కరోనా కట్టడి: బీసీజీ వ్యాక్సిన్‌తో ప్రయోజనమే..!

కరోనా వైరస్‌ సంక్రమణను తగ్గించడంలో బీసీజీ టీకా మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు.

Updated : 21 Dec 2022 16:56 IST

మరిన్ని పరిశోధనలు అవసరమన్న అమెరికా శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌తో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాలపై కూడా ముమ్మర ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా క్షయ వ్యాక్సిన్‌ కూడా కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఇవ్వడంలో దోహదపడుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వైరస్‌ సంక్రమణను తగ్గించడంలో బీసీజీ టీకా మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. తాజాగా ఈ పరిశోధనా పత్రం జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఇన్వెష్టిగేషన్‌లో ప్రచురితమైంది.

క్షయ వ్యాధిని అడ్డుకునే లక్ష్యంతో దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచే బీసీజీ టీకాను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొన్నిదేశాల్లో వీటి వాడకం తగ్గించినప్పటికీ, భారత్‌ వంటి దేశాల్లో మాత్రం బీసీజీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో ఇది ఏ మేరకు పనిచేస్తుందనే విషయంపై విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. పరిశోధనలో భాగంగా కాలిఫోర్నియా సెడార్స్‌-సినాయ్‌ ఆసుపత్రిలోని దాదాపు 6వేల మంది ఆరోగ్యకార్యకర్తల రక్తాన్ని సేకరించి కొవిడ్‌ యాంటీబాడీల గురించి విశ్లేషించారు. అనంతరం వీరి ఆరోగ్య చరిత్రను అడిగి తెలుసుకున్నారు. టీబీ వ్యాక్సిన్‌ తీసుకోని వారికంటే బీసీజీ తీసుకున్న వారిలో దాదాపు 30శాతం మందికి కరోనా వైరస్‌ సోకలేదని విషయాన్ని గుర్తించారు. బీసీజీ టీకాలు తీసుకోని వ్యక్తుల్లో కంటే టీకా తీసుకున్న కొందరిలో తక్కువ యాంటీబాడీలను గుర్తించారు. టీకా తీసుకున్న వారిలో కొవిడ్‌ యాంటీబాడిల స్థాయి తక్కువగా ఉండడానికి ఆ టీకానే కారణమా? అనే విషయంపై స్పష్టత లేదని పరిశోధకుడు మోషే అర్థితి అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటే యాంటీబాడీల స్థాయి కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏదేమైనా కరోనా సంక్రమణను తగ్గించడంలో బీసీజీ ప్రభావం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు.

శ్వాసకోశ సమస్యలతో సహా ఇతర ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో బీసీజీ టీకా సమర్థవంతంగా పనిచేస్తుండడంతోనే కరోనాపై పరిశోధనలు ప్రారంభించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సమర్థవంతమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేవరకు ఇది కొంత ప్రయోజనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కచ్చితంగా తెలుసుకునేందుకు భారీ స్థాయిలో బీసీజీ టీకాపై పరిశోధనలు జరపాల్సిన అవసరాన్ని సెడార్స్‌-సినాయ్‌ వైద్యులు సూచిస్తున్నారు.

ఇప్పటికే, అమెరికాలో క్షయవ్యాధితో పాటు బ్లాడర్‌ క్యాన్సర్‌ చికిత్సలో బీసీజీ వ్యాక్సిన్‌ను వాడేందుకు ఎఫ్‌డీఏ అనుమతి ఉంది. వివిధ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ ఇది ప్రయోజనకారిగా ఉండడంతో, కరోనా వైరస్‌పై దీని ప్రభావాన్ని తెలుసుకునేందుకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. టెక్సాస్‌ ఎ&ఎం యూనివర్సిటీ, బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌, సెడార్స్‌-సినాయ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో బీసీజీ టీకాపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటు భారత్‌లోనూ టీబీ టీకాపై ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి. బీసీజీ టీకా వల్ల వయోధికులకు ప్రయోజనం ఉంటుందా? అనే అంశంపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) కూడా అధ్యయనం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని