logo

దొరికిన దొంగల ముఠా

ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రం ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో 

Published : 21 Jan 2022 05:20 IST

స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రం ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికా గార్గ్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కారాగారంలో పరిచయంతో మకాం...: వడ్డే మోషేది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సత్యనారాయణపేట. అతను ఏలూరు, విశాఖపట్నంలోని పలు చోరీ కేసుల్లో నిందితుడు. నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న సమయంలో.. ప్రకాశం జిల్లా ఒంగోలు ఇందుర్తినగర్‌కు చెందిన కోట బంగారయ్యతో అతనికి పరిచయం ఏర్పడింది. 2019 డిసెంబరులో జైలు నుంచి బయటకు వచ్చిన మోషే.. ఏడాది క్రితం ఒంగోలుకు మకాం మార్చాడు. ఇందిరానగర్‌కు చెందిన కసుకుర్తి అభినవ్‌, కుర్రా శివశంకర్‌, పాములపాటి దుర్గాప్రసాద్‌లతో కలిసి ఒక ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా పగటి వేళల్లో ఒంగోలులో ఆటో నడుపుకొంటూ రాత్రివేళల్లో దేవాలయాల్లో హుండీలు చోరీ చేసేవారు. పలుచోట్ల తాళం వేసిన ఇళ్లలోనూ దొంగతనాలకు పాల్పడ్డారు. గుంటూరులోని కొత్తపేటలో ఇటీవల ఆటోను అపహరించారు. అందులో సంచరిస్తూ చోరీలు చేస్తున్నారు. ఇంకొల్లు మండలం కొణికిలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. జిల్లాలో సుమారు 14 వరకు నేరాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడించినట్టు ఎస్పీ తెలిపారు.

రూ.5 లక్షల సొత్తు

నిందితుల నుంచి చోరీలకు వినియోగిస్తున్న ఆటో, 56 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక సీసీ కెమెరా, మానిటర్‌, రూ.1.45 లక్షల నగదు సహా మొత్తం రూ.అయిదు లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టు, చోరీ సొత్తు రికవరీకి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ గార్గ్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని