logo

ఐదొచ్చినా ఎదురుచూపే!

ఒకటో తేదీ వస్తుందంటే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. చిరుద్యోగుల నుంచి అధికారుల వరకు ప్రతినెలా వేతనం కోసమే ఎదురుచూస్తుంటారు.

Published : 05 Dec 2022 05:07 IST

ఖాతాలో జమకాని వేతనాలు
పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే

ఒకటో తేదీ వస్తుందంటే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. చిరుద్యోగుల నుంచి అధికారుల వరకు ప్రతినెలా వేతనం కోసమే ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఈఎంఐలు, అద్దెలు, నెలవారీ సరకులు, వైద్యం, ఇతర ఖర్చులకు జీతమే ఆధారం. ముఖ్యంగా స్థిరాస్తులను బ్యాంకు రుణాలు తీసుకొని కొనుగోలు చేసి ప్రతి నెలా జీతం నుంచి తీర్చే విధంగా ఈఎంఐ విధానంలో చెల్లిస్తారు. అయితే 5వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల ఖాతాల్లో వేతనం జమ కాలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 14 ఉపఖజానాల పరిధిలో సుమారు 40 శాఖలకు సంబంధించి 30 వేల ఉద్యోగులు, 25 వేల మంది పింఛనుదారులు ఉన్నారు. ప్రతి నెలా 15 నుంచి 25 లోగా సంబంధిత డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌ అధికారులు (డీడీవో) నుంచి ఎస్టీవో కార్యాలయాలకు జీతాల బిల్లు అప్‌లోడ్‌ చేస్తారు. 26 నుంచి 30లోగా ఎస్టీవోలు సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిర్దేశిత గడువులోగా చేస్తారు. ప్రస్తుతం ఉపఖజానాలో ఏ ఒక్క బిల్లు పెండింగ్‌లో లేదు. కానీ నెల ప్రారంభమై 5 రోజులు కావస్తున్నా వేతనాల చెల్లింపులు జరగలేదు.

కొన్ని శాఖలకు అందలేదు 

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇంత వరకు వేతనాలు జమ కాలేదు. ఈ నెల నుంచే సీఎఫ్‌ఎంఎస్‌ బిల్‌ స్టేటస్‌ వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. ఆ వెబ్‌సైట్‌ పనిచేసి ఉంటే బిల్లు ఏ స్టేజిలో ఉందో తెలుసుకొనే వీలుండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఆర్థికశాఖ పరిధిలో ఉండే ఉపఖజానా, ఏపీజీఎల్‌ఐ, ఆడిట్‌, పే, అకౌంట్స్‌, పోలీస్‌, జలవనరులశాఖ, అబ్కారీ, సచివాలయ ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయి.

మందులకు కష్టంగా మారింది

పదవీ విరమణ పొందిన తర్వాత ఇంటికే పరిమితమయ్యా. అనారోగ్య సమస్యలు వెంటాడటంతో మందులతో కాలం గడుపుతున్నాం. ప్రతి నెలా వచ్చే పింఛనుతోనే మందులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు పింఛను రాలేదు. మందులు, నిత్యావసర వస్తువులు అరువు తెచ్చినచోట ఇంకా జీతాలు అందలేదని చెప్పడం బాధగా ఉంది.

ఎస్‌.పురుషోత్తం, విశ్రాంత ఉద్యోగి

కక్ష కట్టి సకాలంలో చెల్లించడం లేదు

ఉపాధ్యాయులు దాచుకున్న పీఎఫ్‌ డబ్బులు, ఏపీజీఎల్‌ఐ, పదవీ విరమణకు రావాల్సిన బకాయిలు చెల్లించమని కోరుతూ విజయవాడలో ధర్నా నిర్వహించేందుకు వెళ్తున్న ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. దాచుకున్న డబ్బుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు కక్ష కట్టి నెలనెలా చెల్లించాల్సిన జీతాలు కూడా సకాలంలో చెల్లించడం లేదు. కొన్ని శాఖలకు 1వ తేదీన జీతాలు పడ్డాయి. మేము జీతాలు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకోవాలని మంత్రులే బాహాటంగా చెబుతున్నారు. ప్రభుత్వంపై పోరాటం కాదు, కాళ్లు పట్టుకోవాలని ఓ మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉంది.

ఏకేవీ రామభద్రం, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని