Venkaiah Naidu: ప్యాకేజ్డ్‌ ఆహారంతో జీవనశైలిని దెబ్బతీసే వ్యాధులు: వెంకయ్యనాయుడు

క్యాన్సర్, జీవనశైలిని దెబ్బతీసే వ్యాధులను అరికట్టడానికి మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యవసరమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

Updated : 01 Sep 2023 19:31 IST

హైదరాబాద్: క్యాన్సర్, జీవనశైలిని దెబ్బతీసే వ్యాధులను అరికట్టడానికి మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యవసరమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా వైద్యనిపుణులు ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌ స్వర్ణభారత్ ట్రస్టులో స్వర్ణ భారత్ ట్రస్టు, కేర్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, స్వర్ణభారత్ ట్రస్టు హైదరాబాద్ ఛాప్టర్ కార్యదర్శి బి.సుబ్బారెడ్డి, ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘‘క్యాన్సర్ బారిన పడిన బాధితులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం. నివారణకు వైద్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర చర్యలు తీసుకోవాలి. పొగాకు వాడకం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పొగాకు వాడకం ఎక్కువగా ఉన్నందున ఆ ఉత్పత్తుల వాడకం వల్ల వచ్చే నష్టాలపై వైద్యులు విస్తృతంగా ప్రచారం చేయాలి. మరోవైపు ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి జీవనశైలి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. సంప్రదాయ భారతీయ ఆహారం తీసుకోవడం మానేసి దుకాణాల్లో సిద్ధంగా ఉన్న ప్యాకేజ్డ్‌ ఫుడ్ తీసుకోవడం వల్లే రుగ్మతలు పెరిగిపోతున్నాయి. సామాజిక బాధ్యతగా దినపత్రికలు, ప్రచార, ప్రసార సాధనాలు, డిజిటల్ మీడియా కూడా ఆయా అంశాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలి’’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని