Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 16 Mar 2022 09:15 IST

1. సర్వేల్లో బాగుంటేనే టికెట్లు
‘వచ్చే రెండేళ్లూ పరీక్షా సమయం.. ఎవరి పనితీరు బాగా లేకపోయినా ఏ మాత్రం ఉపేక్షించబోను’ అని వైకాపా ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ‘ఇంటింటికీ తిరగాలి. మీ పని తీరును కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. పార్టీ మళ్లీ గెలవడమే అత్యంత ప్రధానం. జుట్టు ఉంటే ఎలాగైనా ముడివేసుకోవచ్చు. జుట్టే లేకపోతే ముడి ఎలా వేసుకునేది? పని తీరు బాగా లేదని సర్వేల్లో తేలిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేద’ని పేర్కొన్నారు.

2. జీవో 111ను రద్దు చేస్తాం
నిపుణుల కమిటీ నివేదిక రాగానే జీవో 111ను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బడ్జెట్‌ పద్దులపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన నాలుగురోజుల విశ్రాంతి అనంతరం శాసనసభకు హాజరై సుదీర్ఘంగా మాట్లాడారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధవర్గాలకు పలు వరాలు ప్రకటించారు.

3. పరిమితికి మించి రాష్ట్ర అప్పులు
చెల్లించాల్సిన రుణం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన లక్ష్యాలకు తగ్గట్లుగానే ఉన్నా, బడ్జెటేతర రుణాలను పరిగణనలోకి తీసుకుంటే లక్ష్యానికి మించి అప్పులు ఉన్నాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొంది. 2019-20లో తీసుకున్న రుణాల్లో 75 శాతానికి పైగా, 2020-21లో తీసుకున్న రుణాల్లో 76.53 శాతం వరకు గతంలో తీసుకున్న అప్పులు చెల్లించడానికే వినియోగించాల్సి రావడంతో ఆస్తుల కల్పన మీద దాని ప్రభావం పడిందని తెలిపింది.

4. చైనాలో 3 కోట్ల మంది లాక్‌డౌన్‌ లోకి
కరోనా వైరస్‌ తొలిసారి బయటపడిన చైనాను ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ రూపంలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. రెండేళ్ల తర్వాత తొలిసారి.. చైనాలో మంగళవారం అత్యధికంగా 5,280 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే కేసులు రెట్టింపయ్యాయి. కొత్తకేసు ఒక్కటీ రాకూడదన్న(జీరో-టాలరెన్స్‌) వ్యూహంతో.. రెండేళ్లకు పైగా కొవిడ్‌ను కట్టడి చేస్తూ వస్తున్న డ్రాగన్‌కు ఈ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. వరుసగా ఆరో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.

5. 5జీ హుజూర్‌!
రోజురోజుకీ మొబైల్‌ విప్లవం కొత్తరూపు సంతరించుకుంటోంది. 1జీ, 2జీ, 3జీ, 4జీలు దాటుకొని 5జీలోకి అడుగుపెడుతోంది. డేటా మార్పిడి వేగాన్ని గణనీయంగా పెంచేసే,  వైర్‌లెస్‌ కనెక్షన్ల తీరుతెన్నులను సమూలంగా మార్చేసే ఇది శరవేగంగా దూసుకొస్తోంది. స్మార్ట్‌ నగరాల వసతులు, స్వయంచాలిత వాహనాల వంటి అధునాతన డేటా టెక్నాలజీలకు పెద్ద ఊపు నివ్వగలదని భావిస్తున్నారు.

6. వారంలో రూ.2,100 తగ్గిన బంగారం
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఒకపక్క యుద్ధం కొనసాగుతున్నా, ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచే సమయం ఆసన్నం కావడంతో బంగారం నుంచి పెట్టుబడులను మదుపర్లు ఉపసంహరిస్తున్నారు. ముడిచమురు బ్యారెల్‌ ధర కూడా 100 డాలర్ల దిగువకు పరిమితమైనందున, ద్రవ్యోల్బణ భయాలు కూడా కాస్త తగ్గుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి.

7. ప్రేమ ఔషధాలు!
జ్వరం తగ్గటానికి మందులేసుకుంటాం. నొప్పులు తగ్గటానికి మాత్రలేసుకుంటాం. మరి ప్రేమ పుట్టటానికో? ప్రేమను పుట్టించే మందులా? అంతలా ఆశ్చర్యపోనవసరం లేదు. ‘ప్రేమ ఔషధాల’ వాడకం ఇటీవల బాగానే పెరిగిపోతోంది. కాకపోతే నైతిక విలువల పరంగానే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయేవారు కొందరు. నెలలు, ఏళ్ల కొద్దీ ప్రయత్నించినా విఫల ప్రేమతో ముగించేవారు మరికొందరు.

8. గాంధీలు స్వయంగా వైదొలగాలి: సిబల్‌
 ఉత్తర్‌ప్రదేశ్‌ సహా మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత భగ్గుమంటున్నాయి! పార్టీలో ‘గాంధీ’ల నాయకత్వం కొనసాగుతుండటంపై సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. వారు వైదొలగి, ఇతర నేతలకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ పార్టీగా కాకుండా అందరి పార్టీగా కాంగ్రెస్‌ ఉండాలని అభిలషించారు.

9. నా పాత్రని ద్వేషిస్తే నేను బాగా చేసినట్టు!
ఏకాస్త ఏమరపాటుగా ఉన్నా... ప్రాణాలనే మూల్యంగా చెల్లించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో క్షణక్షణం అప్రమత్తంగా ఉంటూనే ‘కశ్మీర్‌ఫైల్స్‌’ చిత్రాన్ని నిర్మించారామె. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’... 90ల నాటి కశ్మీర్‌ పరిస్థితులపై తీసిన చిత్రం ఇది. ‘మనమీ దేశంలో భాగం కాదు. అలాంటప్పుడు ‘అజాద్‌ కశ్మీర్‌’ కోసం పోరాడితే తప్పేంటి?’ అంటూ స్థానిక యువతని రెచ్చగొట్టే జేఎన్‌యూ ప్రొఫెసర్‌ రాధికమేనన్‌ పాత్రలో అద్భుతంగా నటించారు పల్లవీజోషి.

10. పాండ్య సేన.. వేస్తుందా ముద్ర?
అహ్మదాబాద్‌ కేంద్రంగా గుజరాత్‌ టైటాన్స్‌ ఆవిర్భవించింది. మెగా వేలానికి ముందే గతేడాది అక్టోబర్‌లో దుబాయ్‌లో   జరిగిన వేలంలో కార్పొరేట్‌ వెంచర్స్‌ క్యాపిటల్‌ (సీవీసీ) రూ.5625 కోట్లు పెట్టి గుజరాత్‌ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. రూ.15 కోట్లు వెచ్చించి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను దక్కించుకున్న టైటాన్స్‌.. అతడికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని