icon icon icon
icon icon icon

కోటీశ్వరుల మధ్య యుద్ధం!

మధ్యప్రదేశ్‌లోని రెండో విడత ఎన్నికల బరిలోకి కోటీశ్వరులు దిగారు. మొత్తం 6 నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న 80 మందిలో 26 మంది మిలియనీర్లే. ఈ నెల 26వ తేదీన ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.

Updated : 25 Apr 2024 06:53 IST

6 నియోజకవర్గాల్లో పోటీపడుతున్న 26 మంది మిలియనీర్లు
మధ్యప్రదేశ్‌ రెండో విడతలో హోరాహోరీ పోరాటం

ధ్యప్రదేశ్‌లోని రెండో విడత ఎన్నికల బరిలోకి కోటీశ్వరులు దిగారు. మొత్తం 6 నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న 80 మందిలో 26 మంది మిలియనీర్లే. ఈ నెల 26వ తేదీన ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. వాస్తవానికి ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఒక చోట బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నికను మే 7వ తేదీకి మార్చారు. ఇక్కడి అభ్యర్థుల్లో 17 మంది కనీసం పదో తరగతి కూడా చదవలేదు.

అభివృద్ధి కోరుకుంటున్న టీకంగఢ్‌

బుందేల్‌ఖండ్‌లోని టీకంగఢ్‌ నియోజకవర్గం డీలిమిటేషన్‌ తర్వాత ఏర్పాటైంది. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ మూడు సార్లు భాజపా గెలిచింది. అభివృద్ధి మార్గాల కోసం ఆరాటపడుతున్న టీకంగఢ్‌లో మరోసారి ఎన్నికలు రావడంతో ఓటర్ల తీరుపై ఆసక్తి నెలకొంది. మోదీ గ్యారంటీతో నాలుగో సారి గెలవాలని భాజపా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ వీరేంద్ర కుమార్‌ ఖటీక్‌కు టికెట్‌ ఇచ్చింది. ఇప్పటికే ఆయన ఇక్కడ మూడు సార్లు గెలిచారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థులను మారుస్తూ వస్తోంది. ఖటీక్‌ను ఎదుర్కొనేందుకు ఈసారి యువ నేత పంకజ్‌ అహిర్‌వార్‌ను బరిలోకి దించింది. గత ఎన్నికల్లో భాజపా ఇక్కడ 61.3 శాతం ఓట్లను సాధించింది. గత 15ఏళ్లలో వీరేంద్ర కుమార్‌ నియోజకవర్గానికి ఏం చేశారని అహిర్‌వార్‌ ప్రశ్నిస్తున్నారు. స్థానికత, యువత అంశాలను కాంగ్రెస్‌ ప్రస్తావిస్తోంది. నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. దెబ్బతిన్న కాలువను మరమ్మతు చేయలేదు. పక్క ప్రాంతాల్లో నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కనీసం రెండు లైన్ల రోడ్లైనా లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన విద్యా, వైద్య సౌకర్యాల్లేవు. రవాణా సౌకర్యమూ లేదు. చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వర్షాధారంపైనే పంటలు పండుతాయి. 16,16,201 మంది జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో 31.4 శాతం ఎస్సీ, ఎస్టీలున్నారు. 28.9శాతం మంది ఓబీసీలున్నారు.

ఆత్మ గౌరవ దమోహ్‌

దేశ రాజకీయాల్లో దమోహ్‌ నియోజకవర్గానిది ప్రత్యేక పాత్ర. అధికార కేంద్రంగా దీనిని చూస్తారు. మధ్యప్రదేశ్‌లో ఇది కీలక నియోజకవర్గం. ఈ సారీ ఇక్కడి ప్రజలు తమ ఓటు శక్తిని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ భాజపా నుంచి రాహుల్‌ లోధీ, కాంగ్రెస్‌ నుంచి తర్వర్‌ సింగ్‌ లోధీ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఎన్నికల్లో ప్రత్యర్థులు. గత ఎన్నికల్లో భాజపా భారీ మెజారిటీతో గెలిచింది. 35ఏళ్లుగా భాజపాదే ఇక్కడ ఆధిపత్యం. మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి కుమారుడు వి.ఎస్‌.గిరి ఇక్కడి నుంచి ఒకసారి గెలిచారు. ఈ నియోజకవర్గంలో 19,09,886 ఓట్లున్నాయి. ఇక్కడ పోటీ చేస్తున్న హిజ్రా దుర్గా మౌసీ భాజపా, కాంగ్రెస్‌లను ఆందోళనకు గురి చేస్తున్నారు. కన్వారా గ్రామ సర్పంచిగా ఉన్న దుర్గ రోజుకు 100 కిలోమీటర్లు స్కూటర్‌పై తిరిగి ప్రచారం చేస్తున్నారు. మోదీ గ్యారంటీ గురించి రాహుల్‌ లోధీ ప్రచారం చేస్తున్నారు. ఆత్మ గౌరవం నినాదాన్ని తర్వర్‌ సింగ్‌ వినిపిస్తున్నారు.

ఐదోసారీ..

సతనాలో ఐదోసారి గెలిచి తీరాలని భాజపా అభ్యర్థి గణేశ్‌ సింగ్‌ తలపోస్తున్నారు. సతనా స్మార్ట్‌ సిటీలో భాగంగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి మరింత జరగాలని కోరుకుంటున్న సతనా వాసులు గణేశ్‌ సింగ్‌ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2004 నుంచి ఆయన ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ప్రధాని మోదీకే తమ మద్దతని స్థానికులు కొందరు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ బీఎస్పీకి గణనీయ సంఖ్యల్లో ఓట్లున్నాయి. సతనా వింధ్య రీజియన్‌లోని బఘెల్‌ఖండ్‌ ప్రాంతంలో ఉంది. ఇక్కడ బ్రాహ్మణులు, పటేల్‌లు, ఠాకుర్‌లతోపాటు ఓబీసీలు గెలుపును ప్రభావితం చేస్తారు. ఎస్సీ, ఎస్టీలు తక్కువగా ఉన్నారు.  

కంచుకోట ఖజురాహో

మధ్యప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు విష్ణు దత్‌ శర్మ పోటీ చేస్తుండటంతో ఖజురాహో వీఐపీ నియోజకవర్గంగా మారిపోయింది. ఆయనపై పదవీ విరమణ చేసిన అధికారి ఆర్‌బీ ప్రజాపతి ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురి కావడంతో ప్రజాపతికి ఇండియా కూటమి మద్దతిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ అగ్ర నేతలెవరూ నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడలేదు. గతంలో ఇక్కడ భాజపా ఫైర్‌ బ్రాండ్‌ ఉమా భారతి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో 25,87,685 మంది ప్రజలున్నారు. అందులో 81.78 శాతం మంది గ్రామీణులే. 18.57శాతం మంది ఎస్సీలు, 15.13 శాతం మంది ఎస్టీలున్నారు. ఇది భాజపాకు కంచుకోట లాంటిదే. గత ఎన్నికల్లో దాదాపు 5లక్షల మెజారిటీ వచ్చింది.

ముళ్లబాట

వింధ్య ప్రాంతంలోని రీవా నియోజకవర్గంలో భాజపాకు గెలుపు అంత సులభంగా లేదు. ఇక్కడ కమలదళం అభ్యర్థి జనార్దన్‌ మిశ్రకు కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మిశ్ర గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటిదాకా ఏకపక్షంగా భాజపా విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మారిందని వారంటున్నారు. గట్టి పోటీ నెలకొందని చెబుతున్నారు. ప్రస్తుతం చెరి సగం విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో భాజపా దీనిపై గట్టిగా ఫోకస్‌ పెట్టింది. కాంగ్రెస్‌కు ఇక్కడ అభ్యర్థే బలమని అంటున్నారు.  

కమల దళానిదేనా?

నర్మదాపురంగా పిలిచే హోశంగాబాద్‌ నియోజకవర్గంలో భాజపాదే పైచేయి. ఇందులోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో భాజపా గెలిచింది. ఈసారి ఆ పార్టీ తరఫున దర్శన్‌ సింగ్‌ చౌధరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకంతోపాటు నర్మదా నది శుద్ధి ప్రాధాన్యాంశాలు. కాంగ్రెస్‌ వాటిని సరిగా వినియోగించుకోలేకపోతోంది. ఆ పార్టీలోని నేతలకూ ఇందులో వాటాలు ఉండటమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నర్మదా నది శుభ్రపరచడానికి పనులు చేపట్టినా ముందుకు సాగడం లేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి సంజయ్‌ శర్మ బరిలో ఉన్నారు.

ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు, అభ్యర్థుల సంఖ్య

  • హోశంగాబాద్‌: 12
  • దమోహ్‌ 14
  • టీకంగఢ్‌: 7
  • రీవా: 14
  • సతనా: 19
  • ఖజురాహో: 14

పోటీలో ఉన్నవారు..

  • పురుషులు: 75 మంది
  • మహిళలు: నలుగురు
  • హిజ్రాలు: ఒకరు
  • హోశంగాబాద్‌ నుంచి పోటీ చేస్తున్న సంజయ్‌ శర్మ అత్యంత సంపన్నుడు. ఆయనకు రూ.232 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
  • రీవా కాంగ్రెస్‌ అభ్యర్థికి నీలం మిశ్రకు రూ.34 కోట్ల ఆస్తులున్నాయి.
  • సతనా భాజపా అభ్యర్థికి రూ.9 కోట్ల ఆస్తులున్నాయి.
  • దమోహ్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాహుల్‌ భయ్యాకు కేవలం రూ.33,000 ఆస్తులే ఉన్నాయి. సతనాలో పోటీ చేస్తున్న మరో స్వతంత్ర అభ్యర్థికి రూ.75,000, హోశంగాబాద్‌ స్వతంత్ర అభ్యర్థికి రూ.లక్ష ఆస్తులే ఉన్నాయి.
  • రెండో విడత బరిలో ఇద్దరు వైద్యులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
  • రెండో విడత అభ్యర్థుల్లో 9 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. అందులో ఐదుగురిపై తీవ్రమైన అభియోగాలున్నాయి.
  • పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 13 మంది గ్రాడ్యుయేట్లు. వీరిలో ఏడుగురు వృత్తి నిపుణులు. ముగ్గురు ఐదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. 9 మంది 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారు. 8 మంది 10వ తరగతి ఉత్తీర్ణులయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img