logo

కీలక నేతలతో చంద్రబాబు భేటీ!

 మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు

Published : 29 Mar 2024 05:28 IST

మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గ అభ్యర్థులకు సూచనలు 

రేపు భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి రాక

చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న తెదేపా తంబళ్లపల్లె నియోజకవర్గ అభ్యర్థి జయచంద్రారెడ్డి దంపతులు, పక్కన మదనపల్లె నియోజకవర్గ అభ్యర్థి షాజహాన్‌ బాషా,  తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు తదితరులు

 ఈనాడు, కడప: మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మదనపల్లె, తంబళపల్లె అభ్యర్థుల గెలుపుపై ప్రత్యేకంగా సమాలోచనలు జరిపారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, తెదేపా వైయస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల అభ్యర్థులు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు, నాయకులు బాలసుబ్రహ్మణ్యం. మల్లికార్జుననాయుడు, బత్యాల చెంగల్రాయుడు, రూపానందరెడ్డి, సుగవాసి ప్రసాద్‌ బాబు తదితరులతో భేటీ అయ్యారు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల అభ్యర్థులు షాజహాన్‌బాషా, జయచంద్రారెడ్డితో వేర్వేరుగా మాట్లాడారు. జయచంద్రారెడ్డి దంపతులతో  మాట్లాడుతూ తంబళ్లపల్లెలో గెలుపు అవకాశాలున్నాయని, అందరినీ కలుపుకొంటూ వ్యూహంతో ముందడుగేయాలని ఆదేశించారు. మీకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడా రాజీపడకుండా గెలుపునకు ఎత్తులు వేయాలని, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని గట్టిగా సూచించారు. షాజహాన్‌బాషాకు సైతం పలు సూచనలు చేశారు. ఏలోటొచ్చినా పార్టీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. టిక్కెట్‌ రాక పోవడంతో అసంతృప్తితో ఉన్న మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌, పార్టీ నేత రాటకొండ బాబురెడ్డితో పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు మాట్లాడిన అనంతరం వారి అభిప్రాయాలను చంద్రబాబుకు వివరించారు. పార్టీ ఎన్నో ఒడిదొడుకులు చూసిందని, పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందని, నష్టం చేసేవారిని గుర్తు పెట్టుకుంటుందని కఠినంగా హెచ్చరించారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ చంద్రబాబును కలిశారు. రాజకీయంగా నీ భవిష్యత్తుకు ఏలోటు రాదని, పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై కీలక నేతలతో చర్చించారు. సామాజిక సమతుల్యతపై కసరత్తు చేశారు. ఇదిలా ఉండగా భాజపా రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో బెంగళూరు చేరుకుని అక్కడ నుంచి మదనపల్లెకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి స్వగ్రామం కలికిరి మండలం నగిరిపల్లెకు చేరుకుని తెదేపా, భాజపా నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల ప్రచారం, గెలుపు వ్యూహాలపై పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులతో చర్చించనున్నారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు