టికెట్‌ ఇవ్వొద్దన్నందుకు మహిళా కార్యకర్తపై దాడి

అత్యాచారం కేసులో నిందితుడికి టికెట్‌ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించిన కాంగ్రెస్‌ పార్టీ మహిళా కార్యకర్తపై దాడి జరిగింది. పార్టీ అంతర్గత సమావేశం వేదికగా కనీసం మహిళ అని.....

Published : 11 Oct 2020 16:29 IST

డియోరియా (యూపీ): అత్యాచారం కేసులో నిందితుడికి టికెట్‌ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించిన కాంగ్రెస్‌ పార్టీ మహిళా కార్యకర్తపై దాడి జరిగింది. పార్టీ అంతర్గత సమావేశం వేదికగా కనీసం మహిళ అని కూడా చూడకుండా పలువురు పార్టీ నేతలు ఆమెపై చేయి చేసుకోవడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. యూపీలోని డియోరియాలో ఈ ఘటన జరిగింది. 

డియోరియా స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ముకుంద్‌ భాస్కర్‌ అనే వ్యక్తికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది. ఎన్నికల అంశంపై శనివారం పార్టీ అంతర్గత సమావేశం ఏర్పాటు చేయగా.. ఆ సమావేశంలో తారా యాదవ్‌ అనే మహిళా కార్యకర్త ఆయనకు టికెట్‌ ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఓ వైపు హాథ్రస్‌ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని పార్టీ పోరాడుతోంది. మరోవైపు ఓ అత్యాచారం కేసులో నిందితుడికి టికెట్‌ ఇస్తోంది. ఇది తప్పుడు నిర్ణయం. ఇది పార్టీకే కళంకం తెచ్చే విషయం’’ అంటూ ఆమె సమావేశంలో అభ్యంతరం వ్యక్తంచేశారు.

దీంతో అక్కడున్న పార్టీ నేతలు ఆమెపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఒకరిద్దరు నేతలు ఆమెపై దాడి జరగకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ప్రియాంక గాంధీ జోక్యం చేసుకోవాలని తారా యాదవ్‌ కోరారు. దాడి ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందించారు. ఈ అంశాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని