logo

నరసాపురం -కోటిపల్లి రైల్వే లైనుకు రూ.100 కోట్లు

పశ్చిమగోదావరి- అంబ్కేడర్‌ కోనసీమ జిల్లాల మధ్య అత్యంత కీలకమైన నరసాపురం-కోటిపల్లి రైల్వే లైనుకు శుక్రవారం ప్రకటించిన కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు.

Published : 04 Feb 2023 05:05 IST

రాష్ట్రం వాటాపై కానరాని స్పష్టత
విద్యుదీకరణ బకాయిలకు నిధుల కేటాయింపు

భీమవరం-నరసాపురం మధ్య పూర్తయిన డబ్లింగ్‌ లైను

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి- అంబ్కేడర్‌ కోనసీమ జిల్లాల మధ్య అత్యంత కీలకమైన నరసాపురం-కోటిపల్లి రైల్వే లైనుకు శుక్రవారం ప్రకటించిన కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. జిల్లాకు అనుసంధానంగా ఉన్న ఐదు రైల్వే లైన్లకు గతంలో చేసిన విద్యుదీకరణ పనుల బకాయిలకు రూ.100 కోట్లు ఇచ్చారు. ఇలా జిల్లాకు అనుసంధానంగా ఉన్న లైన్లకు రూ.200 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది.

నరసాపురం- కోటిపల్లి రైల్వే లైను 2012లో ప్రారంభించారు. 57.21 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్రం వాటా రూ.1200 కోట్లతో భారీ వంతెనలు నిర్మించారు. రాష్ట్రం ఇవ్వాల్సిన రూ.1200 కోట్లలో ఇప్పటికి రూ.50 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం కూడా తెదేపా అధికారంలో ఉన్నప్పుడే కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వం దాని కోసం ఇప్పటి వరకూ నిధుల కేటాయించలేదని సమాచారం. ఇంకా సూపర్‌ స్ట్రక్చర్‌ అంటే స్టీలు నిర్మాణాలు, సుమారు 250 చిన్న వంతెనలు, పలు చోట్ల రైల్వే అండర్‌ వంతెనలు నిర్మించాలి. మట్టిపనులు, రైల్వేలైను, విద్యుదీకరణ చేయాలి. భూసేకరణ కోసం రైల్వే రూ.300 కోట్లు రాష్ట్రానికి ఇస్తే వాటిలో రూ.120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన ఉన్న రూ.180 కోట్లు తిరిగి ఇస్తే నిర్మాణ పనులు చేపడదామని రైల్యే సూచించినా రాష్ట్రం నుంచి స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై రైల్యే ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలమని చెప్పగా..‘రాష్ట్రం వద్ద బడ్జెట్‌ లేదు. మేము ఏమీ చేయలేము’ అని ఆయన చెప్పినట్లు తెలిసింది.


బకాయిలకు మరో రూ.100 కోట్లు

జిల్లాకు అనుసంధానంగా వెళ్లే విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- గుడివాడ, మోటూరు- భీమవరంటౌన్‌, భీమవరం- నరసాపురం, భీమవరం- నిడదవోలు మధ్య రైల్వే లైను విస్తరణ, విద్యుద్దీకరణ పనులు గతేడాది చేశారు. ఆ పనులకు సంబంధించిన బకాయిలకు రూ.100 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని