Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Nov 2022 13:17 IST

1. మూన్‌లైటింగ్‌ చేస్తున్నారా? పన్నులు తప్పవు మరి!

 అదనపు ఆదాయం కోసం ఐటీ రంగంలో కొంతమంది నిపుణులు మూన్‌లైటింగ్‌ (Moonlighting) చేస్తున్నారు. అంటే ఒక ప్రధాన ఉద్యోగంతో పాటు ఖాళీ సమయాల్లో మరో సంస్థకు ప్రాజెక్టులు చేసిపెడుతున్నారు. ఇలా చేస్తున్నవారు పన్ను (Income Tax) చెల్లించడానికి సిద్ధంగా ఉండాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అదనపు ఆదాయాన్ని కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నుల్లో (ITR) చూపించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఐటీ నోటీసులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నెతన్యాహూ విజయంతో ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు

ప్రధానిగా బెంజిమన్‌ నెతన్యాహూ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమైన వెంటనే ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు మొదలయ్యాయి. నిన్న ఈ దాడులు జరిగినట్లు సమాచారం. గాజాపట్టీ నుంచి నాలుగు రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించారు. వీటిల్లో ఒక్కదానిని ఐరన్‌డోమ్‌ వ్యవస్థ అడ్డుకొంది. ఈ దాడులకు ఇస్లామిక్‌ జిహాద్‌ సంస్థ బాధ్యతను తీసుకొంది. అల్‌-బద్ర్‌ గ్రూప్‌ కమాండర్‌ను ఇజ్రాయెల్‌ దళాలు మట్టుబెట్టాయి. దీనికి ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెరాస నేతలు నిజాయితీగా ఉంటే ఎందుకు ప్రమాణం చేయరు?: తరుణ్‌ఛుగ్‌

తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్‌ కోల్పోయారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ఛుగ్‌ విమర్శించారు. ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో భాజపా నేతలపై కేసీఆర్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలో దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ కేసుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని తరుణ్‌ఛుగ్‌ మరోసారి స్పష్టం చేశారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేయాలని తాము చూడలేదన్నారు. కేసీఆర్‌ తన పార్టీ గురించి ఆందోళన చెందుతున్నారని.. ఫాంహౌస్‌లోనే సినిమా కథ అల్లారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన గ్రానైట్‌ లారీ.. విద్యార్థులకు తప్పిన ముప్పు

హైదరాబాద్‌ శివారు దుండిగల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు విద్యార్థులకు ముప్పు తప్పింది. శుక్రవారం ఉదయం బోరంపేటకు చెందిన ‘ది క్రీక్‌ ప్లానెట్‌’ స్కూల్‌కు చెందిన బస్సు గండిమైసమ్మ చౌరస్తాలో విద్యార్థులను ఎక్కించుకుని బహుదూర్‌పల్లి శ్రీరామ్‌నగర్‌ కాలనీ వద్ద యూటర్న్‌ చేస్తోంది. ఈ క్రమంలో గండి మైసమ్మ నుంచి బాలానగర్‌ వైపు గ్రానైట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి స్కూల్‌ బస్సును ఢీకొట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దిల్లీలో ప్రైమరీ స్కూళ్ల మూసివేత.. మళ్లీ ‘సరి-బేసి’..?
దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ప్రకటించారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేంతవరకు ఈ మూసివేత కొనసాగుతుందన్నారు. ఐదు, అంతకంటే పైతరగతుల విద్యార్థుల అవుట్‌డోర్‌ గేమ్స్‌ను కూడా నిలిపివేస్తున్నామని తెలిపారు. అంతేగాక, ట్రాఫిక్‌ నియంత్రణకు మరోసారి ‘సరి-బేసి’ని అమలు చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఇంటికెళ్లండి.. ఆఫీసుకు రావొద్దు’..: ట్విటర్‌ ఉద్యోగులకు మెయిల్‌..!

ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి కంపెనీలో ఉద్యోగుల కోతలపై అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలో సగం మంది ఉద్యోగుల్ని మస్క్‌ తొలగించే యోచనలో ఉన్నారని, అందుకోసం ఇప్పటికే జాబితా కూడా సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఉద్యోగుల కోతలు శుక్రవారం నుంచే మొదలుకానున్నట్లు తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  రికార్డులు చెరిపేసి కొత్తవి సృష్టించేందుకు ఒకడుంటాడు.. అతడే విరాట్‌ : జయవర్దనే

ఆసియా కప్‌తో తిరిగి ఫామ్‌ అందుకున్న టీమ్‌ఇండియా పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ పొట్టి ప్రపంచకప్‌లోనూ సంచలన ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ స్టార్‌ బ్యాటర్‌ మరో రికార్డును కొల్లగొట్టిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేలా జయవర్దనే పేరిట ఉన్న రికార్డును చెరిపేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన రికార్డును కోహ్లీ అధిగమించడంపై జయవర్దనే స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నాది చెత్త కామెడీ అంటూ ట్రోల్స్‌ చేశారు: అనుదీప్‌

 ‘జాతిరత్నాలు’, ‘ప్రిన్స్‌’ చిత్రాలతో ప్రేక్షకులకు తన కామెడీ టైమింగ్‌ను రుచి చూపించారు దర్శకుడు అనుదీప్ (Anudeep)‌. ‘ప్రిన్స్‌’ విజయంపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన సినిమాల్లోని కామెడీ టైమింగ్‌కు ప్రశంసలే కాకుండా.. విమర్శలూ వచ్చాయన్నారు. కొంతమంది చెత్త కామెడీ అంటూ కామెంట్లు చేశారని తెలిపారు. ‘‘ప్రశంసలే కాదు.. నాపై చాలా ట్రోల్స్‌ కూడా వచ్చాయి. కొంతమంది నాది చెత్త కామెడీ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ప్రియాంక అందగత్తె కాదు.. రిగ్గింగ్‌ చేసి గెలిచింది..!’: మాజీ సుందరి ఆరోపణ

గ్లోబల్‌ స్టార్‌, బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra)పై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మిస్‌ బార్బడోస్‌ లెయ్‌లానీ మెకనీ. ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్రియాంక రిగ్గింగ్‌ చేసి సొంతం చేసుకుందని ఆమె అన్నారు. ఆనాటి ప్రపంచ సుందరి పోటీల గురించి వివరిస్తూ లెయ్‌లానీ వీడియో షేర్‌ చేసింది. ‘‘మిస్‌ బార్బడోస్‌గా నేను 2000లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్నాను. ఆ ఏడాది మిస్‌ ఇండియా (ప్రియాంక చోప్రా) ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కోహ్లీతో అదే చర్చించా: కేఎల్‌ రాహుల్‌

టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి టీమ్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని కేఎల్‌ రాహుల్‌ నిలబెట్టుకొన్నాడు. మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో దాదాపు 20 నిమిషాలు సుదీర్ఘంగా స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీతో ఏదో విషయంపై రాహుల్‌ సీరియస్‌గా మాట్లాడుతూ కనిపించాడు. అనంతరం మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో రాహుల్‌- కోహ్లీ మధ్య ఏం చర్చ జరిగిందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మ్యాచ్‌ అనంతరం కోహ్లీతో ఏం చర్చించాడో రాహుల్‌ బయటపెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని