logo

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై మైనార్టీల తిరుగుబాటు

జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ముస్లిం మైనార్టీలు తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేశారు. జమ్మలమడుగులోని ఆయన కార్యాలయాన్ని బుధవారం రాత్రి వారంతా ముట్టడించి నిరసన తెలిపారు.

Published : 18 Apr 2024 04:22 IST

జమ్మలమడుగులో వైకాపా కార్యాలయం ముట్టడి

ఈనాడు, కడప, జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ముస్లిం మైనార్టీలు తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేశారు. జమ్మలమడుగులోని ఆయన కార్యాలయాన్ని బుధవారం రాత్రి వారంతా ముట్టడించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే అనుచరుడి నోటి దురుసుతనంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. తన ముఖ్య అనుచరుడు, జమ్మలమడుగు నగర పంచాయతీ ఒకటో వార్డు వైకాపా కౌన్సిలర్‌ ముల్లా జానీ, హజ్‌ కమిటీ ఛైర్మన్‌ గౌస్‌లాజంతో కలిసి ఈ నెల 16న మైలవరం మండలం దొమ్మరనంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో కొంత మంది ముస్లిం సోదరులు.. తమ మసీదు అభివృద్ధి విషయంలో గతంలో ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించగా.. ఆయన సరైన సమాధానం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కౌన్సిలర్‌ ముల్లాజానీ స్పందిస్తూ..ఎమ్మెల్యేకు ఈ విషయంపై పూర్తిగా అవగాహన లేదని చెప్పారు. ఈ సందర్భంగానే జమ్మలమడుగులోని ప్రముఖ పీఠాధిపతినుద్దేశించి కౌన్సిలర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలున్న వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి తీరుపై ముస్లిం సోదరులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎమ్మెల్యే అండ చూసుకుని కౌన్సిలర్‌ రెచ్చిపోతున్నారంటూ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు వందలాదిగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కార్యాలయంలోనే ఉన్నారు. ఎమ్మెల్యే తరఫున వైకాపా నాయకులు కొందరు ముస్లిం సోదరులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ముల్లాజానీపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కౌన్సిలర్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని, పార్టీ నుంచి బహిష్కరించాలని పట్టుబట్టారు. క్షమాపణలు చెప్పించడంతోపాటు పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామనే హామీతో శాంతించారు. ఈ ఘటన కవరేజీ కోసం వెళ్లిన మీడియాను వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఘటన బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వ్యవహారం పెద్ద దుమారం రేపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని