‘దేవుడా.. పిల్లల్ని ఇవ్వకపోతివి..పెంచుకుంటున్న బిడ్డనూ పట్టుకుపోతివి’

దేవుడా.. నాకేమో పిల్లల్ని ఇవ్వకపోతివి.. అక్క కుమార్తెను గారాబంగా పెంచుకుంటుండగా పట్టుకుపోతివి అంటూ ఆ తల్లి రోదన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. టిఫిన్‌ బాక్స్‌, పాఠశాల సంచి పట్టుకొని బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వస్తోందని ఆశగా ఎదురుచూస్తున్న ఆమె విగతజీవిగా రోడ్డుపై కనిపించిన బిడ్డను చూసి బోరున విలిపించింది.

Updated : 31 Jan 2024 10:23 IST

ఇంటి ముందే కుమార్తె దుర్మరణం చెందడంతో విలపించిన తల్లి

రోదిస్తున్న కుటుంబీకులు

మెదక్‌, మెదక్‌ రూరల్‌: దేవుడా.. నాకేమో పిల్లల్ని ఇవ్వకపోతివి.. అక్క కుమార్తెను గారాబంగా పెంచుకుంటుండగా పట్టుకుపోతివి అంటూ ఆ తల్లి రోదన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. టిఫిన్‌ బాక్స్‌, పాఠశాల సంచి పట్టుకొని బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వస్తోందని ఆశగా ఎదురుచూస్తున్న ఆమె విగతజీవిగా రోడ్డుపై కనిపించిన బిడ్డను చూసి బోరున విలిపించింది. ఈ విదారకర ఘటన మంగళవారం మెదక్‌లో చోటుచేసుకుంది. పట్టణ సీఐ దిలీప్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. మెదక్‌కు చెందిన నందిని, రవి దంపతులకు సంతానం లేదు.  సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో ఉండే నందిని సోదరి నవీన, భిక్షపతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరి రెండో కుమార్తె అనుశ్రీ(6)ని దత్తత తీసుకున్నారు. చిన్నారి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. రోజూ పాఠశాల బస్సులో వెళ్లివస్తోంది. మంగళవారం సాయంత్రం ఇంటికి రాగానే బస్సు నుంచి కిందికి దిగింది. ముందుకు పరుగెత్తుతుండగా డ్రైవరు అజాగ్రత్తగా నడపడంతో తగిలి కింద పడగా, తలపై నుంచి టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన జరగ్గానే డ్రైవరు, క్లీనర్‌ పరారయ్యారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు ఆగ్రహంతో బస్సు అద్దాలను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. డీఎస్పీ ఫణిందర్‌, మెదక్‌ పట్టణ, గ్రామీణ సీఐలు దిలీప్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిలు వారిని సముదాయించారు. కేసు నమోదైంది.


అనుమానాస్పద స్థితిలో కార్మికుడు..

పరిశ్రమ ఎదుట మృతదేహంతో బాధితుల ఆందోళన

హత్నూర: పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగిన ఘటన హత్నూర మండలం బోర్పట్లలో జరిగింది. ఎస్‌ఐ సుభాష్‌ తెలిపిన వివరాలు.. బోర్పట్లకు చెందిన కొప్పు నర్సింహులు(32) గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమలో తాత్కాలిక కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విధులకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబీకులకు చెప్పకుండా మృతదేహాన్ని పరిశ్రమ యాజమాన్యం సంగారెడ్డి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. విషయం తెలుసుకున్న బాధితులు ఆగ్రహించి ఆసుపత్రికి వెళ్లి వాహనంలో మృతదేహాన్ని పరిశ్రమ వద్దకు తెస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మృతిపై అనుమానాలున్నాయని ఆరోపిస్తూ అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. స్థానికులు మద్దతు తెలిపారు. నర్సింహులు మృతికి యాజమాన్యమే కారణమని, పరిహారం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని జిన్నారం సీఐ వేణుకుమార్‌ సర్దిచెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


కారు ఢీకొని ద్విచక్రవాహనదారుడు..

జహీరాబాద్‌: జహీరాబాద్‌ మండలం బూర్దిపాడ్‌ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకలోని మన్నెల్లి గ్రామానికి చెందిన వినోద్‌(31) దుర్మరణం చెందాడు. జహీరాబాద్‌ రూరల్‌ ఎస్సై ఎస్‌.ప్రసాదరావు తెలిపిన వివరాలు.. సొంతంగా జేసీబీ కలిగిన వినోద్‌ జహీరాబాద్‌లో మంగళవారం పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. బూర్దిపాడ్‌ శివారులో వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


భూతగాదాలతో వ్యక్తిపై హత్యాయత్నం

చిలప్‌చెడ్‌: భూ తగాదాలతో వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ఘటన చిలప్‌చెడ్‌ మండలం రాందాస్‌గూడలో కలకలం రేపింది. ఎస్సై షేక్‌ మహబూబ్‌ తెలిపిన వివరాలు.. రాందాస్‌గూడకు చెందిన మురళీధర్‌రావు, ఇప్ప వెంకటేశ్వర్‌రావులు దగ్గరి బంధువులు. మురళీధర్‌రావు భూమిని వెంకటేశ్వర్‌రావు 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. నెల రోజులుగా మురళీధర్‌రావు కుమారుడు అరుణ్‌కుమార్‌ ఆ భూమి తనదంటూ గొడవ పడుతున్నాడు. మంగళవారం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ పరిధి షాపూర్‌నగర్‌కు చెందిన మిత్రులు దినేష్‌, రాహుల్‌లతో కలిసి వెంకటేశ్వర్‌రావు ఇంట్లోకి ప్రవేశించాడు. ముగ్గురూ కలిసి ఆయనపై కత్తితో దాడి చేశారు. కాపాడండి అంటూ బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అరుణ్‌కుమార్‌, రాహుల్‌లు పారిపోయారు. దినేష్‌కుమార్‌ పట్టుబడగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడిని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై వివరించారు.

రైలు కిందపడి.. ప్రాణాలతో బయటపడి

వికారాబాద్‌: కదులుతున్న రైలు ఎక్కబోయిన ప్రయాణికుడు పట్టు తప్పి ప్లాట్‌ ఫాం- రైలుకు మధ్యన పడిపోయి ప్రాణాలతో బయటపడిన ఘటన వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగింది. వివరాలు ఇలా..రైల్వే రక్షణ దళం, స్థానికులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం నుంచి బయల్దేరిన యశ్వంత్‌పూర్‌ రైలు ఎక్కడానికి కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన సతీష్‌ పరుగెత్తాడు. పట్టు తప్పి ప్లాట్‌ఫాం- రైలు మధ్య పడిపోయాడు. కొంత దూరం రైలు ఈడ్చుకెళ్లింది. అక్కడున్న వారు కేకలు వేశారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేశారు. ఇరుక్కుపోయిన అతడిని రైల్వే రక్షణదళం పోలీసులు ప్లాట్‌ఫాం గచ్చు తొలగించి బయటికి తీశారు. స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


కడుపునొప్పి భరించలేక కూలీ ఆత్మహత్య

రాయపోల్‌: కడుపునొప్పి భరించలేక కూలీ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రఘుపతి తెలిపిన వివరాలు.. రాయపోల్‌కు చెందిన బ్యాగరి శ్రీహరి (40) కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిస కావడంతో కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దవాఖానాకు వెళ్లి చికిత్స పొందినా తగ్గలేదు. సోమవారం కడుపు నొప్పి వస్తోందని ఇంట్లో చెప్పగా ఆయన భార్య పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆమె కూలీ పనులు ముగించుకుని రాత్రి వచ్చేసరికి శ్రీహరి రేకుల షెడ్డులో ఉరేసుకుని మృతి చెంది కనిపించాడు. భార్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సమస్యలతో మరొకరు..

జహీరాబాద్‌: భార్యాపిల్లలతో కలిసి ఉండాలని తల్లి మందలించిందన్న కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మొగుడంపల్లి మండలం విఠునాయక్‌తండాలో చోటుచేసుకుంది. చిరాగ్‌పల్లి ఎస్సై మాణిక్‌ తెలిపిన వివరాలు.. విఠునాయక్‌తండాకు చెందిన చౌహాన్‌ మాణిక్‌(40)కు భార్యాపిల్లలున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారితో కొంతకాలం కిందట గొడవపడిన ఆయన అప్పటి నుంచి తల్లితో కలసి తండాలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంకెంత కాలం ఇలా ఒంటరిగా ఉంటావని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన అతను సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


ఆశ చూపి.. సొమ్ము కాజేసి..

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: పెట్టుబడికి రెండింతలు వస్తాయని ఆశ చూపి ఖాతాలో నుంచి నగదు కాజేసిన ఘటన గజ్వేల్‌లో చోటుచేసుకుంది. సిద్దిపేట సీపీ అనూరాధ తెలిపిన వివరాలు..  తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాబాలు వస్తాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి గజ్వేల్‌ ప్రాంతానికి చెందిన ఒకరికి టెలిగ్రామ్‌ ద్వారా ఓ లింకును పంపించాడు. దాన్ని తెరిచిన సదరు వ్యక్తి అందులో అడిగిన వివరాలు నమోదు చేశాడు. అవతలి వ్యక్తి సూచించిన విధంగా రూ.1000 పెట్టుబడి పెట్టగా అవతలి వ్యక్తి రూ.2000 తిరిగి పంపించాడు. ఆశ పడిన బాధితుడు విడతల వారీగా రూ.6,11,108 పంపించాడు. తిరిగి నగదు రాకపోయే సరికి టెలిగ్రామ్‌ యాప్‌ తెరిచి అతడి ఖాతాను చూడగా బ్లాక్‌ చేసి ఉంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930 నెంబరుకు ఫిర్యాదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని