logo

ఇలాంటి మరమ్మతులెందుకు?

ఉమ్మడి జిల్లాలో నగర, పట్టణదారుల తీరు అధ్వానంగా ఉంది. కొత్తగా నిర్మాణం ఊసే లేదు. మరమ్మతులకు నగరబాట పేరుతో పథకం చేపట్టినా ప్రభుత్వం ఒక్క పైసా నిధులు విదల్చడం లేదు. దీంతో మరమ్మతులు సైతం నాసిరకంగా, నామమాత్రంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి.

Updated : 26 May 2023 04:38 IST

గుంతలమయమైన పట్టణ దారులు
నాసిరకంగా పనులు

భీమవరం రెస్ట్‌హౌస్‌రోడ్డుకు కంకర వేసి..తారువేయకుండా వదిలేశారిలా..

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే- జంగారెడ్డిగూడెం,  భీమవరం పట్టణం, మొగల్తూరు : ఉమ్మడి జిల్లాలో నగర, పట్టణదారుల తీరు అధ్వానంగా ఉంది. కొత్తగా నిర్మాణం ఊసే లేదు. మరమ్మతులకు నగరబాట పేరుతో పథకం చేపట్టినా ప్రభుత్వం ఒక్క పైసా నిధులు విదల్చడం లేదు. దీంతో మరమ్మతులు సైతం నాసిరకంగా, నామమాత్రంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి.

నాలుగంటే నాలుగే పూడ్చి..

నగర బాటలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీసీ రహదారుల్లో 61 గుంతలను గుర్తించారు. సుమారు 6.68 కి.మీ. మేర పూడ్చడానికి రూ.19 లక్షలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు కేవలం నాలుగంటే నాలుగు పూడ్చారంటే పరిస్థితి అర్థమవుతోంది. నాలుగో సచివాలయం రోడ్డులో కార్యాలయ సమీపంలోనివి మాత్రమే పూడ్చి నివాసాలు ఉన్నచోట వదిలేశారు.

రూ.5 లక్షలు దుమ్ములో కలిపేశారు

జంగారెడ్డిగూడెంలోని బుట్టాయగూడెం రహదారి గుంతలు పడటంతో కొద్ది నెలల కిందట సాధారణ నిధులు రూ.5 లక్షలతో మరమ్మతులు చేశారు. శాశ్వత ప్రాతిపదిక పూడ్చలేదు. స్టోన్‌ డస్ట్‌ కొట్టుకుపోయి ప్రస్తుతం గుంతలు మిగిలాయి. వాహనాల వేగానికి దుమ్ము రేగుతూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. అధికారపక్ష సభ్యుడు, పట్టణ వైకాపా అధ్యక్షుడు చంద్రరావు ఇటీవల జరిగిన పురపాలక సమావేశంలో ఈ రహదారి గురించి మాట్లాడుతూ.. ఇలాంటి మరమ్మతుల చేయడం కంటే మానుకోవడమే మేలంటూ మండిపడ్డారు.

నాణ్యతతో పనిలేదు

గుంతల మరమ్మతులకు పురపాలికలు రూ.లక్షల్లో నిధులు కేటాయిస్తున్నా.. చేసిన పనుల్లో నాణ్యత లేమి కనిపిస్తోంది. వేసిన కొన్ని రోజులకే   యథాస్థితికి వస్తున్నాయి. దీంతో అధికారులు నామమాత్రంగా చేసి నిధులు దారి మళ్లిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో మరమ్మతులకు చతురస్రాకారంలో గుంతలు తవ్వేవారు. అందులో తారువేసి రాళ్లు, వెట్‌మిక్స్‌ కలిపి వేసేవారు. తారు వేసేముందు ఒకరోజు తడిపేవారు. ప్రస్తుతం అలాంటివి ఏమీ చేయకుండా వేసేస్తున్నారు. దీంతో వర్షాలు కురిస్తే మళ్లీ రాళ్లు లేచిపోతాయి. భీమవరం పట్టణంలోని 39 వార్డుల్లోని రహదారుల మరమ్మతులకు రూ.50 లక్షలు కేటాయించారు. రెస్ట్‌హౌస్‌రోడ్డులో మరమ్మతుల నిమిత్తం వేసిన రాళ్లు పైకి లేచి ప్రమాదకరంగా ఉన్నాయి.

చేశామంటే చేశాం

నరసాపురం పురపాలికలో రహదారులకు మరమ్మతులు చేశామంటే చేశాం అన్న రీతిలో అధికారుల తీరు ఉంది. రూ.12 లక్షలు కేటాయించి పార్కురోడ్డు, కోర్టువీధి, టవర్‌వీధి, మన్నెవారివీధుల్లో గుంతలు పూడ్చారు. ప్రస్తుతం తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. నాణ్యత లేమి కొద్ది రోజుల్లోనే బయటపడింది.  గుంతల పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. పట్టణంలోని వైఎస్‌ఆర్‌ నగర్‌, మిషన్‌హైస్కూలురోడ్డు, ఆంధ్రాబ్యాంకు తదితర ప్రాంతాల్లోని రహదారులు దెబ్బతిన్నా వాటికి  ఈ మాత్రం మరమ్మతులు కూడా చేయలేదన్న విమర్శలున్నాయి.

పార్కురోడ్లో మరమ్మతులు చేయాల్సిన ప్రాంతం

పూడ్చారు.. ఏమార్చారు

ఏలూరు వన్‌టౌన్‌ కొత్త రోడ్డులో పెట్రోలు బంక్‌ సమీపంలో ఈ గుంతను 4 నెలల క్రితం పూడ్చారు.   అక్కడే గ్రావెల్‌ లేచిపోయి యథావిధిగా గొయ్యి ఏర్పడింది. నాణ్యతాప్రమాణాలను విస్మరించడంతో ఇలా తయారైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లోనూ రోడ్ల పరిస్థితి ఇదే. గుంతలు పూడ్చారు గానీ సక్రమంగా పనులు చేయకపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటంలేదు.

సాధారణ నిధులు.. ఇష్టారాజ్యం

నగరబాట పేరుతో రహదారులు మరమ్మతులు చేయాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ఈ పరిస్థితి జిల్లావ్యాప్తంగా లేదు. అన్ని చోట్లా సాధారణ నిధుల నుంచే కేటాయిస్తున్నారు. దీంతో సొమ్మొకరిది..సోకొకరిది అంటూ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం 35వ వార్డులో కొన్నేళ్లుగా భూగర్భ మురుగు బోదె వ్యవస్థ, కొన్ని సంస్థలు తవ్విన పైపు లైన్లు, మంచినీటి పైపులైన్ల పనుల్లో భాగంగా కొన్ని సీసీ రహదారులు ధ్వంసమయ్యాయి. వాటిని సంబంధిత గుత్తేదారులే నిర్మించాల్సి ఉన్నా.. అధికారులు ప్రత్యేక నిధులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. రూ.21 లక్షల వ్యయంతో పట్టణంలోని 342 గుంతలు పూడ్చారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

ఈ అంశంపై రాజమహేంద్రవరం ఆర్‌డీ సత్యనారాయణరావును వివరణ కోరగా ‘సీసీ దారుల నాణ్యత విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారితో పాటు గుత్తేదారులను కూడా బాధ్యులను చేస్తాం. నాసిరకంగా వేసిన రహదారులపై సమీక్ష చేసి దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని