భారత్‌లో కరోనా @ 13లక్షలు దాటాయ్‌..!

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ ఈ మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతమవుతుండటంతో ప్రజల్లో.......

Published : 24 Jul 2020 21:57 IST

దేశంలో శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ ఈ మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతమవుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కరోనా కేసుల విషయంలో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది.  దేశంలో మొత్తం కొవిడ్‌ కేసులు 13 లక్షల మార్కును దాటేశాయి. గడిచిన 24గంటల్లో (గురువారం నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు) దేశ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసులు 12,87,945గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలో 9615, ఏపీలో రికార్డు స్థాయిలో 8147, తమిళనాడులో 6785, కేరళలో 885, మిగతా రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 13లక్షలు దాటేసింది. 

మహారాష్ట్రలో 13వేలు దాటిన మరణాలు 
మహారాష్ట్రలో కరోనా మహా విలయం కొనసాగుతోంది. తాజాగా మరో 9615 కేసులు, 278 మరణాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ ఒక్కరోజే 5714మంది డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,57,117గా ఉంది. వీరిలో 1,99,967 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. మరణాల సంఖ్య 13,132గా ఉంది. 

ఊపిరి పీల్చుకుంటున్న ధారావి

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబయిలోని ధారావి కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ఈ రోజు కొత్తగా కేవలం 6 కేసులు మాత్రమే వచ్చాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2519కి చేరగా.. వారిలో 2141మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 128 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. 

2 లక్షలకు చేరువలో తమిళనాడు

తమిళనాట కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. ఈ రోజు కొత్తగా 6785 కొత్త కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,99,749కి పెరగ్గా.. ఇప్పటివరకు కొవిడ్‌బారిన పడి మరణించిన వారి సంఖ్య 3320కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్‌తో పోరాడి 1,43,297 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 53,132 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యశాఖ వెల్లడించింది. 

ఏపీలో రికార్డు స్థాయి కేసులు
మరోవైపు, ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా 8147 కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 80,858కి చేరుకుంది. వీరిలో 39,935 మందికి కోలుకుని డిశ్చార్జి కాగా.. 933మంది మృతిచెందారు. 

కర్ణాటకలో కొత్తగా 5007 కేసులు
అలాగే, కర్ణాటకలోనూ కొవిడ్‌ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. శుక్రవారం మరో 5007 కేసులు, 110 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,870కి చేరగా.. 1724 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,791 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు 2037 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకొన్న వారి సంఖ్య 31,347కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 611 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని