చైనా నియంత్రణను అంగీకరించం: ట్రంప్‌

టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల కొనుగోలు ఒప్పందం తరవాత కూడా ఆ యాప్‌పై  చైనాకు చెందిన మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ నియంత్రణ కొనసాగడానికి ఏమాత్రం అంగీకరించమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తేల్చిచెప్పారు.

Published : 23 Sep 2020 01:18 IST

ఇది మా గౌరవానికి సంబంధించింది: చైనా

వాషింగ్టన్‌: టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల కొనుగోలు ఒప్పందం తర్వాత కూడా ఆ యాప్‌పై  చైనాకు చెందిన మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ నియంత్రణ కొనసాగడానికి ఏమాత్రం అంగీకరించమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తేల్చిచెప్పారు. యూఎస్‌ టిక్‌టాక్‌ వినియోగదారుల సమాచార భద్రత దృష్ట్యా దాని కార్యకలాపాలను అమెరికన్ సంస్థకు కట్టబెట్టాలని ట్రంప్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకు విధించిన గడువు కూడా ఇప్పటికే ముగిసిపోయింది. అయితే ప్రముఖ అమెరికన్ కంపెనీ ఒరాకిల్‌తో ఆ ఒప్పందం ఖాయమయ్యేట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు.

‘వారు ఈ ఒప్పందంతో ఏమీ చేయలేరు. ఒకవేళ చేయాలనుకుంటే, మేం ఒప్పందం కుదుర్చుకోం’ అంటూ చాలా తేలిగ్గా చెప్పేశారు. ‘అది పూర్తిగా ఒరాకిల్ నియంత్రణలోనే ఉండనుంది. పూర్తిగా వారి ఆధీనంలో లేదని గుర్తిస్తే, మేం ఆ ఒప్పందాన్ని ఆమోదించం’ అని స్పష్టం చేశారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే చైనా ఈ వ్యవహారంపై ప్రకటన చేసింది. బీజింగ్ ఈ ఒప్పందాన్ని తిరస్కరించే అవకాశం ఉందని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్‌ సంపాదకులు హు షిజిన్‌ ట్వీట్‌ చేశారు.  ‘ఈ ఒప్పందం చైనా భద్రత, ప్రయోజనాలు, గౌరవాన్ని ప్రమాదంలో పడేస్తుంది’ అని మండిపడ్డారు. 

కాగా, టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌, ఒరాకిల్, వాల్‌మార్ట్ కలిసి అమెరికాలో యాప్‌ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఏర్పాటు చేయబోయే కొత్త కంపెనీకి తన మద్దతు ఉంటుందని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూడు కంపెనీలు కలిసి టెక్సాస్‌ కేంద్రంగా ‘టిక్‌టాక్‌ గ్లోబల్‌’ అనే కొత్త సంస్థను నెలకొల్పుతున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని