logo

యువత మరణాలు వైకాపా ప్రభుత్వ హత్యలే!

‘అయిదేళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్‌ను ఇంటికి పంపిస్తాం. యువత మరణాలన్నీ వైకాపా ప్రభుత్వ హత్యలే’ అని నిరుద్యోగ ఐకాస నాయకులు మండిపడ్డారు.

Published : 28 Apr 2024 05:50 IST

నిరుద్యోగులను మోసగించిన సీఎం
జగన్‌ రానున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపుతాం
కదం తొక్కిననిరుద్యోగ చైతన్య యాత్ర
న్యూస్‌టుడే, చిన్నచౌకు (కడప)

కడపకు చేరుకున్న నిరుద్యోగ చైతన్య యాత్రకు మద్దతు తెలుపుతున్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ తదితరులు

‘అయిదేళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్‌ను ఇంటికి పంపిస్తాం. యువత మరణాలన్నీ వైకాపా ప్రభుత్వ హత్యలే’ అని నిరుద్యోగ ఐకాస నాయకులు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానన్న తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అనంతపురంలో ప్రారంభమైన నిరుద్యోగ చైతన్య యాత్ర శనివారం కడపకు చేరుకుంది. ఈ సందర్భంగా తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, తదితరులు యాత్రకు మద్దతు తెలిపారు. నిరుద్యోగ ఐకాస నాయకులు మాట్లాడుతూ కడప ఉక్కు కర్మాగారం నిర్మించి పదివేల మందికి ఉపాధి కల్పిస్తానని సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ఏమైందని వారంతా ప్రశ్నించారు. సొంత జిల్లాలో పరిశ్రమను పూర్తి చేయలేని వ్యక్తి ఇక రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారని విమర్శించారు. మొత్తం 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని, ప్రతి ఏటా మెగా డీఎస్సీ విడుదల చేస్తామని మోసగించారన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తామని జగన్‌రెడ్డి హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. యాత్రలో నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమలేశ్‌, గ్రేటర్‌ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఓబులేసు, గంగాధర్‌ ఉన్నారు.


జగన్‌ మోసాలను ఎండగడతాం
- షేక్‌ సిద్ధిక్‌, నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌

నిరుద్యోగ యువతకు జగన్‌ చేసిన మోసాలను ఎండగట్టి, అందరికీ తెలియజేయడానికి చైతన్యయాత్రను ప్రారంభించాం. జగన్‌ సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమకు రెండు సార్లు భూమి పూజ చేశారు. ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా ఏర్పాటు చేయలేదు. అయిదేళ్ల కాలంలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కంటి తుడుపుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. జగన్‌ ఏం చేశారని ఓట్లు వేయాలి. ఉద్యోగాలు లేక యువత గంజాయికి బానిసలవుతున్నారు.  జగన్‌ను మళ్లీ గెలవనివ్వం.


నీకెందుకు ఓటేయాలి జగన్‌?
- ఓబులేసు, గ్రేటర్‌ రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రధాన కార్యదర్శి, కడప

అయిదేళ్ల కాలంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారు. వేల రూపాయలు వెచ్చించి డీఎస్సీ శిక్షణ తీసుకున్న వారందరూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అభివృద్ధి చేసి ఉంటే ఓట్లు వేయమని సీఎం అనడం విడ్డూరంగా ఉంది. వైకాపా పాలనలో 1,300 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయిదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. జగన్‌కు ఎందుకు ఓట్లేయాలి. రానున్న ఎన్నికల్లో ప్రజలే ఆయనను కాలర్‌ పట్టుకుని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారు.


ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డాం
- తిరుమలేశ్‌, జిల్లా అధ్యక్షుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. తర్వాత వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉద్యోగాలు లేక చాలామంది ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పడుతున్నారు. పలువురు రోడ్డున పడ్డారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే రాష్ట్రం బాగుపడుతుంది.  


అయిదేళ్లు వృథా
- ద్రవిడయ్య, విజయనగరం

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దీంతో అయిదేళ్ల కాలాన్ని వృథా చేసుకున్నాం. పోయిన వయసు తిరిగి రాదు. 2019లో 23 వేల ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. అప్పులు చేసి శిక్షణ పొందాము. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు.  రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించి చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిని చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని