KCR - CM Revanth: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌ రెడ్డి

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)ను సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) పరామర్శించారు.

Updated : 10 Dec 2023 14:18 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను రేవంత్‌ (Revanth Reddy) పరామర్శించారు. మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌.. కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి కేటీఆర్‌, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వెలుపల మీడియాతో సీఎం మాట్లాడారు.

‘‘కేసీఆర్‌ను పరామర్శించాను.. క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించా. కేసీఆర్‌ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నాం. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం ఉంది. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడాల్సిన అవసరముంది. త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్‌ను కోరా’’ అని చెప్పారు.

ఎవరి మీదా కావాలని కక్ష సాధించం.. తప్పులుంటే చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తన నియోజకవర్గానికి చెందిన కార్యకర్తను పరామర్శించేందుకు యశోద ఆస్పత్రికి వచ్చినట్లు ఆయన చెప్పారు. అనంతరం అక్కడే కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిశానన్నారు. ‘‘కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని పొన్నం అన్నారు.

కాగా, గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో కేసీఆర్‌ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న వైద్యులు శనివారం వాకర్‌ సాయంతో నెమ్మదిగా అడుగులు వేయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని