Delta Fear: లాక్‌డౌన్‌లోకి ఆస్ట్రేలియా నగరాలు!

ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలు మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

Published : 29 Jun 2021 15:35 IST

కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న ప్రధాన నగరాలు

సిడ్నీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగిన ఆస్ట్రేలియా.. తాజాగా కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్‌లతో వణికిపోతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ వ్యాప్తిపై ఆందోళన చెందుతోంది. దీంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలు మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే సిడ్నీతోపాటు పలు నగరాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తుండగా తాజాగా బ్రిస్బేన్‌ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దాదాపు కోటి మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు..

కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వేరియంట్‌లు ప్రపంచ దేశాలకు అతివేగంగా వ్యాపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాలో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 23 కేసులు గుర్తించారు. దీంతో ఇప్పటికే సిడ్నీ, పెర్త్‌, డార్విన్‌ నగరాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అదేదారిలో  బ్రిస్బేన్ నగరపాలకమండలి వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు వెల్లడించింది. బ్రిస్బేన్‌తో పాటు సమీప తీర ప్రాంతాలైన క్వీన్స్‌లాండ్‌ ప్రాంతాల్లోనూ కొవిడ్ కట్టడి ఆంక్షలను విధిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారినుంచి ఈ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. దీంతో చాలాచోట్ల స్థానికంగా వైరస్‌ క్లస్టర్లు పెరుగుతున్నాయని అన్నారు.

సిడ్నీలో రెండు వారాలు..

క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్యతో ఆస్ట్రేలియా ప్రధాన నగరాలు ఆందోళన చెందుతున్నాయి. సిడ్నీలో కొన్ని రోజుల గడువులోనే 150 కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన సిడ్నీ.. రెండు వారాలపాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. డార్విన్‌లోనూ కేసుల సంఖ్య పెరగడంతో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు. అటు పెర్త్‌లోనూ వైరస్‌ తీవ్రత పెరగడంతో నాలుగురోజుల పాటు పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలా వైరస్‌ కట్టడికి ప్రధాన నగరాలు ఆంక్షల అమలుకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్‌ ఆంక్షలు విధిస్తోంది. కేవలం పాజిటివ్‌ కేసులులేని నగరాల నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది.

వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసినప్పటికీ..

వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా మొదటినుంచీ కఠిన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా కొన్నిరోజులపాటు దేశ సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. అయినప్పటికీ కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్‌లు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న డెల్టా వేరియంట్‌ కేసులు వెలుగు చూడడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీటికితోడు ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇప్పటికీ కేవలం ఐదు శాతం కంటే తక్కువ ప్రజలకు వ్యాక్సిన్‌ అందించినట్లు సమాచారం. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఆస్ట్రేలియావాసులు.. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఇలా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ అధికారులకు సూచించారు.

ఇదిలాఉంటే, ఇతర దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో వైరస్‌ విజృంభణ అదుపులోనే ఉందని చెప్పవచ్చు. మహమ్మారి వెలుగు చూసిన నాటినుంచి ఇప్పటివరకు అక్కడ 30వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 910 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని