Crakers Ban: టపాసులకు ఖర్చు చేసే బదులు.. స్వీట్లు కొనుక్కోండి: సుప్రీంకోర్టు

‘దిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు వీలు కల్పిద్దాం. టపాసులపై నిషేధాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరంలేదు’ - సుప్రీంకోర్టు వ్యాఖ్య

Updated : 20 Oct 2022 19:25 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో బాణసంచా నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే వీలు కల్పించాలని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం.. టపాసుల కోసం చేసే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది.

కాలుష్యాన్ని నివారించే ప్రయత్నాల్లో భాగంగా దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ చేపట్టాలని భాజపా ఎంపీ మనోజ్‌ తివారీ కోర్టును అభ్యర్థించగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది. కాగా.. టపాసుల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీ హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలైంది. చివరి నిమిషంలో టపాసుల విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించడం ఏకపక్షం, చట్టవిరుద్ధమని.. ఇది కొందరి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పిటిషనర్‌ ఆరోపించారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. బాణసంచాకు సంబంధించిన పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున తాము విచారించలేమని తెలిపింది.

ఇదిలా ఉండగా.. టపాసుల నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు దిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది. టపాసులు తయారు చేసినా, నిల్వ చేసినా, కాల్చినా.. వారికి జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తామని పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని