ఆక్స్‌ఫర్డ్‌ టీకా: 5కోట్ల డోసులు సిద్ధం!

యావత్‌ దేశం ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ జనవరిలోనే భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా మరోసారి స్పష్టంచేశారు.

Published : 28 Dec 2020 21:08 IST

సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ వెల్లడి

పుణె: యావత్‌ దేశం ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ జనవరిలోనే భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నూతన సంవత్సరం శుభవార్తగా అభివర్ణించిన ఆయన, ఇప్పటికే దాదాపు 5కోట్ల ‘కొవిషీల్డ్‌’ టీకా డోసులను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.

‘ఇప్పటికే 4-5 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ టీకాలను నిల్వ చేసుకున్నాం. మరికొన్ని రోజుల్లోనే నియంత్రణ సంస్థల నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చిన వెంటనే ఎంత వేగంగా ప్రభుత్వం వాటికి తీసుకెళ్తుందనే అంశం వారి చేతుల్లోనే ఉంది. జులై 2021 నాటికి 30కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తాం’ అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. వ్యాక్సిన్‌కు అనుమతి వచ్చిన మొదటి, రెండు నెలల్లోనే పంపిణీ కాస్త ఆలస్యంగా సాగుతుందని.. అనంతరం ఈ ప్రక్రియ వేగం పుంజుకోనుందని తెలిపారు. ‘ప్రస్తుతం నియంత్రణ సంస్థలు ప్రయోగ సమాచారాన్ని విశ్లేషిస్తున్నాయి. ఈ సమయంలోనే చాలా మంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎటువంటి ఆందోళన అవసరం లేదు. 92నుంచి 95శాతం సమర్థతతో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ పనిచేస్తోంది. యూకేలో ఈ వారం లేదా జనవరి తొలి వారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో భారత్‌లోనూ అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఆ సంతోషకరమైన వార్త కోసం కాస్త సమయం వేచిచూడాల్సిందే’ అని అదర్‌ పునావాలా స్పష్టంచేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతులో మరికొన్ని సంస్థలు కలిసి ఏర్పాటైన ‘కోవాక్స్‌’ కూటమిలో భారత్‌ భాగమే. ఈ నేపథ్యంలో సీరం సంస్థ ఉత్పత్తి చేసేదానిలో 50శాతం భారత్‌కు, మిగతా మొత్తాన్ని కోవాక్స్‌కు కేటాయిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. ఇందులోభాగంగా తొలుత భారత్‌కు 5కోట్ల డోసులను అందజేస్తామని పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న దృష్ట్యా తొలి ఆరునెలలు వ్యాక్సిన్‌కు లోటు ఏర్పడే అవకాశం ఉందని సీరం అభిప్రాయపడింది.

ఇవీ చదవండి..
వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌: కరోనా పరిచయం చేయనున్న కొత్త కాన్సెప్ట్‌!
జనవరి తొలివారంలోనే ఆక్స్‌ఫర్డ్‌ టీకా?
ఆ రెండింటి కంటే ఆక్స్‌ఫర్డే బెటరేమో..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని