Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 20 May 2022 17:07 IST

1. బీబీ నగర్ ఎయిమ్స్‌లో వైద్య సేవలపై మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి

 బీబీ నగర్ ఎయిమ్స్‌ని సందర్శించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అక్కడ అందుతున్న వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి పలుమార్లు ఆస్పత్రిని సందర్శించారే తప్ప సదుపాయాల గురించి ఎప్పుడూ కేంద్రాన్ని అడగలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వమే ముందుకు వచ్చి బీబీ నగర్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి భూములు, భవనాలు ఇచ్చి అన్ని రకాలుగా సహకరించినా ప్రజలకు ఉపయోగం కలగటం లేదని అసహనం వ్యక్తం చేశారు.

2. పోలీసు నియామకాలు.. మరోసారి అభ్యర్థుల వయోపరిమితి పెంపు

తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసు నియామక మండలి చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ఈ విధానాన్ని మొదటిసారిగా అమలు చేస్తున్నారు.


Video: నిరసనల మధ్య ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం


3. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా: చంద్రబాబు

మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కొత్తగా రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రజలు ఒకసారి పరిశీలించాలన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నామని.. సంక్షోభాలు తెదేపాకి కొత్త కాదన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆశ ప్రజలందరిలో ఉందన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా అని చంద్రబాబు తెలిపారు.

4. దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకం: సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చింది. ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారంలో పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్‌ అభిప్రాయపడింది. నిందితులు ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదంటూ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పూర్కర్‌ కమిషన్‌ పేర్కొంది.

5. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తాం: పవన్‌ కల్యాణ్‌

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. జనసేనాని రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శించారు.


Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ఆహారపు అలవాట్లు..


6. కోర్టులో లొంగిపోయిన నవజోత్‌ సింగ్‌ సిద్ధూ..!

మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో నేడు ఆయన కోర్టులో లొంగిపోయారు. ఈ మధ్యాహ్నం పాటియాలాలోని తన నివాసం నుంచి జిల్లా కోర్టుకు వెళ్లిన ఆయన న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. అంతకుముందు సిద్ధూ ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

7. ఎలాన్‌ మస్క్‌పై లైంగిక ఆరోపణలు.. 2.5 లక్షల డాలర్లతో సెటిల్‌మెంట్‌..?

గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు సంబంధించి తాజాగా కొత్త వ్యవహారం బయటపడింది. ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సహాయకురాలితో అసభ్యంగా ప్రవర్తించారనే వార్త వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు రెండున్నర లక్షల డాలర్లు చెల్లించి స్పేస్‌ఎక్స్‌ సెటిల్‌మెంట్‌ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.


Video: విద్యుత్తు కనెక్షన్ కోసం అధికారుల కాళ్లపై పడిన ఓ రైతు


8. గుజరాత్‌, హిమాచల్‌లోనూ కాంగ్రెస్‌కు ఓటమే.. పీకే అంచనా..!

వరుస ఓటములతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘చింతన్‌ శివిర్‌’ నిర్వహించింది. ఈ కార్యక్రమంపై తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ స్పందించారు. అదో విఫల ప్రయత్నమని పేర్కొన్నారు. అంతేగాక, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ల్లోనూ ఆ పార్టీకి ఓటమి తప్పేలా లేదని అంచనా వేశారు.

9. పెను ఆహార సంక్షోభం అంచున శ్రీలంక..!

శ్రీలంక పెను ఆహార సంక్షోభం అంచున ఉందని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వచ్చే వ్యవసాయ సీజన్‌ నాటికి సరిపడా ఎరువులు కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. ‘‘సరిపడా సమయం లేకపోవడంతో ఈ యాలా(మే-ఆగస్టు) సీజన్‌లో ఎరువులు కొనుగోలు చేయలేము. మహా (సెప్టెంబర్‌-మార్చి) సీజన్‌కు సరిపడా ఎరువుల స్టాక్‌ను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నాం. తాజా పరిస్థితిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను’’ అని విక్రమసింఘే గురువారం రాత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.

10. హువావేపై నిషేధం విధించనున్న కెనడా!

చైనా అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్స్‌ సంస్థలైన హువావే, జడ్‌టీఈలను కెనడా 5జీ నెట్‌వర్క్‌ నుంచి నిషేధించనుంది. ఈ మేరకు రెండు సంస్థలపై కొన్ని ఆంక్షలను కెనడా పరిశ్రమల శాఖ  మంత్రి ఫ్రాకోయిస్‌ ఫిలిప్‌ ప్రకటంచారు. ఈ చర్యతో కెనడా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు మెరుగుపడనున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు ఈ సంస్థలపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బాటలోనే కెనడా ప్రయాణించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని