Updated : 22 Apr 2022 10:43 IST

Jammu : ప్రధాని పర్యటనకు ముందు భారీ ఉగ్రదాడి..!

 ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతోన్న జమ్ముకశ్మీర్‌.. మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది హతం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ 2019 తర్వాత తొలిసారి జమ్ములో పర్యటించడానికి 48 గంటల ముందు భారీ ఉగ్ర దాడులు జరిగాయి. ఈ క్రమంలో భారీ ఎన్‌కౌంటర్‌ మొదలైంది. జమ్ములో ఓ సైనిక చెక్‌పోస్టు సమీపంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఒక సీఐఎస్‌ఎఫ్‌ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

జమ్ములో ఉగ్రదాడి జరగొచ్చని 21వ తేదీన భద్రతా దళాలకు నమ్మకమైన సమాచారం అందడంతో.. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని సుంజ్వాన్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. అదే సమయంలో సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్సును తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు అండర్‌ బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంఛర్‌ సాయంతో దాడి మొదలుపెట్టారు. ఈ ఘటనలో ఒక అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితోపాటు జమ్ముకశ్మీర్‌ పోలీసులు కూడా ఉన్నారు.

దాడి సమయంలో బస్సులో 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారు వెంటనే అప్రమత్తమై ఎదురుదాడి ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు ఆంగ్ల వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. మృతి చెందిన ఉగ్రవాదులు జైషే మహమ్మద్‌ గ్రూపునకు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌, మొబైల్‌ సర్వీసులను నిలిపివేశారు. డ్రోన్లను రంగంలోకి దించి ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్‌ డీజీపీ దల్బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘సుంజ్వాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతాదళాలపై భారీ ఎత్తున దాడి చేయడం కోసం వారు అక్కడ పొంచి ఉన్నారు’’ అని వెల్లడించారు. 2018లో కూడా సుంజ్వాన్‌లోని సైనిక క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పట్లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు ఆ ఘటనలో మరణించారు.

బారాముల్లాలో మరో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో గురువారం ప్రారంభమైన మరో ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబ కమాండర్‌ యూసఫ్‌ కంత్రూ కూడా ఉన్నట్లు సమాచారం. ఇతడు పోలీసుల టాప్‌టెన్‌ మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నాడు. బారాముల్లాలోని మాల్వా ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రమూక నక్కినట్లు భ్రదతా దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాడి మొదలుపెట్టడంతో నలుగురు సైనికులు, ఒక అధికారి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో దళాలు కూడా ఎదురు దాడి ప్రారంభించడంతో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. 

ఎవరీ యూసఫ్‌ కంత్రూ..

యూసఫ్‌ కంత్రూ 2005లో ఓవర్‌ గ్రౌండర్‌ వర్కర్‌గా హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థలో చేరాడు. అతడిని అదే ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. 2008లో జైలు నుంచి బయటకు వచ్చిన అతడు 2017లో తిరిగి ఉగ్రవాదుల్లో చేరాడు. అమాయక పౌరులు, పోలీసులు, రాజకీయ పార్టీల కార్యకర్తల హత్యల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత హిజ్బుల్‌ నుంచి లష్కరేలో చేరాడు. బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదులు గతంలో చాలా దాడుల్లో పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఈ ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతోంది.

2019 ఆగస్టులో 370 అధికరణను ఉపసంహరించుకొన్న తరవాత తొలిసారి ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా జమ్మూ ప్రాంతంలోని సాంబా జిల్లా పల్లీ గ్రామం నుంచి గ్రామీణ స్థానిక సంస్థలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని