Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 29 Aug 2021 17:05 IST

1. ప్రతిభను గుర్తించి ఒలింపిక్స్‌కు పంపడమే లక్ష్యం: కిషన్‌రెడ్డి

దేశ వ్యాప్తంగా క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ఒలింపిక్స్‌కు పంపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా వర్సిటీలో స్పోర్ట్స్‌ క్లస్టర్‌కు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

2. ఎందుకు నోరు మెదపరు?: దేవినేని ఉమ

కర్ణాటక ముఖ్యమంత్రి ఆల్మట్టి ఎత్తు పెంపు తథ్యమని మాట్లాడుతున్నా.. తెలంగాణ సీఎం కృష్ణా జలాల్లో 50 శాతం నీటి వాటా తమదే అంటున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు నోరు మెదపడం లేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తును 524 మీటర్లకు పెంచుతామని కర్ణాటక చెబుతుంటే ఎందుకు ఒక్క మాటా మాట్లాడటం లేదని నిలదీశారు.

3. అందువల్లే నాకు పీసీసీ పదవి వచ్చింది: రేవంత్‌రెడ్డి

కొంపల్లిలో బోధన్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాజీవ్‌ రైతు దీక్ష పేరుతో నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన సభ విజయవంతం కావడం దిల్లీ కాంగ్రెస్‌కు చేరింది. అందువల్లే నాకు టీపీసీసీ పదవి వచ్చింది. మూతపడ్డ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని తెరాస హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు. త్వరలో గజ్వేల్‌, నిజామాబాద్‌లో భారీ సభ ఏర్పాటు చేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. 

4. మాతో చర్చించే అర్హత మంత్రి బొత్సకు లేదు: అమరావతి ఐకాస నేతలు

తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు మండిపడ్డారు. రాజధాని అంశంపై తాము స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే చర్చిస్తామని.. బొత్సకు తమతో చర్చించే అర్హత లేదని స్పష్టం చేశారు.

5. సొంత గూటికి చేరుతున్న ఎస్పీ నేతలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ ఇచ్చిన పిలుపునకు వారు స్పందిస్తున్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీని బలోపేతం చేసుకునేందుకు పాత నాయకులను ఆయన మళ్లీ ఆహ్వానిస్తున్నారు. దాంతో శనివారం మాజీ మంత్రి అంబికా చౌదరి బీఎస్పీని విడిచిపెట్టి ఎస్పీలో చేరారు.

6. అఫ్గాన్‌లో మారుతున్న సమీకరణాలు భారత్‌కు సవాలే..!

అఫ్గానిస్థాన్‌లో వేగంగా మారుతున్న సమీకరణాలు భారత్‌కు సవాలేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అక్కడ నెలకొన్న పరిణామాలతో ప్రభుత్వం కూడా తన వ్యూహాన్ని పునరాలోచించుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడింది. తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పాటు జంటపేలుళ్ల అనంతరం అక్కడ నెలకొన్న భయానక వాతావరణం దృష్ట్యా అక్కడి పరిస్థితులను భారత్‌ నిశితంగా గమనిస్తోంది.

7. ఆ ప్రాంతాల్లో 80 శాతం అదృశ్యమయ్యే ప్రమాదం!

ముందుజాగ్రత్తలు తీసుకోకపోతే ముంబయిలోని కీలక ప్రాంతాలన్నీ సముద్రంలో మునిగిపోయే ముప్పు పొంచి ఉంది. 2050 నాటికి రాష్ట్ర సచివాలయమైన ‘మంత్రాలయ’, వ్యాపార కేంద్రమైన నారిమన్‌ పాయింట్‌లలో 80 శాతం మేర అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులు కారణంగా సముద్ర మట్టాలు పెరగనుండడమే ఇందుకు కారణం. 

8. కరోనా నుంచి కోలుకున్నవారికి ఒక డోసు కొవాగ్జిన్‌తో రెండింతల లబ్ధి 

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారికి ఒక డోసు కొవాగ్జిన్‌ టీకా వేసినప్పుడు రెట్టింపు ప్రయోజనం కలుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో వెల్లడైంది. వ్యాధి బారినపడని వారితో పోలిస్తే వీరికి ఒక డోసు వల్ల రెండు డోసుల స్థాయిలో యాంటీబాడీ స్పందన కలుగుతోందని తేలింది. ఈ అధ్యయన వివరాలు ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’లో తాజాగా ప్రచురితమయ్యాయి.

9. బైడెన్‌ సమర్పణలో.. ‘హాలీవుడ్‌ తాలిబన్‌’..!

కాబుల్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ‘మేము మారాం..’ ‘ఇది పాత తాలిబన్‌ కాదు.. సరికొత్త తాలిబన్‌’.. ‘మా గత తప్పుల నుంచి నేర్చుకొన్నాం’ అంటూ అదే పనిగా చెబుతున్నారు. కానీ, కాబుల్‌ వీధుల్లో వారి సైనికులు సాధారణ ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలు చూస్తూ.. వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిసిపోతోంది. ఒక్క చోట మాత్రం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అది ఆయుధాల్లో..!  

10. కోహ్లీ, రహానె, పుజారా ఇకనైనా పెద్ద స్కోర్లు చేయాలి: ఇంజమామ్

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, చెతేశ్వర్‌ పుజారా ఇకనైనా భారీ స్కోర్లు సాధించాలని లేదంటే జట్టు కష్టాల్లో పడుతుందని పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ విశ్లేషించాడు. గతరెండేళ్లుగా కోహ్లీ, పుజారా ఒక్క సెంచరీ చేయలేకపోయారని గుర్తుచేశాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు