Dwaraka Tirumala: వైకాపా ఎంపీ పుట్టినరోజు వేడుకలు.. అధికారుల తీరుపై భక్తుల విస్మయం

ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రాంగణ పరిసరాల్లో వైకాపా నేతల హడావిడితో భక్తులు విస్మయానికి గురయ్యారు.

Updated : 22 Oct 2023 19:26 IST

ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాల్లో వైకాపా నేతల హడావిడితో భక్తులు విస్మయానికి గురయ్యారు. ఎంపీ పుట్టిన రోజు వేడుకలు శేషాచలం కొండపై నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ పుట్టినరోజు సందర్భంగా పార్టీ జెండాలు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా ద్వారకా తిరుమల ఆలయానికి చేరుకున్నారు. అంతే కాకుండా దేవస్థానానికి చెందిన కల్యాణ మండపంలో ఎంపీ పుట్టినరోజుకు సంబంధించి ఆలయ అధికారులు  భోజనాలు ఏర్పాటు చేశారు. వంటలు చేయడం, వడ్డించడం అంతా.. దేవస్థానం సిబ్బందితోనే చేయించారు. ఈ కార్యక్రమానికి వందల మంది కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన టీషర్టులు ధరించి భోజనాలకు హాజరవ్వడంతో పాటు, పార్టీ జెండాలతో ర్యాలీలు నిర్వహిస్తూ హడావుడి చేశారు. అడ్డు చెప్పాల్సిన దేవాదాయశాఖ అధికారులు వారికే వత్తాసు పలికారు.

కల్యాణ మండపాలకు అద్దె చెల్లించకుండా.. ఉచితంగా ఎంపీ పుట్టిన రోజు వేడుకలకు ఎలా ఇస్తారు? పుట్టినరోజు కార్యక్రమానికి ఆలయ సిబ్బందిని ఎలా వాడుకుంటారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శేషాచలం కొండపై వైకాపా పార్టీ కార్యాలయాన్ని తలపించేలా వేడుకలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ మీటింగ్‌లు, భోజనాల కార్యక్రమాలు పుణ్యక్షేత్రంలో చేయడం పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో ఆలయ ప్రతిష్ఠ మసకబారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని