నాగ్‌ చివరిదశ ప్రయోగం విజయవంతం

రక్షణ రంగంలో భారత్‌ మరో అడుగు ముందుకేసింది. భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తృతీయ శ్రేణి ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి నాగ్‌  చివరి దశ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ రేంజ్‌ నుంచి నాగ్‌ మిసైల్‌ కేరియర్‌ (ఎన్‌ఏఎమ్‌ఐసీఏ) ద్వారా దీనిని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో)...

Published : 22 Oct 2020 15:02 IST

దిల్లీ: రక్షణ రంగంలో భారత్‌ మరో అడుగు ముందుకేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి నాగ్‌  చివరి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ రేంజ్‌ నుంచి నాగ్‌ మిసైల్‌  క్యారియర్  (ఎన్‌ఏఎమ్‌ఐసీఏ) ద్వారా దీనిని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇక నాగ్‌ క్షిపణులు ఉత్పత్తి దశకు చేరుకున్నట్లయింది.

శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌ (ఏటీజీఎం)ను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. నాగ్ మిసైల్‌ క్యారియర్‌ను రష్యాకు చెందిన బీఎంపీ-2 పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇది లాక్‌ బిఫోర్‌ లాంచ్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలో క్షిపణి ప్రయోగానికి ముందే లక్ష్యాన్ని గుర్తిస్తారు. భారత్‌-చైనా మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ ఇటీవల వరుసగా క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. అత్యంత సమర్థవంతమైన క్షిపణులను దేశీయంగా తయారు చేయడంపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే  ఒడిశా తీరంలోని వీలర్‌ ఐలాండ్‌లో ఏపీజే అబ్దుల్‌ కలాం లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ వెహికల్‌ను ప్రయోగించింది. ఆ తర్వాత బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి, అణు సామర్థ్యం కలిగిన శౌర్య సూపర్‌ సోనిక్‌ క్షిపణి, జలాంతర్గాములను ధ్వంసం చేయగల క్షిపణి సహాయక టోర్పెడో, లేజర్‌ గైడెడ్‌ యాంటీ ట్యాంక్‌ క్షిపణులను భారత్‌ వరుసగా ప్రయోగించింది. అంతే కాకుండా శత్రుదుర్భేద్యమైన అభ్యాస్‌ గగన తల వాహనాల్ని, పృథ్వీ-2, రుద్రం-1 క్షిపణులను కూడా భారత్‌ ప్రయోగించి విజయం సాధించింది.

తాజాగా నాగ్‌ చివరి దశ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఆ క్షిపణులు ఉత్పత్తి దశకు చేరుకుంది. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) వీటిని ఉత్పత్తి చేయనుంది. మెదక్‌లోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఎన్‌ఏఎమ్‌ఐసీఏలను సమకూర్చనుంది. ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలు, డీఆర్‌డీవో సిబ్బందికి అభినందనలు తెలిపారు. డీఆర్‌డీవో ఛైర్మన్‌ డా. సతీశ్‌రెడ్డి తన సిబ్బందిని అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని