Philanthropy List: దాతృత్వంలో శివ్‌ నాడార్‌ అగ్రస్థానం.. రోజుకి రూ.3 కోట్ల విరాళం

గత నాలుగేళ్లలో రూ.10 కోట్లకు పైగా వితరణ చేస్తున్న వారి సంఖ్య భారత్‌లో 116 పెరిగిందని హురున్‌ ఇండియా ఫిలాంత్రోపీ నివేదిక తెలిపింది. ఈ ఏడాది హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ వితరణలో అగ్రస్థానంలో నిలిచారు. 

Published : 20 Oct 2022 18:01 IST

ముంబయి: సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ శివ్‌ నాడార్‌ దాతృత్వంలో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. 2021-22లో ఆయన రూ.1,161 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే సగటున రోజుకు దాదాపు రూ.3 కోట్లను వితరణగా అందించారు. ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2022 జాబితాలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.484 కోట్ల విరాళంతో రెండో స్థానానికి చేరారు. వరసగా రెండు సంవత్సరాల పాటు ఈ జాబితాలో ప్రేమ్‌జీ ఈసారి తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ రూ.190 కోట్ల విరాళంతో జాబితాలో ఏడోస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 15 మంది శ్రీమంతులు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా విరాళాలిచ్చారు.

ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ ఛైర్మన్‌ రూ.142 కోట్లతో దేశంలోనే అత్యధిక విరాళం ఇచ్చిన ప్రొఫెషనల్‌ మేనేజర్‌గా నిలిచారు.

జీరోదాకు చెందిన నితిన్‌ కామత్‌, నిఖిల్‌ కామత్‌ వితరణ 300 శాతం పెరిగి రూ.100 కోట్లకు చేరింది. నిఖిల్‌ కామత్‌ ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు.

మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు సుబ్రతో బాగ్చీ, ఎన్‌ ఎస్‌ పార్థసారథి ఒక్కొక్కరు రూ.213 కోట్లు విరాళమిచ్చి హురున్‌ జాబితాలో తొలి పదిస్థానాల్లోకి ఎగబాకారు.

☞ ఐఐఎస్సీ బెంగళూరుకు రూ.105 కోట్లు ఇచ్చిన క్వెస్‌ కార్ప్‌ ఛైర్మన్‌ అజిత్‌ ఐజాక్‌ తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో ఆయన 12వ ర్యాంకులో ఉన్నారు.

ఐఐటీ కాన్పూర్‌లోని మెడికల్ సైన్సెస్‌ అండ్‌ టెక్‌కు రూ.100 కోట్ల విరాళమిచ్చిన ఇండిగో కో-ప్రమోటర్‌ రాకేశ్‌ గాంగ్వాల్‌ సైతం తొలిసారి ఈ జాబితాలో చేరారు.

ఇన్ఫోసిస్‌ నందన్‌ నిలేకని రూ.159 కోట్లు, క్రిస్‌ గోపాలకృష్ణన్‌ రూ.90 కోట్లు, ఎస్‌.డి.శిబులాల్‌ రూ.35 కోట్లు వితరణ చేసి వరుసగా 9, 16, 28వ స్థానాల్లో నిలిచారు.

ఈ ఏడాది కొత్తగా 19 మంది ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రోపీ జాబితాలో చేరారు. వీరి విరాళాల విలువ రూ.832 కోట్లు.

ఈ ఏడాది ఆరుగురు మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. రోహిణీ నిలేకని రూ.120 కోట్లు, లీనా గాంధీ తివారీ రూ.21 కోట్లు, అను అగా రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చారు.

రూ.10 కోట్ల కంటే ఎక్కువ వితరణ చేసిన వారి సంఖ్య గత నాలుగేళ్లలో 116 శాతం పెరిగి 80కి చేరింది.

అత్యధిక విరాళాలు విద్య కోసం అందాయి. తర్వాత కొవిడ్‌ నివారణ చర్యల కోసం కూడా భారీ ఎత్తున విరాళాలొచ్చాయి.

ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారి సగటు వయసు 69 ఏళ్లు.

ప్రాంతాలవారీగా చూస్తే ఈ జాబితాలో ముంబయి నుంచి 33 శాతం మంది, దిల్లీ నుంచి 16 శాతం, బెంగళూరు నుంచి 13 శాతం మంది ఉన్నారు.

ఫార్మా పరిశ్రమ (20 శాతం) నుంచి ఎక్కువ మంది దాతలు ఉన్నారు. రసాయనాలు, పెట్రోకెమికల్స్‌ తర్వాతి స్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని