logo

బయటకు రావాలంటేనే భయం

చిరునామా తెలుసుకునే పేరుతో మాట కలిపి ఈ నెల 21న మార్టేరులో నడిచి వెళ్తున్న ద్వారంపూడి వరలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో రెండున్నర కాసుల బంగారం గొలుసును గుర్తు తెలియని యువకుడు తెంపుకొని పరారయ్యాడు. పెద్దగా జనసందోహం లేని ప్రాంతాన్ని ఎంచుకుని ఘటనకు పాల్పడ్డాడు.●

Published : 27 May 2022 03:43 IST

మహిళల మెడలో గొలుసుల అపహరణ

ఇటీవల జిల్లాలో వరుస ఘటనలు

పెనుమంట్ర, పాలకొల్లు గ్రామీణ, ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే

చిరునామా తెలుసుకునే పేరుతో మాట కలిపి ఈ నెల 21న మార్టేరులో నడిచి వెళ్తున్న ద్వారంపూడి వరలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో రెండున్నర కాసుల బంగారం గొలుసును గుర్తు తెలియని యువకుడు తెంపుకొని పరారయ్యాడు. పెద్దగా జనసందోహం లేని ప్రాంతాన్ని ఎంచుకుని ఘటనకు పాల్పడ్డాడు.●

ఐదు రోజుల క్రితం అల్లంచెర్లరాజుపాలంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు. పొలంలో పశువులను మేపుతుండగా విద్యుత్తు టవర్‌ను పరిశీలించేందుకు వచ్చానంటూ ఓ అపరిచిత వ్యక్తి మాటకలుపుతూ లాక్కుని పారిపోయాడు.●

పొలకొల్లు మండలం లంకలకోడేరులో రహదారి పక్కన దుకాణం ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు, శీతల పానీయాలు విక్రయిస్తున్న గాది ఆదిలక్ష్మి వద్దకు ఇటీవల ఇద్దరు వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో కారులో వచ్చి సరకులు కావాలని అడిగారు. వెనుక వైపునకు తిరిగి ఇచ్చే లోపు ఆమె మెడలోని ఐదు కాసుల బంగారు గొలుసును లాక్కుని పక్కకు నెట్టేసి.. పరారయ్యారు.

చిరునామా అడుగుతున్నట్లు.. లేదా ఏదో విషయమై ఆరా తీసినట్లు నటిస్తున్నారు. అంతే రెప్పపాటులో సొత్తును దోచేస్తున్నారు. క్షణాల్లో పని పూర్తిచేసుకుని మాయమవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో మళ్లీ గొలుసు చోరీ దొంగలు ఇలా విజృంభిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసి గొలుసులు దోచేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కోలా పంథా మారుస్తున్నారు.

గుడికి వెళ్లి వస్తున్నవారిని, ఇంటి ముందు అంట్లు తోముకుంటున్న వారిని, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని గొలుసులు లాక్కెళ్లిపోతున్నారు. అలానే రద్దీ ప్రాంతాల్లో వాహనాలపై రయ్‌ మంటూ వచ్చి కాజేస్తున్నారు.

ఆందోళన.. బంగారు గొలుసులు ధరించి బయటకు రావాలంటేనే మహిళలు కంగారుపడుతున్నారు. శుభకార్యాలకు, పెళ్ళిళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లేటప్పుడు ధరించక తప్పటం లేదు. కాని ఏ మూల నుంచి ఏ దొంగ వచ్చి గొలుసులు లాక్కెళ్లిపోతాడోనని ఆందోళన చెందుతున్నారు.

వ్యసనాలకు బానిసలుగా మారి..

వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొంతమంది యువకులు అడ్డదారులు తొక్కి ఇలా గొలుసులు కాజేస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంలో అరెస్టైన చాలా మందిలో యువకులే ఎక్కువగా ఇలా ఉన్నట్లు వివరిస్తున్నారు. పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బు అవసరమై ఇలా దొంగలుగా మారుతున్నారని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో జైల్లో శిక్ష అనుభవించే కాలంలో నేరస్థులు ఒకరికొకరు పరిచయమై బయటకు వచ్చాక ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సాధ్యమైనంత త్వరలో నిందితులను గుర్తించి అరెస్టు చేసి బాధితులకు సొత్తు అందజేస్తాం. మహిళలు ఒంటరిగా వెళ్లే సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి. విలువైన సొత్తును కాపాడుకోండి. రద్దీ సమయాల్లో గుడుల వద్ద నిఘా ఏర్పాటు చేశాం. మహిళలు దిశ యాప్‌ను డౌనులోడు చేసుకోవాలని చెబుతున్నాం. నేరాలు జరిగిన సందర్భంలో కూడా ఈ యాప్‌ను ఉపయోగిస్తే పోలీసులు క్షణాల్లో అక్కడకు చేరుకుంటారు’అని ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ వివరించారు..

పోలీసులు చెబుతున్న జాగ్రత్తలివి ●

నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లొద్ధు ● రద్దీ ప్రాంతాలకు, గుడులకు ఇతర కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు బంగారు గొలుసులు ధరించొద్ధు ● అపరిచితులు కనిపిస్తే జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుమానం వస్తే పోలీసులకు తెలియజేయాలి. ● దొంగలు రెక్కీ కూడా నిర్వహించి నేరాలకు పాల్పడుతుంటారు. గొలుసు చోరీల విషయంలో కూడా కొందరు అలానే చేస్తున్నారు. ● బంగారు వస్తువులు ధరించి బయటకు వచ్చిన సందర్భంలో పైటకొంగును కానీ చున్నీని కానీ మెడకు కప్పుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని