logo

ధాన్యలక్ష్మికి చేయూత

అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది.

Published : 28 Mar 2024 04:02 IST

జనగామ, న్యూస్‌టుడే: అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. తమ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో చేతి నిండా పనితో పాటు, అదనపు ఆదాయం లభిస్తోంది

పదేళ్లలో రూ.11 కోట్ల ఆదాయం..

జిల్లాలో గడిచిన పదేళ్లలో మహిళా సంఘాలు ధాన్యం ఖరీదు కమిషన్‌ రూపేణా రూ.11 కోట్లు సంపాదించారు. 2014 నుంచి 2017 వరకు రూ.38 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు ఆదాయం వచ్చింది. 2017-18లో రూ.1.50 కోట్ల ఆదాయం లభించింది. రెండేళ్ల లెక్కలు పరిశీలిస్తే ఏటా రూ.4 కోట్ల వరకు కమిషన్‌ పొందే స్థాయికి చేరుకున్నారు. అదనపు ఆదాయంతో కుటుంబ పోషణ, బిడ్డల చదువుల ఖర్చులను వెళ్లదీస్తున్నారు.

కష్టం కొందరిది.. ఫలం అందరికి

క్వింటా ధాన్యం ఖరీదు చేస్తే రూ.32 కమిషన్‌ లభిస్తుంది. ఇలా వచ్చిన దాంట్లో రూ.100లో రూ.45 ఖరీదు బాధ్యత చేసిన సంఘ సభ్యులకు, రూ.45 గ్రామైక్య సంఘానికి, రూ.10 జిల్లా సమాఖ్యకు చేరుతుంది. కొనుగోలు కేంద్రంలో తాగునీటి సరఫరా, హమాలీల అదనపు పనికి కూలీ తదితర ఖర్చులను వారే భరించాల్సి వస్తోంది. గత రెండేళ్లుగా కమిషన్‌ బకాయిలు సుమారు రూ.5 కోట్ల మేర పేరుకున్నాయి.

ఐకేపీ సంఘాలు ధాన్యం వ్యాపారంలో అదనపు ఆదాయాన్ని పొందుతుండగా, పీఏసీఎస్‌ ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఖరీదు లెక్కలు, పుస్తకాల నిర్వహణ ద్వారా కొందరు రూ.50 వేల వేతనాన్ని అందుకుంటున్నారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో 466 గ్రామైఖ్య సంఘాలు, వాటి పరిధిలో 11,191 మహిళా సంఘాల్లో, 1,24,774 మంది సభ్యులున్నారు.


గ్రామంలో నాలుగు వీవోల పరిధిలో 82 సంఘాలున్నాయి. ఏటా రెండు సీజన్లలో ఒక సంఘం చొప్పున ధాన్యం కొనుగోలు ద్వారా చేతి నిండా పని దొరుకుతోంది. దీంతో వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు  ఉపయోగపడుతోంది.

మంకెన కవిత, ఉషోదయ వీవో వెల్దండ


ధాన్యం ఖరీదు ప్రక్రియ ద్వారా పని, ఆదాయంతో పాటు, వ్యాపార నైపుణ్యం వస్తోంది. అప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడుతోంది. కమిషన్‌ బిల్లులను జాప్యం లేకుండా అందించాలి.

చుంచు రజిత-చైతన్య వీవో, వెల్దండ


హిళా సంఘాల లెక్కల నిర్వహణలో నైపుణ్యం ఉన్న వారికి పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను నిర్వహించే అవకాశం లభిస్తోంది. టోకెన్ల జారీ, తూకం, తరలింపు, బిల్లుల జారీ పనిలో అవకాశం ఇస్తున్నారు. మంచి వేతనం లభిస్తుండటంతో.. ఆర్థికంగా దోహదపడుతుంది.

రావుల విజయలక్ష్మి, ఇటుకాలపల్లి


100 సంఘాలకు అవకాశం

-  మొగులప్ప, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

రబీ సీజన్‌లో అవసరాన్ని బట్టి 200 కేంద్రాలను ప్రారంభించేందుకు జిల్లా పాలనాధికారి నిర్ణయించారు. ఈ దఫా ఐకేపీ ఆధ్వర్యంలో 100 ఏర్పాటు కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని