుల వెంబడి మురుగు కాలువలు అస్తవ్యస్తంగా ఉండటం ప్రజల పాలిట శాపంగా మారింది. ఇప్పటికీ మురుగు కాలువల్లేని వీధులున్నాయి. కొన్నిచోట్ల ఏళ్ల కిందట కట్టిన కాలువలు పూర్తిగా శిథిలంగా మారాయి.

దృష్టి పెడితే మేలు

జిల్లాలోని మహబూబాబాద్‌, డోర్నకల్‌, మరిపెడ పురపాలికల్లో భారీ వర్షాలకు అవాస ప్రాంతాలు ముంపునకు గురవుతుండటం అందరిని కలవర పరుస్తోంది. గత వర్షాకాలంతో పాటు ఇప్పుడు వేసవిలో కురిసిన వర్షాలకు ఎదురైన చేదు అనుభవాల నుంచి అధికారగణం గుణపాఠం నేర్చితే బాగుంటుంది. శివారు ప్రాంతాల ముంపు, వీధులు జలమయం వంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. అవసరమైన ప్రణాలిక రూపకల్పన జరగాలి.

శివారు ప్రాంతాల్లో ..

ఏటా వర్షాలు కురిసినప్పుడల్లా మహబూబాబాద్‌ పురపాలిక పరిధిలోని పలు వార్డులు, శివారు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ప్రధానంగా పట్టణంలోని 18వ వార్డులో గల కొంత భాగం, నిజాం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని గోపాలపురం ముంపు బారిన పడుతున్నాయి. ధర్మన్న కాలనీలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలోకి నీరు ప్రవేశిస్తుండటంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య గతంలో అధికారుల దృష్టికి వెళ్లింది. అయినప్పటికీ పరిష్కారంపై ఎవరూ శ్రద్ధ చూపలేదు.


దీర్ఘకాలిక ప్రణాళికతోనే ప్రయోజనం

తొర్రూరు: తొర్రూరు పురపాలిక పరిధిలోని శివారు ప్రాంతాలు భారీ వర్షాలకు ఏటా ముంపునకు గురవుతున్నాయి. తొర్రూరులోని టీచర్స్‌ కాలనీ పరిసరాలు, వీరప్పనగర్‌ శివారు ప్రాంతాలు జలమయం అవుతుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పట్టణంలోని నూతన కాలనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మన గ్రోమోర్‌ కేంద్రం నుంచి పాల కేంద్రం వరకు ప్రధాన రోడ్డు ప్రక్కన మురుగు కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి వస్తుంది. తాత్కాలిక చర్యలు చేపడుతుండటంతో ప్రయోజనం ఉండటం లేదు. దీర్ఘకాలిక ప్రణాళిక అమలు పరచాలని తొర్రూరువాసులు కోరుతున్నారు.


అలుగుపడితే వరదే

డోర్నకల్‌ శివారు జయపురంలో ఆవాసాల మధ్య కొర్లకుంట చెరువు ప్రమాదకరంగా ఉంది. అలుగు పడితే నీరు మొత్తం ఇందులోకి చేరుతుంది. గతంలో జయపురం, రైల్వే క్వార్టర్లు, నెహ్రూ వీధి ముంపునకు గురయ్యాయి. ఈ కాలువలో ఇప్పటిదాక పూడిక తీయలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వార్డు కౌన్సిలరు బసిక అశోక్‌ తెలిపారు. చిన్నపాటి వర్షానికే డోర్నకల్‌లోని కుందోజు వారి వీధి జలమయమవుతోంది. పట్టణంలో ముంపు నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని పుర కమిషనర్‌ మున్వర్‌అలీ తెలిపారు. ఇప్పటికే కొంత మంది కౌన్సిలర్లు సమస్య తీవ్రత గురించి తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.


మరిపెడలో అంతంతే!

మరిపెడ: మరిపెడ పట్టణంలో కార్గిల్‌ కూడలి నుంచి వరంగల్‌ మార్గంలో జాతీయ రహదారికి ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణం చేపట్టలేదు. దీంతో చిన్నపాటి వర్షానికే కార్గిల్‌ కూడలిలో చెరువును తలపించేలా మురుగు నీటితో పాటు వర్షపు నీరు చేరుతోంది. దీంతో పలుమార్లు వాహనాల రాకపోకలు సైతం స్తంభించాయి. రహదారిపై గంటల తరబడి నీరు నిల్వ ఉండి గుంతలమయంగా మారుతోంది. పట్టణంలోని గిరిజన ఆవాస ప్రాంతాల్లోని వీధుల్లో అంతర్గత రోడ్లు నిర్మించి మురుగు కాలువల ఏర్పాటు చేయకపోవడంతో సీసీ రోడ్లు దెబ్బతింటున్నాయి. గ్యామాతండ, పూలబజార్‌, గాంధీ బజార్‌ ఎస్సీ కాలనీ సీతరాంపురం, కొత్తతండా, బొత్తలతండాలో మురుగు కాలువల సుమారు 8 వేల మీటర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని