Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తులు..

Updated : 20 Oct 2022 21:19 IST

1. మునుగోడులో ధనబలంతో గెలవాలని భాజపా కుట్ర చేస్తోంది: మంత్రి కేటీఆర్‌

ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ తెరాసలో చేరారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ .. భిక్షమయ్యగౌడ్‌కు తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ... భాజపా ఒక దుష్ట సంస్కృతికి తెరలేపిందని విమర్శించారు. ధనబలంతో మునుగోడులో గెలవాలని భాజపా కుట్ర చేస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. బంజారాహిల్స్‌ ఘటనపై గవర్నర్‌ దిగ్భ్రాంతి.. నివేదిక ఇవ్వాలని ఆదేశం

బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన తీవ్ర దిగ్భ్రాంతి, మనో వేదనకు గురిచేసిందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తెలిపారు. దారుణానికి పాల్పడిన నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం నుంచి సవివర నివేదిక కోరారు. మరో వైపు లైంగిక దాడి ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి సఫిల్‌గూడలో ఉన్న ఆ పాఠశాల ప్రధానశాఖ వద్ద ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి
నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. దాదాపు 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్‌, 3,580 సివిల్‌ కానిస్టేబుల్‌, 315 సివిల్‌ ఎస్‌ఐ, 96 రిజర్వ్ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం ముద్ర వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మాతో ఒకలా.. మీడియా ముందు మరోలానా..? థరూర్‌పై కాంగ్రెస్‌ సీరియస్‌

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసిన సీనియర్ నేత శశిథరూర్‌ రిగ్గింగ్‌ ఆరోపణలతో సంచలనం సృష్టించారు. తాజాగా వాటిపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. తమ ముందు ఒకలా, మీడియా ముందు మరోలా ప్రవర్తించారని దుయ్యబట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. దాతృత్వంలో శివ్‌ నాడార్‌ అగ్రస్థానం.. రోజుకి రూ.3 కోట్ల విరాళం

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ శివ్‌ నాడార్‌ దాతృత్వంలో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. 2021-22లో ఆయన రూ.1,161 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే సగటున రోజుకు దాదాపు రూ.3 కోట్లను వితరణగా అందించారు. ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2022 జాబితాలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.484 కోట్ల విరాళంతో రెండో స్థానానికి చేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. టపాసులకు ఖర్చు చేసే బదులు.. స్వీట్లు కొనుక్కోండి: సుప్రీంకోర్టు

దేశ రాజధాని దిల్లీలో బాణసంచా నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే వీలు కల్పించాలని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం.. టపాసుల కోసం చేసే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. పరీక్ష వాయిదా వేయించేందుకు గొంతు కోశాడు.. ఐదేళ్ల తర్వాత బెయిలొచ్చింది!

పరీక్షను వాయిదా వేయించాలనే ఉద్దేశంతో అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థి గొంతు కోశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2017లో గుడ్‌గావ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి.. అదే పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి గొంతు కోశాడు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ట్రస్‌ రాజీనామా

ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న బ్రిటన్‌(Britain)లో పరిస్థితులు తారస్థాయికి చేరాయి. తాజాగా బ్రిటన్‌ ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌(Liz truss) రాజీనామా చేశారు. బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత జరిగిన కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో రిషి సునాక్‌పై విజయం సాధించిన  లిజ్‌ట్రస్‌ సెప్టెంబర్‌ 6న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. గూగుల్‌కు సీసీఐ భారీ జరిమానా

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌కు భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. ఇందుకు ప్రతిగా రూ.1337.76 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. అలా దాడి చేస్తారా? అయితే మహాపాపం మూటగట్టుకుంటారు..

అవసరమైతే.. తైవాన్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో బలప్రయోగానికి వెనకాడబోమని కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) 20వ మహాసభల్లో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిని తైవాన్ తిప్పికొట్టింది. తమపై దాడి చేస్తే.. చైనా అధ్యక్షుడు పాపిగా మిగులుతారంటూ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని